పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి చెందిన ముంబై నివాసం ‘అబోడ్’ను మనీ లాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద తాత్కాలికంగా జప్తు చేసినట్లు ఈడీ (Enforcement Directorate) బుధవారం (ఫిబ్రవరి 25) వెల్లడించింది. ఈ ఆస్తి విలువ సుమారు రూ.3,716.83 కోట్లు అని అధికారులు తెలిపారు. ఇప్పటికే రూ.473.17 కోట్ల విలువైన ఆస్తులపై అమల్లో ఉన్న తాత్కాలిక అటాచ్‌మెంట్‌కు కొనసాగింపుగా తాజా ఉత్తర్వు జారీ అయ్యింది.
సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. భారత శిక్షాస్మృతి సెక్షన్లు 120-బి, 406, 420తో పాటు అవినీతి నిరోధక చట్టం, 1989 నిబంధనల కింద రిలయన్స్ కమ్యూనికేషన్స్ (Reliance Communications (ఆర్‌కామ్)), అనిల్ అంబానీ, ఇతరులపై కేసులు నమోదు అయ్యాయి.
దర్యాప్తులో ఆర్‌కామ్, దాని అనుబంధ సంస్థలు దేశీయ, విదేశీ రుణదాతల నుండి భారీ మొత్తంలో రుణాలు పొందినట్లు, అందులో సుమారు రూ.40,185 కోట్లు బకాయి ఉన్నట్లు ఈడీ వెల్లడించింది. అలాగే ముంబై పాలి హిల్‌లోని ఆస్తితో పాటు ఇతర ఆస్తులను అనిల్ అంబానీ కుటుంబ సభ్యుల ప్రైవేట్ ట్రస్ట్ అయిన రైజ్ ఈ ట్రస్ట్‌లో సమీకరించినట్లు గుర్తించింది. కుటుంబ సంపదను రక్షించుకునేందుకు, బ్యాంకుల రికవరీ చర్యల నుంచి తప్పించుకునేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు అనుమానం వ్యక్తం చేసింది.
ముంబైలోని ప్రముఖ పాలి హిల్ ప్రాంతంలో 17 అంతస్తులతో, 216 అడుగుల ఎత్తులో నిర్మితమైన ఈ భవనం నగరంలో అత్యంత ఖరీదైన నివాసాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. తాజా ఉత్తర్వుతో ఈ కేసులో ఇప్పటివరకు జప్తు చేసిన ఆస్తుల మొత్తం విలువ రూ.15,700 కోట్లకు చేరినట్లు ఈడీ వెల్లడించింది.


