ఇన్ బాక్స్
మహారాష్ట్రలోని ఒక ఆసుపత్రిలో వైద్యులు, నర్సులపై స్థానిక కార్పొరేటర్ దాడి చేశాడనే వార్తలొచ్చాయి. అరెస్టు చేయబోతున్నారని తెలియగానే, ఆ కార్పొరేటర్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాడని సమాచారం. తాను దాడి చేసిన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ నుంచే తనకు వైద్యం అందాలని ఆయన ఏ సంకోచం లేకుండా ఆశించడం హాస్యాస్పద విషాదం.
ఇదే సంఘటన సింగపూర్‌లో జరిగితే పరిస్థితి వేరేలా ఉండేది. ‘ఆరోగ్య సంరక్షణ రంగంలో దాడులు, వేధింపుల నివారణకు త్రైపాక్షిక విధానం’ అక్కడ అమలవుతోంది. దాడి చేసిన వ్యక్తికి (అత్యవసరం కాని) చికిత్సను నిరాకరించడంతో పాటు, మెడికల్ రికార్డులలో ‘దురుసుగా ప్రవర్తించే వ్యక్తి’గా శాశ్వతంగా ముద్రించే అవకాశం ఉంది. వైద్యులపై హింసకు అక్కడ జీవితకాల పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
భారతదేశంలో ఆరోగ్య సంరక్షకులపై హింస సాధారణమై పోయింది. వైద్యులు, నర్సులు ఇప్పటికే సుదీర్ఘ పనివేళలు, మాన సిక ఒత్తిడి, వసతుల కొరతతో సతమత మవు తుండగా... ఇప్పుడు బెదిరింపులు, భౌతిక దాడుల భయం పెరుగుతున్నాయి. ‘ఫ్రాంటియర్స్ ఇన్ పబ్లిక్ హెల్త్’లో ప్రచురి తమైన ఉత్తరాఖండ్ అధ్యయనం వివరాల ప్రకారం, 75% మంది వైద్యులు ప్రతీకార దాడులు ఎదుర్కొన్నారు. ఇందులో 68% దాడులు రోగుల బంధు వులు చేస్తే, కేవలం 18% కేసులు మాత్రమే పోలీసుల దృష్టికి వెళ్లాయి. సఫ్దర్ జంగ్ వంటి ఢిల్లీ ప్రభుత్వ ఆసుపత్రుల నెట్‌వర్క్‌లలో జరిగిన ఆడిట్ ప్రకారం అధిక ఒత్తిడి షిఫ్ట్‌లలో హింస రేటు 63.6%గా ఉంది. పరిస్థితి ఇలాగే కొనసా గితే వైద్య శాస్త్రాన్ని అభ్యసించడానికి ప్రతిభావంతులైన విద్యార్థులు ముందు కురారు. ఫలితంగా దేశంలో వైద్య నిపుణుల కొరత ఏర్పడే ప్రమాదం ఉంది.
ఆరోగ్య సంరక్షణ సిబ్బందిపై హింసను, ఆసుపత్రులకు నష్టం కలిగించ డాన్ని నిషేధిస్తూ అనేక రాష్ట్రాలు చట్టాలను రూపొందించాయి. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ‘హెల్త్‌కేర్ సర్వీసెస్ పర్సనల్ అండ్ క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ (ప్రొహిబిషన్ ఆఫ్ వయొలెన్స్ అండ్ డామేజ్ టు ప్రాపర్టీ) బిల్లు’ ముసాయిదాను 2019లో రూపొందించింది. అయితే అది చట్టంగా మారలేదు. కోవిడ్–19 మహమ్మారి సమయంలో, ‘అంటు (ఎపిడమిక్) వ్యాధుల చట్టాన్ని’ సవరించి, వైద్య సిబ్బందిపై హింసకు పాల్పడటాన్ని నాన్– బెయిలబుల్ నేరంగా పరిగణించి, ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధించేలా 2020లో చట్టం తీసుకువచ్చినా ఆశించిన స్థాయిలో ప్రభావం కనిపించడం లేదు. వైద్యుల భద్రత – జాతీయ ఆరోగ్య భద్రతకు కీలకం. వైద్యులను గౌరవించడం అంటే – ఆరోగ్య సంరక్షణ పొందే పౌరుల రాజ్యాంగ హక్కును కాపాడటమే.
– శ్రీనివాస్ మాధవ్, సామాజిక కార్యకర్త


