
దేశీయ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ 'ఓలా ఎలక్ట్రిక్' తమిళనాడులోని తన గిగాఫ్యాక్టరీలో తయారు చేసిన లిథియం అయాన్ బ్యాటరీ అయిన 4680 “భారత్ సెల్”ను ప్రారంభించింది. అంతే కాకుండా కంపెనీ తన రోడ్‌స్టర్ X+, ఎస్1 ప్రో ధరలను కూడా తగ్గించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
భారతదేశంలో తయారైన భారత్ సెల్.. పరిమాణంలో కొంత పెద్దదిగా ఉంటుంది. ఈ సెల్ వెడల్పు 46 మిమీ, ఎత్తు 80 మిమీ ఉంటుంది. ఇది వేగంగా ఛార్జ్ చేసుకోగలదు. ఇది ఎక్కువ పరిధిని అందించేలా రూపొందించారు. ఈ కొత్త సెల్ మన దేశంలో రూపొందించడం వల్ల.. ఇతర దేశాల నుంచి బ్యాటరీలను దిగుమతి చేసుకునే అవకాశం చాలా వరకు తగ్గుతుంది. ఇది 'ఆత్మనిర్భర్ భారత్' మిషన్‌కు దోహదపడుతుంది.
ఎలక్ట్రిక్ స్కూటర్లపై డిస్కౌంట్
ఓలా ఎలక్ట్రిక్ బ్యాటరీని లాంచ్ చేయడంతో పాటు.. రోడ్‌స్టర్ X+ (9.1 kWh), S1 ప్రో+ ధరలను తగ్గించింది. ధరల తగ్గుదల తరువాత రోడ్‌స్టర్ X+.. ఇప్పుడు రూ.1.89 లక్షలకు, S1 ప్రో+ ధర రూ.1.69 లక్షలకు చేరుకుంది. అంతే కాకుండా ఆగస్టు 17 లోపల బుక్ చేసుకుంటే.. మరో రూ.10000 తగ్గింపు లభిస్తుంది. కాగా ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ బుక్ చేసుకున్న తరువాత.. డెలివరీలు నవరాత్రి నుంచి ప్రారంభమవుతాయి.
ఇదీ చదవండి: దేశీయ దిగ్గజం హవా.. ఒకేసారి నాలుగు కొత్త కార్లు
భారత్ సెల్ అనేది భవిష్యత్ మోటార్ సైకిళ్ళు.. ఇతర ఎలక్ట్రిక్ వాహనాలకు కూడా శక్తినివ్వగలదు. సొంతంగా పవర్ బ్యాటరీలను తయారు చేయడం ద్వారా, దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల ధరలు కొంత తగ్గుతాయి. ఇది ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని వేగవంతం చేస్తుంది. తద్వారా ఇండియాలో కాలుష్య తీవ్రత గణనీయంగా తగ్గుతుంది.