పాక్ పవర్ సెంటర్‌లో ప్రకంపనలు.. మునీర్ సామ్రాజ్యానికి ​కొత్త సవాల్ | Who is maulana challenging Asim Munir Full Details Here | Sakshi
Sakshi News home page

పాక్ పవర్ సెంటర్‌లో ప్రకంపనలు.. మునీర్ సామ్రాజ్యానికి ​కొత్త సవాల్

Jul 18 2026 9:14 AM | Updated on Jul 18 2026 11:30 AM

Who is maulana challenging Asim Munir Full Details Here

పాకిస్తాన్‌ రాజకీయాల్లో మరోసారి అధికారం ఎవరి చేతుల్లో ఉంది? అనే ప్రశ్న తెరపైకి వచ్చింది. సైన్యం ప్రభావం, మతపరమైన రాజకీయాలు, ఆఫ్ఘనిస్థాన్‌తో సంబంధాలు.. ఈ మూడు అంశాలు ఒకే సమయంలో ఢీకొంటూ ఇస్లామాబాద్‌లో కొత్త ఉద్రిక్తతలకు దారి తీస్తున్నాయి. ప్రముఖ మతపరమైన రాజకీయ నేత మౌలానా ఫజ్లుర్ రెహ్మాన్.. పాకిస్తాన్‌ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్‌పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. ‘రాజకీయాలు చేయాలనుకుంటే యూనిఫాం తీసేసి ఎన్నికల్లోకి రండి.. ప్రజల తీర్పును ఎదుర్కోండి’ అన్న ఫజ్లుర్ రెహ్మాన్ వ్యాఖ్యలు పాకిస్తాన్‌‌లో సైన్యం పాత్రపై మరోసారి చర్చను రేపాయి.

ఫజ్లుర్ రెహ్మాన్ ఎవరు?
మౌలానా ఫజ్లుర్ రెహ్మాన్ సాధారణ రాజకీయ నాయకుడు కాదు. పాకిస్తాన్‌లో దశాబ్దాలుగా ప్రభావం చూపుతున్న మతపరమైన రాజకీయ నేతల్లో ఆయన ఒకరు. ఆయన నేతృత్వంలోని జమియత్ ఉలేమా-ఎ-ఇస్లాం (JUI-F) పార్టీకి ముఖ్యంగా ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా, బలూచిస్థాన్ ప్రాంతాల్లో ప్రభావం ఉంది. అలాగే, పాకిస్థాన్ పార్లమెంట్‌లో పలుమార్లు సభ్యుడిగా ఉన్నారు. మతపరమైన చట్టాల అమలుకు మద్దతు ఇచ్చే రాజకీయ వర్గానికి ప్రతినిధిగా గుర్తింపు పొందారు. ఆఫ్ఘనిస్థాన్ తాలిబాన్‌తో చారిత్రక సంబంధాలు ఉన్న మత పెద్దగా కూడా ఆయనకు పేరు ఉంది.

రెహ్మాన్ పేరు వినగానే ఆఫ్ఘనిస్థాన్ అంశం కూడా తెరపైకి వస్తుంది. కాగా, పాకిస్థాన్ సైన్యం ప్రస్తుతం తాలిబాన్ పాలిత ఆఫ్ఘనిస్థాన్‌తో సంక్లిష్ట సంబంధాలను ఎదుర్కొంటోంది. అయితే, ఆయన రాజకీయాలు ప్రధానంగా ఎన్నికలు, పార్లమెంటరీ మార్గాల ద్వారా సాగుతాయి. గతంలో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద నిరసనలకు నాయకత్వం వహించారు. రాజకీయ వ్యవస్థలో సైన్యం పాత్రపై విమర్శలు చేశారు. అందుకే ఆయన తాజా వ్యాఖ్యలు సాధారణ రాజకీయ విమర్శగా కాకుండా, సైన్యం ప్రభావంపై నేరుగా ప్రశ్నగా భావిస్తున్నారు.

1990ల నుంచి..

  • రెహ్మాన్‌ తాలిబాన్ భావజాలానికి దగ్గరగా ఉన్న మత వర్గాలతో సంబంధాలు కొనసాగించారు.

  • పలువురు తాలిబాన్ నాయకులు పాకిస్థాన్‌లోని JUI అనుబంధ మదర్సాల్లో చదివినట్లు నివేదికలు ఉన్నాయి.

  • 2001లో అమెరికా ఆఫ్ఘనిస్థాన్‌పై దాడి చేసినప్పుడు ఆయన అమెరికా వ్యతిరేక ర్యాలీలు నిర్వహించారు.

  • 2021లో తాలిబాన్ మళ్లీ ఆఫ్ఘనిస్థాన్‌లో అధికారంలోకి వచ్చిన తర్వాత అంతర్జాతీయ గుర్తింపు ఇవ్వాలని పిలుపునిచ్చారు.

