జార్ఖండ్‌ సీఎం  సోరెన్‌కు ఊరట  | Supreme Court stayed criminal proceedings against Jharkhand CM Hemant Soren | Sakshi
Sakshi News home page

జార్ఖండ్‌ సీఎం  సోరెన్‌కు ఊరట 

Feb 26 2026 4:35 AM | Updated on Feb 26 2026 4:35 AM

Supreme Court stayed criminal proceedings against Jharkhand CM Hemant Soren

క్రిమినల్‌ కేసులో దర్యాప్తుపై స్టే ఇచ్చిన సుప్రీం

న్యూఢిల్లీ: క్రిమినల్‌ కేసులో జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌కు సుప్రీంకోర్టులో ఊరట దక్కింది. చట్టవిరుద్ధమైన మైనింగ్‌కు సంబంధించిన మనీ లాండరింగ్‌ కేసులో దర్యాప్తునకు హాజరు కావాలని ఆదేశిస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) ఇచ్చిన సమన్లకు ఉద్దేశపూర్వకంగా స్పందించలేదని పేర్కొంటూ ఆయనపై గతంలో క్రిమినల్‌ కేసు నమోదయ్యింది.

 ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ హేమంత్‌ సోరెన్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈడీ పదేపదే తనకు సమన్లు జారీ చేస్తుండడాన్ని సవాలు చేస్తూ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. సోరెన్‌పై దర్యాప్తునకు నిలిపివేస్తూ ఆదేశాలిచ్చింది. ఈ మేరకు ఈడీకి నోటీసు జారీ చేసింది.

 అంతకముందు ఈడీ తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ అనిల్‌ కౌశిక్‌ వాదనలు వినిపించారు. ఏడుసార్లు సమన్లు జారీ చేసినప్పటికీ సోరెన్‌ స్పందించలేదని, ఈడీ ఎదుట విచారణకు హాజరు కాలేదని చెప్పారు. మనీ లాండరింగ్‌ కేసులో దర్యాప్తు చాలావరకు పూర్తయ్యిందని, ఒకే ఒక్క సాక్షిని ప్రశ్నించాల్సి ఉందని పేర్కొన్నారు. అనంతరం జస్టిస్‌ సూర్యకాంత్‌ స్పందించారు. ఈడీ చాలా ఫిర్యాదులు చేస్తున్నట్లు వార్తా పత్రికల్లో చదివామని, ముందుగా వాటిపై దృష్టి పెట్టాలని సూచించారు.  

Advertisement
 
Advertisement
Advertisement