కాబూల్: అఫ్గానిస్తాన్‌ని భారీ వరదలు అతలాకుతలం చేశాయి. నిన్న (సోమవారం) నూరిస్తాన్ ప్రాంతంలో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా 20 మంది ప్రాణాలు కోల్పోయారు. , మరో 100 మందికి పైగా గల్లంతయ్యారు. ఈ వివరాలను అక్కడి అధికారులు ప్రకటించారు.
భారీ వరదలకు నూరిస్తాన్ 'పరూన్' లో నది ఒడ్డున మార్కెట్లు, హోటళ్లు, వందలాది దుకాణాలు వరద ఉధృతికి పూర్తిగా కొట్టుకుపోయాయి. ఆ ప్రాంతంపూర్తిగా బురదతో నిండిపోయింది. దీంతో వరదలు తగ్గుముఖం పట్టాక క స్థానిక నివాసితులు బురద కుప్పలపై గల్లంతైన వారి కోసం తీవ్రంగా గాలింపులు చేపడుతున్నారు. అయితే ఈ వరదలలో పరూన్ నగర మేయర్‌తో పాటు పలువురు ప్రభుత్వ ఉద్యోగులు కూడా గల్లంతైనట్లు అధికారులు తెలిపారు.
కాగా సహాయక చర్యలకు సరైన సామాగ్రి లేకపోవడంతో స్థానికులు తమ చేతులతోనే బురదను తొలగిస్తూ గాలింపు చర్యలు చేపట్టడం హృదయవిదారకంగా కనిపిస్తోంది. కాగా ఈ ఘటనపై తాలిబన్ ప్రభుత్వం స్పందించింది. ప్రభుత్వ ప్రధాన ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ స్పందిస్తూ, నూరిస్తాన్ ప్రాంతంలో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించిందని బాధితులను రక్షించడానికి మరియు వారి ఆస్తులను కాపాడటానికి సంబంధిత ప్రభుత్వ సంస్థలు రంగంలోకి దిగి తీవ్రంగా శ్రమిస్తున్నాయని తెలిపారు.
భారీ వర్షాలు పడే అవకాశం
ఆ దేశ వాతావరణ పరిస్థితులపై విపత్తు నిర్వహణ సంస్థ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే రోజుల్లో మరికొన్ని ప్రావిన్సుల్లో భారీ వర్షాలు, తుఫానులు వచ్చే అవకాశం ఉన్నందున, ప్రజలు నదీ తీరాలకు వరద ముప్పు ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉండాలని హెచ్చరించింది.