  • కాబూల్‌తో సంబంధాలు మెరుగుపరుచుకోవాలని పాకిస్థాన్‌కు సూచించారు.

  • అయితే ప్రస్తుతం పాకిస్థాన్–ఆఫ్ఘనిస్థాన్ సంబంధాలు ఉద్రిక్తంగా ఉన్నాయి. అయినప్పటికీ ఫజ్లుర్ మాత్రం చర్చల ద్వారానే పరిష్కారం రావాలని చెబుతున్నారు.

మునీర్‌తో విభేదాలు ఎందుకు?
ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఒకప్పుడు ఫజ్లుర్ రెహ్మాన్, ఆసిమ్ మునీర్ ఎదుగుదలకు పరోక్షంగా సహకరించిన రాజకీయ పరిణామాల్లో భాగమయ్యారు. 2018లో అధికారంలోకి వచ్చిన ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 2020లో ప్రతిపక్షాలు కలిసి పాకిస్థాన్ డెమొక్రటిక్ మూవ్‌మెంట్ (PDM) ఏర్పాటు చేశాయి. దీనికి ఫజ్లుర్ రెహ్మాన్ నాయకత్వం వహించారు. ఇమ్రాన్ ఖాన్‌పై అవిశ్వాస తీర్మానం తెచ్చింది. 2022లో ఆయన ప్రభుత్వం కూలిపోయింది. అదే సమయంలో ఆసిమ్ మునీర్ 2022లో పాకిస్తాన్‌ ఆర్మీ చీఫ్ అయ్యారు. తర్వాత రాజకీయ పరిస్థితులు మారాయి.

పాకిస్తాన్‌లో సైన్యం ఎప్పటి నుంచో అత్యంత శక్తివంతమైన సంస్థగా ఉంది. దేశ రాజకీయాల్లో సైన్యం ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రభావం చూపుతుందనే విమర్శలు చాలాకాలంగా ఉన్నాయి. ఆసిమ్ మునీర్ ప్రస్తుతం పాకిస్తాన్‌లో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల్లో ఒకరు. ఆర్మీ చీఫ్‌గా ఉన్నారు. భద్రతా విధానాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. పాక్‌ రక్షణ వ్యవస్థలో అత్యున్నత స్థాయిలో ఉన్నారు. అందుకే ఆయనపై వచ్చే విమర్శలు వ్యక్తిగత విమర్శలుగా కాకుండా సైన్యం పాత్రపై రాజకీయ చర్చగా మారుతాయి. సైన్యం రక్షణ వ్యవహారాలకు పరిమితం కావాలి.. రాజకీయ నిర్ణయాలు ప్రజలు ఎన్నుకున్న నాయకులు తీసుకోవాలి అని ఫజ్లుర్ డిమాండ్‌ చేశారు.

సైన్యం చరిత్రాత్మక పాత్ర..
పాకిస్తాన్ ఏర్పడినప్పటి నుంచి అక్కడి రాజకీయ వ్యవస్థలో సైన్యం ప్రత్యేక స్థానం కలిగి ఉంది. దేశంలో పలు మార్లు సైనిక పాలనలు వచ్చాయి. ప్రస్తుతం ప్రత్యక్ష సైనిక పాలన లేకపోయినా, విదేశాంగం, భద్రత, భారత్-ఆఫ్ఘనిస్థాన్ విధానాల్లో సైన్యం ప్రభావం కొనసాగుతుందని విమర్శకులు చెబుతారు.

1958: జనరల్ అయూబ్ ఖాన్ తొలి సైనిక పాలన.
1977: జనరల్ జియా ఉల్ హక్ అధికారం స్వాధీనం.
1999: జనరల్ పర్వేజ్ ముషారఫ్ తిరుగుబాటు.

పాక్‌ ముందున్న సవాల్ ఇదే..
ఒకవైపు దేశ భద్రతను కాపాడే శక్తివంతమైన సైన్యం.. మరోవైపు ప్రజల ఓట్లతో వచ్చే రాజకీయ నాయకత్వం.. ఇంకోవైపు మత ప్రభావంతో ఎదిగిన రాజకీయ శక్తులు.. ఈ మూడు శక్తుల మధ్య సమతుల్యత ఎటు వెళ్తుందో రాబోయే రోజులు నిర్ణయించనున్నాయి. ఎందుకంటే పాకిస్తాన్‌లో పోరు కేవలం ఇద్దరు నాయకుల మధ్య కాదు.. అది అధికారం ఎవరి చేతుల్లో ఉండాలనే దశాబ్దాల ప్రశ్నకు కొనసాగింపు. ఈ మూడు ఢీకొంటున్న వేళ ఇస్లామాబాద్‌లో కొత్త పవర్ గేమ్ మొదలైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement