భారత్‌కు అమెరికా కొత్త ‘షాక్’ ఇచ్చింది. ఇండియా నుంచి దిగుమతి అయ్యే సౌర ఉత్పత్తులపై భారీగా సుంకాలను విధిస్తున్నట్లు అమెరికా వాణిజ్య శాఖ ప్రకటించింది. భారత్‌తోపాటు ఇండోనేషియా, లావోస్ దేశాల సౌర ఉత్పత్తులపైనా టారిఫ్‌లను విధిస్తున్నట్లు వెల్లడించింది. కొంతమంది విదేశీ తయారీదారులు ప్రభుత్వ ప్రోత్సాహకాలు పొందుతూ, మార్కెట్ ధరల కంటే తక్కువకు సౌర పరికరాలను అమెరికాలో విక్రయిస్తున్నారన్న దర్యాప్తు నివేదికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.
భారత్‌కు 126% సుంకాలు
భారతీయ సౌర ఉత్పత్తులపై సుమారు 126 శాతం ప్రాథమిక సుంకం విధించనుంది అమెరికా. ఇక ఇండోనేషియా నుంచి వచ్చే దిగుమతులపై 86 శాతం నుంచి 143 శాతం వరకు, లావోస్ ఉత్పత్తులపై సుమారు 81 శాతం సుంకాలు అమల్లోకి రానున్నాయి. పన్ను రాయితీలు, తక్కువ వడ్డీ రుణాలు, ఇతర ప్రభుత్వ మద్దతు వంటి ప్రయోజనాల వల్ల ఎగుమతిదారులు పొందుతున్న అన్యాయ లాభాలను సమతుల్యం చేయడమే ఈ చర్యల లక్ష్యమని యూఎస్ అధికారులు స్పష్టం చేశారు. ఈ సుంకాలు ప్రస్తుతానికి తాత్కాలికమే అయినా వీటిపై రానున్న నెలల్లో తుది నిర్ణయం తీసుకోనున్నారు.
అమెరికా మార్కెట్లో కీలక భాగస్వామ్యం
యూఎస్ గణాంకాల ప్రకారం.. 2025 ప్రథమార్ధంలో అమెరికాలోకి దిగుమతి అయిన మొత్తం సోలార్ మాడ్యూల్స్‌లో భారత్, ఇండోనేషియా, లావోస్.. మూడు దేశాల వాటా 57 శాతం. ఇందులో భారత ఎగుమతుల విలువ సుమారు 790 మిలియన్ డాలర్లుగా అంచనా. దేశీయ డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా సౌర మార్కెట్ దిగుమతులపై ఎక్కువగా ఆధారపడుతోంది.
భారత ఎగుమతిదారుల్లో ఆందోళన
అమెరికా ప్రధాన మార్కెట్‌గా మారిన నేపథ్యంలో భారత సౌర తయారీదారులు ఈ నిర్ణయంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2023 నుంచి 2025 మధ్య భారత సోలార్ మాడ్యూల్ ఎగుమతుల్లో దాదాపు 97 శాతం యునైటెడ్ స్టేట్స్‌కే వెళ్లినట్లు అంచనాలు చెబుతున్నాయి. తాజా సుంకాల వల్ల ధరల పోటీ సామర్థ్యం, ఎగుమతి పరిమాణాలపై ప్రతికూల ప్రభావం ఉండే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.


