రాజీకీయ పార్టీలు, విపక్షాల గుండెల్లో గుబులు తెప్పిస్తున్న ఎన్నికల జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ఓ తల్లి గర్భశోకాన్ని తీర్చింది. ఎన్నో ఏళ్లుగా తల్లిడిల్లుతున్న ఆ అమ్మ ముఖంలో నవ్వులు తెప్పించింది. నిజానికి మంచి కోసం చేపట్టే పారదర్శక డ్రైవ్‌లు ప్రజలకు గొప్ప మేలునే చేస్తాయి అనేందుకు ఈ అమ్మకథే ఉదహరణ.
అసలేం జరిగిందంటే..దేశవ్యాప్తంగా ప్రధాన చర్చనీయాంశంగా మారిన ఎన్నికల జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ఓ అమ్మ గర్భశోకాన్ని తీర్చి ఊరటనిచ్చిన కేసు వెలుగులోకి వచ్చింది. రాజకీయ పార్టీల నుంచి పెద్దఎత్తున ఆందోళనలు, వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న ఈ డ్రైవ్ రాజస్థాన్‌లోని భిల్వారాకి చెందిన ఓ కుటుంబానికి గొప్ప ఊరటనిచ్చింది.
40 ఏళ్లుగా కూమారుడి ఆచూకీ కోసం తపిస్తున్న ఆ కుటుంబానికి కొత్త ఆశను అందించి..ఆ కొడుకుని ఆ అమ్మ ఒడికి అందించింది. ఈఘటన రాజస్థాన్ భిల్వారాలోని సూరజ్ గ్రామంలో చోటుచేసుకుంది. 40 ఏళ్ల క్రితం తప్పిపోయిన ఉదయ్‌సింగ్ అనే వ్యక్తిని చత్తీస్‌గఢ్‌లో 1300 కిలో మీటర్ల దూరంలో నివశిస్తున్నట్లు గుర్తించి తల్లి దేవిరావత్ దరికి చేర్చింది SIR. అతను 1980లో తన ఇంటి నుంచి తప్పిపోయాడు.
పాపం అతడి కుటుంబం దాదాపు మూడు దశాబ్దాలుగా అతడి ఆచూకీకై నిరీక్షిస్తూనే ఉంది. నిజానికి ఉదయ్‌సింగ్ తప్పిపోయినప్పుడూ చత్తీస్‌గఢ్‌కు చేరుకున్నాడు. అక్కడే ఒక ప్రైవేట్ కంపెనీలో గార్డుగా పనిచేసేవాడు. ఆ సమయంలోనే రోడ్డు ప్రమాదంలో ఉదయ్ సింగ్ తలకు గాయం అవ్వడంతో తన కుటుంబం జ్ఞాపకాలన్నీ తుడుచుపెట్టుకుపోయాయి. అందువల్లే తన కుటుంబం దరిచేరినా..తన ఇంటిని, కుటుంబ సభ్యులను గుర్తించడంలో చాలా ఇబ్బంది పడ్డాడు. మరి ఈ ఎన్నికల జాబితా స్పెషల్ డ్రైవ్ ఎలా అతడి ఆచూకిని కనుగొందంటే..
SIR ఇలా కనుగొంది..
ఎనికల జాబితా స్పెషల్ డ్రైవ్ వెరిఫికేషన్‌కి వచ్చినప్పుడు తన గుర్తింపు పత్రాల విషయమై తడబడ్డాడు, అయితే తన గ్రామం పేరు, కులం పేరు మాత్రం గుర్తుండటం విశేషం. అతడు చెబుతున్న వివరాలను గమనించిన వెరిఫికేషన్ అధికారి చిన్న అనుమానంతో రాజస్థాన్‌లో కుమారుడి ఆచూకీకై అల్లాడుతున్న కుటుంబానికి సమాచారం అందించాడు.
ఎప్పుడో చిన్నప్పుడు తప్పి పోవడంతో దాదాపు 40 ఏళ్ల తర్వాత తమ కుమారుడేనా అనిపోల్చుకోవడం తల్లి దేవి రావత్‌కి, కుటుంబసభ్యులకు కాస్త కష్టమైంది. అయితే ఉదయ్ తన చిన్నప్పటి కుటుంబం జ్ఞాపకాలు, తనకు చిన్నతనంలో నుదిటిపై అయిన పాత గాయాల వివరాలు గురించి పూసగుచ్చినట్లుగా చెప్పడంతో తల్లి తన కొడుకేనని గుర్తించడమే గాక పట్టరాని సంతోషంతో తడిసిముద్దయ్యింది.
ఉదయ్‌కి గ్రాండ్ వెల్‌కమ్...
గ్రామస్తులు, దూరపు బంధువులు అతడిని కలవడానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. జస్ట్ 150 ఇళ్లు ఉండే ఆగ్రామం ఈ సంఘటనతో మొత్తం పండుగ వాతావరణం తలపించేలా సందడిగా మారిపోయింది. ఇన్నేళ్ల తర్వాత తిరిగి వచ్చాడని..అతడి కుటుంబసభ్యులు సాంప్రదాయ ఊరేగింపుతో.. గ్రాండ్‌గా వెల్‌కమ్ పలికారు.
SIR అంటే..
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) అనేది ఓటరు జాబితాలో సమగ్రతను, కచ్చితత్వాన్ని నిర్ధారించడానికి ఎన్నికల సంఘం చేపట్టే ప్రత్యేకమైన, గడువుతో కూడిన ఇంటింటి తనిఖీ కార్యక్రమం. సాధారణంగా నిర్వహించే వార్షిక సవరణ కంటే ఇది చాలా విస్తృతమైనది, లోతైనది.
ఓటరు జాబితాలో అనర్హులు లేకుండా తొలగించడం ఇందులో ప్రధానమైనది. ముఖ్యంగా మరణించినవారు, ఇతర ప్రదేశాలకు తరలి వెళ్లినవారు లేదా అర్హత లేనివాళ్లను గుర్తించి తొలగిస్తారు. అలాగే 18 ఏళ్లు నిండినా కూడా ఓటరు జాబితాలో నమోదు చేసుకోని వాళ్లను గుర్తించి ఓటు హక్కు కల్పిస్తారు.
(చదవండి: అమెరికా మోజుతో రూ.90 లక్షల ప్యాకేజీని కాలదన్నాడు! చివరికి..)


