సంక్షోభంతో పాకిస్తాన్‌ సతమతం | Sakshi Guest Column On Pakistan is reeling from the crisis | Sakshi
Sakshi News home page

సంక్షోభంతో పాకిస్తాన్‌ సతమతం

Jul 17 2026 12:26 AM | Updated on Jul 17 2026 12:26 AM

Sakshi Guest Column On Pakistan is reeling from the crisis

విశ్లేషణ

అంతర్గత భద్రతా సమస్యలు, ఘర్షణలు, నిరసనలు, హింస, టెర్రరిస్టు ఘటనలతో పాకిస్తాన్‌ ఉక్కిరిబిక్కిరి అవు తున్నది. బలూచిస్తాన్, పాక్‌ ఆక్రమిత కశ్మీర్, గిల్గిత్‌ బాల్టిస్తాన్, ఖైబర్‌– పఖ్తూన్‌ఖ్వా ప్రాంతాలలో పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు, హింస చెలరేగాయి. ఈ అంతర్గత భద్రతా సమస్యలకు తోడు సింధు జలాలను భారత్‌ ఆపివేస్తుందనే భయం, దిగజారి పోతున్న ఆర్థిక వ్యవస్థ, ఇరాన్‌–అమెరికా యుద్ధంలో దౌత్యం విఫలమవ్వటంతో పాక్‌ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుక చందాన తయారైంది. అంత్యంత కీలకమైన సీపెక్‌ (సీపీఈసీ; చైనా–పాకి స్తాన్‌ ఎకనమిక్‌ కారిడార్‌) పథకం అమలవుతున్న బలూచిస్తాన్,  ఖైబర్‌–పఖ్తూన్‌ఖ్వా, పీఓకే, గిల్గిత్‌ ప్రాంతాలలో పౌరులు పాక్, చైనాలకు వ్యతిరేకంగా ఉద్యమించటాన్ని భారత్‌ నిశితంగా పరిశీలిస్తున్నది. ఈ పరిణామాలు సీపెక్‌ భవిష్యత్తుపైన, చైనా పాత్రపైన, కశ్మీర్‌ వివాదంపైన ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించవచ్చు.
 
ఆజాద్‌ కశ్మీర్‌లో ఆజాద్‌ ఎంత?
పాక్‌ ఆక్రమిత కశ్మీర్, గిల్గిత్‌ బాల్టిస్తాన్‌లలో పాక్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గత రెండు నెలలుగా జరుగుతున్న నిరసనలు తార స్థాయికి చేరుకున్నాయి. జాయింట్‌ అవామీ యాక్షన్‌ కమిటీ (జేఏఏసీ) ఆధ్వర్యంలో రావల్‌కోట్, మీర్‌పూర్, బాగ్‌లతో సహా పలు పట్టణాలలో 38 ప్రధాన డిమాండ్లతో భారీగా నిరసన ప్రదర్శ నలు జరుగుతున్నాయి. జూలై 15న రావల్‌కోట్‌లో సైన్యం కాల్పు లలో కనీసం పదిమంది పౌరులు చనిపోయినట్లు వార్తలొచ్చాయి. ముజఫరాబాద్‌కు తలపెట్టిన లాంగ్‌మార్చ్‌ను జూలై 21కి వాయిదా వేసినా, నిరసనలు ఆగలేదు. 

ఆక్రమిత కశ్మీర్‌ అసెంబ్లీలో శరణార్థులకు రిజర్వ్‌ చేసిన 12 సీట్ల తొలగింపు, కరెంటు ఛార్జీలు, గోధుమ పిండి ధరలతో ప్రారంభమైన నిరసనలు క్రమంగా పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ ప్రాంతపు స్వయంప్రతిపత్తిపై వేలెత్తి చూపుతున్నాయి. పాక్‌ ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని ఆజాద్‌ (స్వాతంత్ర) కశ్మీర్‌గా పేర్కొంటుంది. ఆక్రమిత కశ్మీర్‌ ప్రజలు భారత అధీనంలోని కశ్మీర్‌ ప్రాంత ప్రజలతో పోలిస్తే తమ ఆర్థిక స్థితిగతులు, రాజకీయ స్వాతంత్య్రం ఎంత దీనంగా ఉన్నాయో అర్థం చేసుకుంటున్నారు. రావల్‌కోట్‌లో జాక్‌ (జేఏఏసీ) నాయకుడు సర్దార్‌ అమన్‌ఖాన్‌ ప్రదర్శనకారులనుద్దేశించి ప్రసంగిస్తూ, ఆజాద్‌ కశ్మీర్‌ను ఆక్రమిత ప్రాంతంగా పేర్కొని పాకిస్తాన్‌ను ఈ ప్రాంతం నుండి వైదొలగాలని డిమాండ్‌ చేయటం కొసమెరుపు. 

అఫ్గానిస్తాన్‌తో అంతంతే!
పాకిస్తాన్‌లో వైశాల్యం పరంగా 40 శాతం వాటా కల్గిన బలూచిస్తాన్‌ అతిపెద్ద రాష్ట్రం. ఇరాన్, అఫ్గానిస్తాన్, అరేబియా సముద్రంతో సరిహద్దులు కలిగిన ఈ ప్రాంతం వ్యూహాత్మకంగా కీలకం. రాగి, సహజ వాయువు, బంగారం వంటి కీలకమైన వనరులు బలూచిస్తా న్‌లో సమృద్ధిగా లభిస్తున్నాయి. బలూచి జాతికి చెందిన ప్రజలు పాక్‌లోని బలూచిస్తాన్, ఇరాన్‌లోని సిస్తాన్‌ బలూచిస్తాన్, అఫ్గానిస్తాన్‌లలో నివసిస్తున్నారు. శతాబ్దాలుగా తమ ఉనికిని, స్వాతంత్య్రాన్ని కాపాడుకోవటానికి ప్రయత్నిస్తున్నారు. 

1947లో పాకిస్తాన్‌ ఏర్పడినప్పుడు బలూచిస్తాన్‌ కలాత్‌ సంస్థా నంగా ఉండేది. 1948లో పాక్‌లో బలూచిస్తాన్‌ విలీనం వివాదా స్పద పరిస్థితులలో జరిగింది. కలాత్‌ రాజును ఒత్తిడి చేసి విలీన పత్రంపై సంతకం పెట్టించారు. పాక్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 1958–59, 1963–69, 1973–77 మధ్యకాలంలో బలూచిస్తాన్‌లో పెద్ద ఎత్తున తిరుగుబాట్లు జరిగాయి. 2004 నుండి మళ్లీ బలూచిస్తా న్‌లో తిరుగుబాటు తీవ్రమైంది. అభివృద్ధి ఫలాలు స్థానికులకు అందకపోవటం, స్థానిక ప్రజలపై సైన్యం దమనకాండ, రాజకీయ స్వయంప్రతిపత్తి లేకపోవడం స్థానిక ప్రజల వ్యతిరేకతకు కారణం. ముఖ్యంగా బలూచి లిబరేషన్‌ ఆర్మీ(బీఎల్‌ఏ) ఇటీవల పాక్‌ సైన్యం, భద్రతా బలగాలపై కచ్చితత్వంతో ఒకేసారి పెక్కు పట్టణా  లలో విరుచుకుపడింది. జాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును ఏకంగా హైజాక్‌ చేశారు. గత వారంలో బీఎల్‌ఏ దాడులలో 42 మంది పాక్‌ సైనిక సిబ్బంది చనిపోవడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తున్నది. పాక్‌ సైన్యపు ‘ఆపరేషన్‌ షాబాన్‌’ సత్ఫలితాలను ఇస్తున్నట్టు లేదు.

పాక్‌–అఫ్గానిస్తాన్‌ సరిహద్దులలోని ఖైబర్‌–ఫఖ్తూన్‌ఖ్వా
ప్రాంతంలోని తెహ్రీక్‌ తాలిబాన్‌ పాకిస్తాన్‌ (టీటీపీ) ఉగ్రవాదులు ఏకంగా పాక్‌ సైనిక చెక్‌పోస్టులుపై దాడులు చేస్తున్నారు. వీరికి అఫ్గానిస్తాన్‌లోని తాలిబన్‌ ప్రభుత్వం దన్నుగా నిలుస్తున్నదని పాక్‌ ఆరోపణ. దీనికి ప్రతిగా పాక్‌ సైన్యం అఫ్గానిస్తాన్‌పైన ఏకంగా వైమానిక దాడులను చేపట్టింది. అఫ్గాన్‌ తాలిబన్‌ ప్రభుత్వం ప్రతిచర్యగా పాక్‌పై డ్రోన్లతో దాడి చేసింది. పశ్తూన్‌ (పఠాన్‌) తెగకు చెందిన ప్రజలు నివసిస్తున్న ఈ ప్రాంత ప్రజలు సరిహద్దుకు ఆవల అఫ్గాన్‌లోని పశ్తూన్‌ ప్రాంతాలతో కలిపి గ్రేటర్‌ పశ్తూనిస్తాన్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ ప్రాంతంలో పాక్‌– అఫ్గాన్‌లకు సరిహద్దుగా ఉన్న హిందూకుష్‌ పర్వతాలలోని డ్యూరాండ్‌ లైన్‌ను అఫ్గాన్‌ మొదటినుండీ అంగీకరించలేదు.

తెలిసివచ్చిన తరుణం
62 బిలియన్‌ డాలర్ల వ్యయంతో పాక్‌లో చైనా అమలు చేస్తున్న సీపెక్‌ పథకం కింద పాక్‌లోని ప్రస్తుత సంక్షుభిత ప్రాంతాలలో కీలకమైన రహదార్లు, విద్యుచ్ఛక్తి కేంద్రాలు, రేవు పట్టణాలు, పారి శ్రామిక కేంద్రాలు, ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుళ్ల నిర్మాణం జరుగుతున్నది. సీపెక్‌ ద్వారా పాక్‌ గుండా అరేబియా సముద్రంలోనికి ప్రవేశించటం చైనా వ్యూహం. గిల్గిత్‌ బాల్టిస్తాన్‌ పాక్‌ను చైనాతో కలుపుతుంది. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో ఈ పథకంలో భాగంగా జీలం, నీలం నదులపై కోహ్లా, కరాత్, ఆజాద్‌ పఠాన్‌లలో భారీ జలవిద్యుచ్ఛక్తి కేంద్రాలను చైనా నిర్మిస్తున్నది. కశ్మీర్‌లో భాగమైన ఈ ప్రాంతాలలో సీపెక్‌ పథ కాన్ని భారత్‌ వ్యతిరేకించింది. సీపెక్‌ రహదారికి గిల్గిత్‌ బాల్టిస్తాన్‌ ప్రవేశ ద్వారమైతే, బలూచిస్తాన్‌లోని గ్వాదర్‌ రేవు పట్టణం నిష్క్రమణ స్థానం (ఎగ్జిట్‌ పాయింట్‌). గ్వాదర్‌లో భారీ డీప్‌ వాటర్‌ పోర్టు, అంతర్జాతీయ విమానాశ్రయం చైనా నిర్మిస్తున్నది. 

బలూచిస్తాన్‌లో సంక్షోభం సీపెక్‌ పథకానికి ప్రతికూలం. ఇది భారత్‌కు కలిసివచ్చే అంశం. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో సంక్షోభం భారత అధీనంలోని కశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘన, అణచి వేత జరుగుతున్నదనే పాక్‌ వాదనలో డొల్లతనాన్ని బయటపెడు తున్నది. పాక్‌ అధీనంలోని కశ్మీర్‌లో ఆదర్శప్రాయమైన పాలన జరు గుతున్నదనే ప్రచారానికి ఈ నిరసనలు చెక్‌ పెడుతున్నాయి. అమె రికా, ఐరోపాలలోని పాశ్చాత్య మీడియా సంస్థలు ఇప్పటివరకు కశ్మీర్‌పై కొనసాగిస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడానికి భారత్‌కు ఇది సువర్ణావకాశం. బలూచిస్తాన్, పీఓకే, ఖైబర్‌ పఖ్తూన్‌ఖ్వాలలో సంక్షోభానికి భారత్‌ కారణమని పాక్‌ ఆరోపిస్తున్నది. ఈ పరిణా మాల నేపథ్యంలో భారత్‌ అప్రమత్తంగా ఉండాలి. అంతర్గతంగా సమస్యలను ఎదుర్కొన్నప్పుడల్లా పాక్‌ భారత్‌లో ఏదో ఒక ఉగ్ర చర్యకు పాల్పడి దృష్టిని మరల్చి ప్రజలను తమ వైపునకు తిప్పు కోవటానికి ప్రయత్నిస్తుంటుంది.

గురజాల శ్రీనివాసరావు
వ్యాసకర్త అడిషనల్‌ రిజిస్ట్రార్‌ (రిటైర్డ్‌);
సివిల్స్, గ్రూప్‌–1 పోటీ పరీక్షల నిపుణులు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement