భోపాల్: ఒకప్పుడు సూర్యుడు అస్తమించని రాజ్యం తమదేనని గర్వంగా చెప్పుకున్న బ్రిటిష్ ప్రభుత్వం ఓ భారతీయుడి నుంచి అప్పు తీసుకుంది. తీసుకున్న అప్పును ఎగ్గొట్టింది. తాజాగా, ఆ అప్పుకు సంబంధించిన పత్రాలు వెలుగులోకి రావడంతో అసలు విషయం బయటపడింది. దీంతో భారతీయుడు.. ప్రస్తుత లండన్ ప్రభుత్వానికి నోటీసులు పంపించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నాటి రాజు తమ వద్ద నుంచి అప్పు తీసుకున్నారని, ఆ అప్పును మీరు చెల్లించాల్సి ఉంటుందని యూకే ప్రభుత్వానికి పంపించే నోటీసుల్లో పేర్కొననున్నారు.
అది బ్రిటిష్ రాజుల కాలం అంటే 1917. మొదటి ప్రపంచ యుద్ధం కొనసాగుతున్న సమయం. ఆ సమయంలో బ్రిటిష్ రాజు (కింగ్ జార్జ్ V) నేతృత్వంలో బ్రిటిష్ సైన్యం జర్మనీ, ఆస్ట్రియా-హంగేరీ, ఒట్టోమన్ సామ్రాజ్యం, బల్గేరియా దేశాలపై యుద్ధం చేస్తోంది. యుద్ధం అయితే చేస్తుంది గానీ సైన్యానికి కావాల్సిన ఆయుధాలు,ఆహారం వారి బాగోగులు చూసుకునేందుకు యూకే ప్రభుత్వం వద్ద నిధులు లేవు.
ఆ సమస్య నుంచి బయటపేందుకు యూకేతో సన్నిహిత సంబంధాలున్న దేశాల నుంచి అప్పులు తీసుకునేది. అలా నాడు మధ్యప్రదేశ్ సెహోర్ పట్టణంలో నివాసం ఉంటున్న వ్యాపారవేత్త సేట్ జుమ్మాలాల్ రూతియా నుంచి యూకే ప్రభుత్వం రాత పూర్వకంగా 30వేల అప్పుగా తీసుకుంది. ఆ యుద్ధంలో యూకేతో పాటు దాని మిత్ర దేశాలు విజయం సాధించాయి. రూతియా నుంచి తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వలేదు. తాజాగా,నాటి అప్పుకు సంబంధించిన డాక్యుమెంట్లు వెలుగులోకి వచ్చాయి.
సేట్ జుమ్మాలాల్ 1937లో మరణించినప్పటికీ, అప్పు తిరిగి చెల్లింపు విషయం మరుగున పడింది. ఇప్పుడు, ఆయన మనవడు వివేక్ రూతియా ఆ అప్పును తిరిగి పొందేందుకు బ్రిటిష్ ప్రభుత్వానికి న్యాయ నోటీసు పంపేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు.
వివేక్ రూతియా ఇటీవల తన తండ్రి మరణం తర్వాత కుటుంబ పత్రాలలో పాత సర్టిఫికెట్లు, లేఖలు, వీలునామాలలో ఈ అప్పు వివరాలు బయటపడ్డాయని చెప్పారు. ఈ అప్పు ‘వార్ లోన్’ పేరుతో, భోపాల్ సంస్థానంలో బ్రిటిష్ పాలన సమయంలో పరిపాలనను సులభతరం చేయడానికి తీసుకున్నట్లు పత్రాలు సూచిస్తున్నాయి. ఆయన వాదన ప్రకారం, 1917లో రూ. 35,000 విలువను ద్రవ్యోల్బణం ఆధారంగా లెక్కిస్తే 30 నుంచి 40 కోట్ల మధ్య ఉంటుందని అంచనా
సీహోర్, భోపాల్ సంస్థానంలో రూతియా కుటుంబం ఒకప్పుడు అత్యంత ప్రభావవంతమైనది. వారి భూములు, ఆస్తులు విస్తారంగా ఉండేవి. నేటికీ సీహోర్‌లోని 20-30 శాతం స్థలాలు రూతియా కుటుంబానికి చెందినవని చెబుతారు. వారు ఇప్పటికీ వ్యవసాయం, హాస్పిటాలిటీ, రియల్ ఎస్టేట్ రంగాల్లో కొనసాగుతున్నారు. అయితే, పాతకాలపు అద్దె వివాదాలు, ఆస్తి కేసులు వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.


