సింథటిక్‌ కణం... వచ్చేస్తోంది! | Synthetic biologist Kate Adamala and her team developed SpudCell | Sakshi
Sakshi News home page

సింథటిక్‌ కణం... వచ్చేస్తోంది!

Jul 14 2026 6:28 AM | Updated on Jul 14 2026 6:28 AM

Synthetic biologist Kate Adamala and her team developed SpudCell

వైరాగ్యులు మనిషిని పిడికెడు బూడిదతో పోలుస్తారు. శాస్త్రవేత్తలు మాత్రం మనిషిని కణాల సముద్రం అంటారు. సృష్టిలో ప్రతి జీవి కణాలతో నిర్మితమైనదే. జీవికి సంబంధించి క్రియాత్మక, నిర్మాణాత్మక ప్రమాణం... కణం! అయితే కణం అనేది ఇప్పటికీ అంతు చిక్కని రహస్యాల పుట్ట. దీన్ని పూర్తిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు శాస్త్రవేత్తలు. తాజా విషయానికి వస్తే  సింథటిక్‌ బయాలజిస్ట్‌ కేట్‌ అడమలా నేతృత్వంలో  అభివృద్ధి చేసిన సింథటిక్‌ కణం పెద్ద ముందడుగు...

సహజ కణంలాగే ఆహారం తీసుకోగల, పెరగగల, పునరుత్పత్తి  చేసుకోగల సింథటిక్‌ కణాన్ని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. సింథటిక్‌ బయాలజీలో ఇదొక మైలురాయిగా చెబుతున్నారు. మిన్నేసోటా యూనివర్శిటీలో సింథటిక్‌ బయాలజిస్ట్, ప్రొఫెసర్‌ కేట్‌ అడమలా బృందం నిర్జీవ రసాయన భాగాల నుండి ఈ కణాన్ని రూ΄÷ందించింది. జీవ మూలాలను శాస్త్రవేత్తలు మరింత బాగా అర్థం చేసుకోవడానికి ఇది సహాయపడుతుంది.

స్పుడ్‌ సెల్‌
మానవ సమస్యలను పరిష్కరించడానికి దశాబ్దాలుగా శాస్త్రవేత్తలు సహజకణాలను బయో ఇంజినీరింగ్‌ చేస్తున్నారు. కణాల చరిత్రలో... ‘కృత్రిమ కణాలు తదుపరి దశ’ అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. క్యాన్సర్‌ చికిత్సలో, రసాయనాలను తయారుచేయడంలో, కార్బన్‌ను సంగ్రహించడంలో కృత్రిమ కణాలు ఉపయోగపడతాయి.
అడమలా బృందం అభివృద్ధి చేసిన సింథటిక్‌ కణానికి ‘స్పుడ్‌ సెల్‌’ అని పేరు పెట్టారు.

బయోటిక్‌
‘స్పుడ్‌ సెల్‌ అనేది ప్రయోగశాలలో సృష్టించిన జీవకణం కాదు. జీవకణాలు సులువుగా చేయలేని లేదా అస్సలు చేయలేని పనులను చేయడానికి అవసరమైన వ్యవస్థలను తయారుచేయడానికి, ప్రోగ్రామింగ్‌ చేయడానికి ఉపయోగపడే సింథటిక్‌ కణం’ అంటున్నారు అడమలా.
ఇద్దరు శాస్త్రవేత్తలతో కలిసి ‘బయోటిక్‌’ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించారు అడమలా. ‘బయోటిక్‌’ ద్వారా కృత్రిమ కణాన్ని పరిశోధకులకు అందుబాటులోకి తెచ్చి దాని సామర్థ్యాన్ని మరింత మెరుగుపరిచే ప్రయత్నం చేస్తున్నారు.

అయిదు తరాలు!
నూట యాభై నుంచి రెండు వందల వరకు అణువులతో తయారైన స్పుడ్‌ సెల్‌ అయిదు తరాల పాటు ఆహారం తీసుకుంటూ, పెరుగుతూ, పునరుత్పత్తి  చెందుతుంది. ఇది సాధారణ జీవకణంతో పోల్చితే తక్కువ సంక్లిష్టమైనది. కృత్రిమ కణానికి సంబంధించిన జన్యువు సహజ కణం జన్యువు కంటే చాలా తక్కువగా ఉంటుంది.

