ఇస్లామాబాద్: ఇరాన్- అమెరికా యుద్ధంలో మధ్యవర్తి పాత్ర పోషిస్తూ పాక్ ఇచ్చినా బిల్డప్ అంతా ఇంతా కాదు. ఇస్లామాబాద్ టాక్స్ పేరుతో పెద్ద హంగామానే చేసింది. ఇంత చేసి యుద్ధం ఆగడం మాట అటుంచితే అది మరింత ముదిరింది. అయితే ఈ మధ్యవర్తిత్వం పేరుతో అమెరికాకు మరింత దగ్గరైన పాక్ ఇప్పుడు ఆ దేశం నుంచి మెల్లగా ఆర్థిక సాయం పొందే ప్లాన్ వేస్తోంది.
ఆర్థిక సంక్షోభంలో సతమతమవుతున్న పాక్, వాషింగ్టన్ నుండి $10 బిలియన్ల 'ఎక్స్ఛేంజ్ స్టెబిలైజేషన్ ఫెసిలిటీ' ని కోరినట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదన ఆమోదం పొందితే, దేశంలో పడిపోతున్న విదేశీ మారక నిల్వలను పునరుద్ధరించడానికి, పాకిస్తానీ రూపాయి విలువపై ఒత్తిడిని తగ్గించడానికి ఊరట లభించినట్లవుతుందని కథనాలు పేర్కొన్నాయి.
పాకిస్తాన్ ప్రభుత్వం యుఎస్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్‌కు పంపిన ప్రతిపాదనలో, ఐదేళ్ల కాలపరిమితి కలిగిన $10 బిలియన్ల ద్వైపాక్షిక ఎక్స్ఛేంజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ ఫెసిలిటీని ఏర్పాటు చేయాలని అమెరికాను కోరింది. ప్రస్తుతం పాకిస్తాన్ $7 బిలియన్ల IMF ప్రోగ్రామ్ కింద కఠినమైన ఆర్థిక నిబంధనలను అమలు చేస్తోంది. దీనివల్ల పన్నుల పెంపు, ప్రభుత్వ వ్యయం తగ్గించడం వంటి కొన్ని ప్రజాదరణ లేని నిర్ణయాలు తీసుకోవలసి వచ్చింది. యుఎస్ అందించే ఈ సదుపాయం లభిస్తే పాకిస్తాన్‌కు IMF నిధులపై మరియు ఆకస్మిక రుణాలపై ఆధారపడటం తగ్గుతుంది.
'ఎక్స్ఛేంజ్ స్టెబిలైజేషన్' సదుపాయం ?
యుఎస్ ట్రెజరీ నుండి లభించే ఈ సదుపాయాలు చాలా అరుదుగా ఇస్తారు. ఇవి సాధారణంగా "ఎక్స్ఛేంజ్ స్టెబిలైజేషన్ ఫండ్" ద్వారా డాలర్లు, స్వ్యాప్‌లు (swaps) లేదా గ్యారెంటీల రూపంలో లభిస్తాయి. గతంలో 2025లో అర్జెంటీనాకు, 2002లో ఉరుగ్వేకు ఈ విధమైన ప్యాకేజీలు అందించారు. మెక్సికోకు కూడా 1940ల నాటి $9 బిలియన్ల స్వ్యాప్ లైన్ అందుబాటులో ఉంది.
పాకిస్తాన్ ప్రస్తుత ఆర్థిక స్థితి
2023లో $3 బిలియన్ల IMF స్టాండ్‌బై ఒప్పందంతో డిఫాల్ట్ కాకుండా బయటపడిన పాకిస్తాన్, ఆ తర్వాత $7 బిలియన్ల ఎక్స్‌టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ మరియు వాతావరణ మార్పుల కోసం $1.3 బిలియన్ల రుణాన్ని పొందింది. అయినప్పటికీ, పాకిస్తాన్ విదేశీ మారక నిల్వలు ఇంకా చైనా మరియు సౌదీ అరేబియా రోల్‌ఓవర్లు, డిపాజిట్లపైనే ఆధారపడి ఉన్నాయి.
ఏప్రిల్‌లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కి పాకిస్తాన్ $3.5 బిలియన్లు చెల్లించాల్సి రాగా, సౌదీ అరేబియా $3 బిలియన్ల కొత్త మద్దతును అందించింది. 2026 చివరి నాటికి తమ విదేశీ మారక నిల్వలు $20 బిలియన్లకు చేరుకుంటాయని పాకిస్తాన్ సెంట్రల్ బ్యాంక్ అంచనా వేసింది.
ఫిచ్ రేటింగ్స్, హెచ్చరికలు
IMF ప్రోగ్రామ్ వల్ల పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కొంత స్థిరపడినప్పటికీ, పెరిగే ఇంధన ధరలు మరియు సరఫరా అంతరాయాలు విదేశీ మారక నిల్వలను దెబ్బతీసే ప్రమాదం ఉందని ఫిచ్ రేటింగ్స్ హెచ్చరించింది. అలాగే క్రెడిట్ రేటింగ్ తక్కువగా ఉండటం వల్ల విదేశీ పెట్టుబడులు రావడం లేదు.


