అనుగ్రహం అవసరం! | Guest Column Spiritual And Devotional Story Written By M Maruthi Shasthri | Sakshi
Sakshi News home page

అనుగ్రహం అవసరం!

Jul 14 2026 7:02 AM | Updated on Jul 14 2026 7:02 AM

Guest Column Spiritual And Devotional Story Written By M Maruthi Shasthri

జ్యోతిర్మయం

సురాసురులు కలిసి కష్టించి, ఎన్నెన్నో మహత్తరమైన అవరోధాలనూ, విఘ్నాలనూ అధిగమించి, ఎట్టకేలకు అమృతం సాధించారు. ధన్వంతరి అందించిన అమృత కలశాన్ని తటాలున అందుకొని, అసురులు అన్యాయంగా స్వాధీనం చేసుకొన్నారు. అప్పటికప్పుడు శ్రీహరి మోహినీ అవతారాన్ని ఎత్తి, వాళ్ళను కామ మోహితులను చేశాడు. ఆ మోహంతో వాళ్ళు అందరికీ అమృతం పంచే బాధ్యతను ఆమెకు అప్పగించారు. ఆమె దాన్ని ఎలా పంచినా, తాము అడ్డుపడమని ఒప్పందం చేసుకొన్నారు.

మోహిని అమృతాన్ని మొదట దేవతల పంక్తికి పంచటం పూర్తయేసరికి, పాత్ర ఖాళీ అయిపోయింది. ఆమె అంతర్ధానమై పోయింది. రాక్షసులకు ఏమీ మిగలలేదు. రాహువు అనే రాక్షసుడు మాత్రం, మారువేషంలో దేవతల పంక్తిలో చేరి, అమృతం పుచ్చుకొన్నాడు. సూర్యచంద్రులు ఇది గమనించి చెప్పగానే, సుదర్శన చక్రం రివ్వున వచ్చి, పుచ్చుకొన్న అమృతం నాలుక దాటకుండానే, రాహువు తలను నరికి వేసింది. అమృత ప్రభావం వల్ల అతడి తల సజీవంగా మిగిలిపోయింది. అమృత స్పర్శ లేని మొండెం పతనమై నశించింది. (అప్పటి నుంచి ‘రాహువు తల’ అనేది ప్రత్యేకంగా లేదు. రాహువు అంటేనే రాహువు తల. కాబట్టి ‘రాహు మస్తకం’ అని చెప్పనక్కర్లేదు. చెప్తే అది, ‘సీతా ఫలం పండు’, ‘పేపరు కాగితం’ అన్నట్టు పునరుక్తి అవుతుంది!)

దేవాసురులు ఒకే పరిస్థితులలో, ఒకే ప్రదేశంలో, ఒకే సమయంలో, ఒకే సాధన సామగ్రితో, ఒకే విధమైన శ్రమను, ఒకే సంకల్పంతో చేశారు. కానీ వాళ్ళకు లభించిన ఫలంలో మాత్రం తేడాలు వచ్చాయి. ఏవం సురాసుర గణాః సమ దేశ, కాల,/ హేతు–అర్థ, కర్మ, మతయః–అపి, ఫలే వికల్పాః. ఎలాంటి తేడాలు? తత్ర అమృతం సురగణాః ఫలం–అంజనా–ఆపుః, నదైత్యాః – అక్కడ సురగణాలు అమృతం అనే ఫలాన్ని సులభంగా పొందారు, దైత్యులు పొందలేదు. కారణమేమిటి? పాద పంకజ రజ–ఆశ్రయాత్‌– శ్రీహరి పదకమలాల ధూళిని (దేవతలు) ఆశ్ర యించి, సేవించటం వల్ల. హరి విముఖులు కనక అసురుల శ్రమ నిష్ఫలమైంది. శ్రమకు దైవానుగ్రహం తోడయి తేనే ఫల ప్రాప్తి ఉంటుంది, అంటుంది భాగవతం.
– ఎం.మారుతి శాస్త్రి 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement