పలు రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కొనసాగుతోంది. రాజకీయ పార్టీల అభ్యంతరాలను పక్కన పెట్టి.. ఈ ప్రక్రియను కొనసాగించాలని కోర్టులు సైతం ఆదేశించాయి. దీంతో.. ఎన్నికల సంఘం చకచకా ప్రక్రియను కొనసాగిస్తోంది.
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఎస్‌ఐఆర్ (ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ) నివేదికను ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. రాష్ట్రంలో 2కోట్ల 89 లక్షల మంది ఓట్లను తొలగించినట్లు తెలిపింది.
దేశంలో ఓటర్ల జాబితాను సమగ్రంగా పారదర్శకంగా రూపొందించడానికి కేంద్ర ఎన్నికల సంఘం 2025లో (ఎస్ఐఆర్) ఓటర్ల జాబితా సవరణ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా సమగ్రంగా సర్వే జరిపి కొత్త ఎంట్రీలను చేర్చడం, అర్హత లేనివి తొలగించడం.. ఇంకా ఏవైనా సవరణలుంటే చేయడం తదితరమైనవి చేయనున్నారు. అయితే ఇటీవలే యూపీలో (SIR) సర్వే నిర్వహించగా తాజాగా దాని వివరాలను ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ విడుదల చేశారు.
దీనిపై ఆ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి మాట్లాడుతూ "రాష్ట్రంలో మెుత్తంగా 15కోట్ల మంది ఓటర్లు ఉండగా వీరిలో 12 కోట్ల మంది వెరిఫికేషన్‌లో పాల్గొన్నారు. మెుత్తంగా 81శాతం మంది సర్వే పత్రాలపై సంతకం చేసి సమర్పించారు. 18శాతం మంది పాల్గొనలేదు. ఓటర్ల సర్వేలో 46.32లక్షల మంది ఓటర్లు మరణించినట్లు తేలింది. 2.17 కోట్ల మంది వలసకు వేరే ప్రాంతం వెళ్లారు. 25.47 లక్షల మంది వారి పేర్లు ఒకటి కంటే ఎక్కువ చోట్ల నమోదు చేసుకున్నారు". అని తెలిపారు. రమారమీగా దాదాపు 3 కోట్ల మందిని ఓటర్ల జాబితానుండి తొలిగించినట్లు పేర్కొన్నారు.
దీంతో దేశంలో అత్యధిక శాతం ఓట్ల తొలగింపు జరిగిన రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ రికార్డులోకెక్కింది. ఉత్తరప్రదేశ్ 18.75శాతం, తమిళనాడు 15శాతం, గుజరాత్ 14.5శాతం ఆ తరువాతి స్థానాల్లో ఉన్నట్లు ఎలక్షన్ కమిషన్ పేర్కొంది. ఓటర్ల జాబితాలో ఏవైనా అభ్యంతరాలుంటే జనవరి ఆరు నుంచి ఫిబ్రవరి ఆరు వరకూ అభ్యంతరాలు స్వీకరిస్తామని తెలిపింది. ఉత్తరప్రదేశ్‌లో దాదాపు 91శాతం ఓటర్ల మ్యాపింగ్ పూర్తయిందని మరో తొమ్మిదిశాతం మిగిలి ఉందని ఎలక్షన్ కమిషన్ పేర్కొంది.