వారధి
స్పుడ్‌ సెల్‌ తానతంట తానే రైబోజోమ్‌లను తయారుచేసుకోగలదు. సహజ కణంలో ప్రొటీన్‌లను తయారుచేసే కీలకభాగాలే రైబోజోమ్‌లు.
‘కృత్రిమ కణం సహజ కణాన్ని మక్కీకి మక్కీ అనుసరించదు. సింథటిక్‌ బయాలజీ అంటే అనుకరణకు సంబంధించి అంశం కాదు. పనులు కొత్తగా చేయడానికి, సత్వర మార్గాలను అనుసరించడానికి ఉపయోగపడుతుంది. స్పుడ్‌ సెల్‌ అనేది రసాయనాల సమ్మేళనానికి, ప్రకృతిలో సహజంగా పరిణామం చెందిన కణానికి మధ్య వారధిగా నిలుస్తుంది’ అంటున్నారు శాస్త్రవేత్తలు.
‘సింథటిక్‌ సెల్‌రంగంలో స్పుడ్‌ సెల్‌ పెద్ద పురోగతి’ అంటున్నారు ఇంపీరియల్‌ కాలేజీ లండన్‌లోని సింథటిక్‌ ఇంజినీరింగ్‌ ప్రొఫెసర్‌లు.
‘జీవానికి అవసరమైన కచ్చితమైన, కనీస అవసరాలను తెలుసుకోవడానికి సింథటిక్‌ కణం ఉపయోగపడుతుంది’ అంటున్నారు ప్రొఫెసర్‌ ఎల్లిస్‌.
‘ఇది కేవలం ఆరంభం మాత్రమే’ అంటున్నారు అడమలా. ఆమె మాటల్లోనే చె΄్పాలంటే బలమైన పునాది రెడీ అయింది.
సింథటిక్‌ కణాలు చేసే అద్భుతాల కోసం వేచి చూద్దాం!
 
ప్రమోదమా? ప్రమాదమా?
మనిషి శరీరంలో 37 లక్షల కోట్ల కణాలు ఉంటాయి. ఇవి ఆకాశంలోని నక్షత్రాల సంఖ్య కంటే ఎక్కువ. వివిధ రకాల కణాలు ఎలా పని చేస్తాయో, వాటిలో ఖచ్చితంగా ఏముంటుందో శాస్త్రవేత్తలకు పూర్తిగా తెలియదు. వివిధ శాస్త్రవేత్తల ద్వారా భవిష్యత్‌లో కృత్రిమ కణాల నిర్మాణం పెరిగే అవ కాశం ఉందంటున్నారు.  అయితే దీని వల్ల భద్రతకు సంబంధించిన ఆందోళనలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ఉదాహరణకు... చెడ్డ వ్యక్తులు దీన్ని దుర్వినియోగం చేయవచ్చు. ప్రకృతిలో కనిపించే అణునిర్మాణానికి విరుద్ధంగా ఉండే కృత్రిమజీవులైన ‘మిర్రర్‌ సెల్‌’తో ప్రమాదాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఒక మిర్రర్‌ సెల్‌లోని అణువుల స్థానంలో వాటికి అద్దంలా ఉండే ప్రతిరూపాలను ఉంచుతారు. ఇవి మనుషులు, జంతువులు, మొక్కలకు అత్యంత ప్రమాదకరంగా పరిణమిస్తాయి. స్పుడ్‌సెల్‌ను పర్యావరణంలోకి విడుదల చేసినప్పుడు ప్రమాదాలు జరగకుండా  నిరోధించడానికి ఈ కణం జన్యువులోనే రక్షణ కవచాలు, ఫెయిల్‌–సేఫ్‌లను రూ΄÷ందించే ప్రయత్నం చేస్తున్నారు.

మరింత వేగంగా...
కృత్రిమకణం అనేది ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది శాస్త్రవేత్తల ఉమ్మడి లక్ష్యం. అయితే వారికి ఎదురయ్యే సమస్యలు, వాటిని ఎలా పరిష్కరించుకుంటున్నారు అనేది ఎవరికి వారికి భిన్నంగా ఉంటుంది. ‘స్పుడ్‌ సెల్‌’ టెక్నాలజీపై పనిచేయాలనుకునే ఎవరికైనా దానిని అందుబాటులోకి తేవడమే మా లక్ష్యం. విద్యావేత్తలు, లాభాపేక్షలేని సంస్థలు దీన్ని ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. స్పుడ్‌ సెల్‌ ఉపయోగపడే విధంగా చేసే ప్రక్రియను వేగవంతం చేయడానికి అంతర్జాతీయ సమాజాన్ని ఒకే తాటి పైకి తీసుకురావడం నాకు సంతోషాన్ని కలిగిస్తోంది.

– అడమలా
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement