న్యూఢిల్లీ: సింధు జలాల ఒప్పందం (ఐడబ్ల్యూటీ)పై కెనడా విదేశాంగ మంత్రితో పాకిస్తాన్ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఐడబ్ల్యూటీతో పాటు, కశ్మీర్ అంశంలో జోక్యం చేసుకోవాలని పాకిస్తాన్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ కెనడాను కోరారు. అయితే కెనడా విదేశాంగ మంత్రితో జరిగిన ఈ సమావేశం అనంతరం ఇరు దేశాల సంయుక్త ప్రకటనలో సింధు జలాల ఒప్పందం గానీ, కశ్మీర్ అంశం గానీ ఎక్కడా ప్రస్తావనకు రాలేదు.
అంతర్జాతీయ వేదికలపై నిత్యం భారత్‌పై నిందలు మోపే పాకిస్తాన్ ప్రయత్నాలకు కెనడాలో మరోసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కెనడా పర్యటనలో ఉన్న పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్, ఆ దేశ విదేశాంగ మంత్రి అనితా ఆనంద్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా సింధు జలాల ఒప్పందాన్ని భారత్ ఉల్లంఘిస్తోందని, దీనిపై అంతర్జాతీయంగా ఒత్తిడి తేవాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాకుండా కశ్మీర్ వివాదంలోనూ మధ్యవర్తిత్వం వహించాలని కోరినట్లు సమాచారం.
అయితే, దౌత్య సంబంధాల పరంగా పాక్ అభ్యర్థనలను కెనడా పెద్దగా పట్టించుకోలేదని స్పష్టమైంది. భేటీ ముగిసిన తర్వాత విడుదల చేసిన అధికారిక సంయుక్త ప్రకటనలో కశ్మీర్, సింధు జలాల వివాదం గురించి కనీసం ఒక్క మాట కూడా ప్రస్తావించలేదు. దీంతో అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్ మరోమారు పరువు తీసుకున్నట్లయ్యింది.
ఇది కూడా చదవండి: అభిషేక్ బెనర్జీకి హైకోర్టు షాక్ .. కంటి చికిత్సకు సలహా!


