ప్రకృతి విపత్తు.. ఒకే కుటుంబాన్ని బలిగొన్న వరద విలయం | Assam Heavy Rainfall Floods, Four Of A Family Swept Away As Death Toll Rises To 31, Watch Video Inside | Sakshi
Sakshi News home page

ప్రకృతి విపత్తు.. ఒకే కుటుంబాన్ని బలిగొన్న వరద విలయం

Jul 22 2026 8:28 AM | Updated on Jul 22 2026 10:57 AM

Assam floods Four of a family swept away rescue delay

ఈశాన్య రాష్ట్రం అసోంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. వరదల ధాటికి సాధారణ జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. చరైదేవో జిల్లాలో చోటుచేసుకున్న విషాద ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వరద ప్రవాహంలో కొట్టుకుపోయి గల్లంతయ్యారు. మరోవైపు, రాష్ట్రవ్యాప్తంగా వరదల కారణంగా మృతుల సంఖ్య 31కు చేరగా, 16 జిల్లాల్లో 5.64 లక్షల మందికిపైగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఈ విషాద ఘటన జూలై 21 సాయంత్రం 7 గంటల సమయంలో చరైదేవో జిల్లా టెంగాపుఖురి పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్వా అభయపురి గ్రామంలో జరిగింది. భారీ వర్షాల కారణంగా వరద నీరు ఒక్కసారిగా రోహిణి దువారా ఇంట్లోకి చేరింది. పరిస్థితి ప్రమాదకరంగా మారడంతో కుటుంబ సభ్యులు సురక్షిత ప్రాంతానికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో రోహిణి దువారా భార్య తుతుమోని దువారా, కుమార్తె బిదిషా దువారా ఉద్ధృత వరద ప్రవాహంలో కొట్టుకుపోయారు. వారిని కాపాడేందుకు కుమారులు విద్యుత్ దువారా, బిప్లబ్ దువారా వరద నీటిలోకి దూకినా, వారు కూడా నీటి ప్రవాహంలో చిక్కుకుని గల్లంతయ్యారు. దీంతో క్షణాల్లోనే ఒకే కుటుంబానికి చెందిన నలుగురు కనిపించకుండా పోయారు. ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

ఘటన జరిగిన వెంటనే జిల్లా వరద నియంత్రణ హెల్ప్‌లైన్‌కు పలుమార్లు ఫోన్ చేసినా ఎలాంటి స్పందన రాలేదని కుటుంబ సభ్యులు ఆరోపించారు. అనంతరం చరైదేవో జిల్లా డిప్యూటీ కమిషనర్ డాక్టర్ నేహా యాదవ్‌ను సంప్రదించగా, వెంటనే రెస్క్యూ బృందాన్ని పంపిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. అయితే మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు కూడా సహాయక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకోలేదని గ్రామస్థులు ఆరోపించారు. ఈ జాప్యంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అధికారుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నించారు. చివరకు గ్రామస్థులే స్వచ్ఛందంగా గల్లంతైన నలుగురి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ఇదిలా ఉండగా, అస్సాంలో వరద పరిస్థితి రోజురోజుకూ మరింత తీవ్రంగా మారుతోంది. రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (ASDMA) విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం, గత 24 గంటల్లో మరో 21 మంది మృతి చెందారు. దీంతో ఈ ఏడాది వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 31కు చేరింది. దిఖౌ, దిసాంగ్, బ్రహ్మపుత్ర, బుర్హిదిహింగ్, ధన్సిరి నదులు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తుండటంతో పలు ప్రాంతాల్లో వరద ముప్పు మరింత పెరిగింది. సహాయక చర్యల్లో భారత వైమానిక దళం, జాతీయ విపత్తు స్పందన దళం (NDRF), రాష్ట్ర విపత్తు స్పందన దళం (SDRF), అగ్నిమాపక శాఖ సిబ్బంది పాల్గొంటున్నారు. వరదల కారణంగా రైల్వే ట్రాక్‌లు నీటమునిగిపోవడంతో ఈశాన్య సరిహద్దు రైల్వే పరిధిలో పలు రైళ్ల రాకపోకలు వరుసగా రెండో రోజూ నిలిచిపోయాయి. ప్రయాణికుల ఇబ్బందులను తగ్గించేందుకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.

 

ఇదే సమయంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను సమీక్షించేందుకు ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ బుధవారం నుంచి చరైదేవో, నజిరా, శివసాగర్, సోనారి, జోర్హాట్, టియోక్ ప్రాంతాల్లో పర్యటించనున్నట్లు ప్రకటించారు. ప్రజలకు అవసరమైన అన్ని సహాయ చర్యలు వేగంగా అందేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. అయితే చరైదేవోలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు గల్లంతైన ఘటన, సహాయక బృందాల స్పందనలో ఆలస్యమైందన్న ఆరోపణలు రాష్ట్రంలో తీవ్ర చర్చకు దారితీశాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement