దత్తబోధ
సమాజంలో ఏ గొడవలతోనూ పని లేకుండా మంచి ప్రవర్తనతో, దైవచింతనతో జీవితం గడపాలనుకొనేవారు శుద్ధమైన ఆహారమే తీసుకోవాలి. ప్రేమ, దయ, దాక్షిణ్యం, కోపం లేకుండటం, ఉపకార బుద్ధి, ఇతరుల సుఖదుఃఖాలను తనవిగా భావించే గుణం వంటి గుణాలన్నీ సాత్త్విక గుణాలు. ఇవి శుద్ధమైన ఆహారం తీసుకోవటం వల్లనే కలుగుతాయి. దేశ కాల ప్రాంతాలకు అనుకూలంగా భోజనం చేయాలని శాస్త్ర వచనం.
భీష్మాచార్యులవారు అస్త్ర సన్యాసం చేసి అంపశయ్యమీద పడుకొన్నాడు. వైకుంఠ గమనానికి వేచి ఉన్నాడు. ఆయన చేసిన బోధలను పాండవులందరూ శ్రద్ధగా విన్నారు. ఆ సమయంలో దూరం నుండి వింటున్న ద్రౌపదీ దేవి నవ్వింది. తన మాటలు విని నవ్వినందుకు భీష్ముని మనస్సు బాధపడింది. కారణం తెలియగోరాడు. ద్రౌపది వినయంగా విన్నవించింది. ‘అయ్యా! మీరు మాకెప్పడూ ధర్మ ప్రబోధం చేయవలసినవారే. ఇప్పుడు నా నవ్వుకు కారణం మాత్రం వేరే ఉంది. మరేమీ లేదు. ఆనాడు నిండు కౌరవసభలో అందరూ చూస్తుండగా దుశ్శాసనుడు నాకు వస్త్రాపహరణం చేశాడు. అప్పుడా సభలో మీరు కూడా ఉన్నారు. కాని ఇది అకృత్యమని మీరెవరికీ బుద్ధి చెప్పలేదు. పోనీ ఆ దుష్కృత్యాన్ని చూడలేక అక్కడ నుండి లేచి బయటకు వెళ్ళనూ లేదు. అదీ కాకపోతే రెండు కళ్ళు మూసుకొనవచ్చు కదా! అదీ చేయలేదు మీరు. అలాంటి మీకిప్పుడు ఈ ధర్మప్రబోధం చేయాలనే బుద్ధి యెలా పొడమింది? అని సందేహం కలిగి నవ్వాను’.
‘అమ్మా! ద్రౌపదీదేవీ! నీకు సందేహం రావలసినదే తల్లీ! నిన్న మొన్నటివరకు నేను కౌరవుల పక్షంలోనే ఉన్నాను కదా! వారి ఉప్పు తిన్నవాడనయ్యాను. వారి ఆహార ప్రభావం వల్ల వాళ్ళ మాటలే చెవికెక్కాయి. నేను గాంగేయుడను. తిరిగి నా తల్లి గంగతోనే పవిత్రుడను కావాలి. అందుకని ఇప్పుడు అర్జునుడు తన బాణంతో పాతాళం నుంచి పరమ పవిత్రమైన గంగాజలాన్ని పైకి తెప్పించాడు. దాని ప్రభావంతో లోగడ కోల్పోయిన సాత్త్విక భావన తిరిగి వచ్చింది తల్లీ!’ అని చెప్పాడు. ‘ఆహార శుద్ధౌ సత్త్వ శుద్ధిః సత్త్వ శుద్ధౌ ధ్రువామతిః’
- శ్రీ గణపతి సచ్చిదానందస్వామి


