అమెరికా పేరు చెబితేనే వణుకుతున్నారు: ట్రంప్ | Trump hails Americas golden age | Sakshi
Sakshi News home page

అమెరికా పేరు చెబితేనే వణుకుతున్నారు: ట్రంప్

Feb 25 2026 8:35 AM | Updated on Feb 25 2026 9:52 AM

Trump hails Americas golden age

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షునిగా రెండో విడత బాధ్యతలు చేపట్టిన అనంతరం ట్రంప్‌ తొలిసారి కాంగ్రెస్‌ను ఉద్దేశించి ప్రసంగించారు. దేశం ప్రస్తుతం ఒక అద్భుతమైన మార్పునకు సాక్ష్యంగా నిలుస్తోందని పేర్కొన్నారు. తన పరిపాలనలో గడిచిన ఏడాది కాలం అమెరికా చరిత్రలోనే ఒక గొప్ప మలుపుగా అభివర్ణించారు. దేశ ఆర్థిక వ్యవస్థ గతంలో ఎన్నడూ లేనంత వేగంగా పుంజుకుంటోందని పేర్కొన్నారు. స్వర్ణయుగం దిశగా అమెరికా పయనిస్తున్నదని వ్యాఖ్యానించారు. 

తాను అధికారంలోకి వచ్చే నాటికి దేశం తీవ్ర సంక్షోభంలో ఉందని, కుంటుపడిన ఆర్థిక వ్యవస్థ, రికార్డు స్థాయి ద్రవ్యోల్బణం, అదుపులేని సరిహద్దు సమస్యలు, పెరుగుతున్న నేరాలతో సతమతమవుతున్న అమెరికాను కేవలం ఏడాది కాలంలోనే ప్రపంచం గర్వించే స్థాయికి చేర్చానని ట్రంప్‌ పేర్కొన్నారు. సభలో ఒకవైపు నిరసనలు వ్యక్తమవుతున్నప్పటికీ, ఆయన మద్దతుదారులు ‘యూఎస్ఏ’ అంటూ నినాదాలతో హోరెత్తించారు.
 

దేశ భద్రత, సరిహద్దు రక్షణపై ట్రంప్ తన ప్రసంగంలో ప్రత్యేకంగా చెప్పారు. అమెరికా సరిహద్దులు ప్రస్తుతం అత్యంత సురక్షితంగా ఉన్నాయని, శత్రు దేశాలవారు అమెరికా పేరు చెబితేనే వణుకుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. సైనిక, పోలీసు బలగాలను మునుపటి కంటే మరింత శక్తివంతం చేశామని, దీనివల్ల అంతర్జాతీయ వేదికపై అమెరికా కోల్పోయిన గౌరవాన్ని తిరిగి సంపాదించుకుందని అధ్యక్షుడు ట్రంప్‌ పేర్కొన్నారు.

ప్రపంచవ్యాప్తంగా అశాంతి నెలకొన్న తరుణంలో కూడా అమెరికా తన బలాన్ని నిరూపించుకున్నదని, రానున్న రోజుల్లో దేశం మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహిస్తుందని ట్రంప్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.  కాగా ట్రంప్ తన విజయాలను చాటుకుంటున్న సమయంలోనే, ఆయన విదేశాంగ విధానాలు, సుంకాల విధింపుపై ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి నెలకొంది. గతంలో ప్రభుత్వం విధించిన సుంకాలను సుప్రీంకోర్టు కొట్టివేయగా, తాజాగా 15 శాతం ప్రపంచవ్యాప్త సుంకాలను విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడం గమనార్హం.

అటు ఇరాన్‌తో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలు, దాడుల భయాల మధ్య ఈ ప్రసంగం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు దేశీయంగా పెరుగుతున్న జీవన వ్యయం, వలసల నియంత్రణ వంటి అంశాల్లో ట్రంప్ తీరుపై ప్రజల్లో కొంతమేరకు అసంతృప్తి వ్యక్తమవుతోందని ఇటీవలి ప్రజాభిప్రాయ సేకరణలు వెల్లడిస్తున్నాయి. ఈ సవాళ్ల మధ్యే, తన ప్రభుత్వం సాధించిన మార్పు సామాన్యమైనది కాదని, ఇది రాబోయే తరాలకు దిక్సూచిగా నిలుస్తుందని ట్రంప్ పేర్కొనడం గమనార్హం.

డొనాల్డ్ ట్రంప్ ‘స్టేట్ ఆఫ్ ది యూనియన్’ ప్రసంగంలోని ప్రధాన అంశాలు

అమెరికాలో సరికొత్త స్వర్ణయుగం ప్రారంభం.

దేశ పునర్నిర్మాణానికి నాందిగా గత ఏడాది కాలం.

అమెరికా ఆత్మగౌరవం పునరుద్ధరణ మరియు ఆర్థిక వ్యవస్థ వేగవంతం.

ప్రపంచ దేశాల ముందు పెరిగిన అమెరికా గౌరవం.

గత తొమ్మిది నెలల్లో అక్రమ వలసలు శూన్యం.

చరిత్రలోనే అత్యంత కట్టుదిట్టమైన సరిహద్దు భద్రత.

కేవలం 12 నెలల్లోనే ద్రవ్యోల్బణం అదుపులోకి..

2025 చివరి త్రైమాసికంలో 1.7 శాతానికి చేరిన ద్రవ్యోల్బణం..

అనేక రాష్ట్రాల్లో గాలన్ పెట్రోల్ ధర 2.30 డాలర్ల కంటే తక్కువకు తగ్గింపు.

కొన్ని చోట్ల 1.99 డాలర్లకే లభిస్తున్న పెట్రోల్..

పెట్టుబడులు, పరిశ్రమలు మరియు ఉపాధి అవకాశాల వెల్లువ..

చమురు అవసరాల కోసం వెనిజులాతో సరికొత్త భాగస్వామ్యం..

వెనిజులా నుంచి ఇప్పటికే 80 మిలియన్ బ్యారెళ్ల చమురు దిగుమతి.

వెనిజులా ఇంధన రంగంలో అమెరికా సంస్థల 100 బిలియన్ డాలర్ల పెట్టుబడి ప్రణాళిక.

ఇరు దేశాల మధ్య చమురు లాభాల పంపకం.

'డ్రిల్, బేబీ, డ్రిల్' నినాదంతో ఇంధన స్వయంసమృద్ధి.

టారిఫ్‌లపై సుప్రీంకోర్టు తీర్పు పట్ల తీవ్ర అసహనం.

విదేశీ కంపెనీలు ఒప్పందాలకు కట్టుబడి ఉండేలా కఠిన చర్యలు.

ఎన్నికల సంస్కరణల కోసం కాంగ్రెస్‌కు పిలుపు.

ఓటర్లకు గుర్తింపు కార్డు, పౌరసత్వ ధృవీకరణ తప్పనిసరి

30 మంది డెమొక్రాట్ ప్రతినిధుల ప్రసంగ బహిష్కరణ

డెమొక్రాట్ల ఆధ్వర్యంలో 'పీపుల్స్ స్టేట్ ఆఫ్ ది యూనియన్' కార్యక్రమం.

సభలో రిపబ్లికన్ల 'USA' నినాదాల హోరు

నిరసన తెలిపిన కాంగ్రెస్ సభ్యుడు అల్ గ్రీన్ సభ నుంచి బహిష్కరణ

వాషింగ్టన్, లాస్ ఏంజెల్స్ నగరాల్లో నేరాల అదుపునకు హామీ.

అమెరికా ప్రజల భద్రతే ప్రధమ ప్రాధాన్యత

సైనిక, పోలీసు బలగాల పటిష్ఠత

శత్రువుల గుండెల్లో భయం, సరిహద్దుల రక్షణ

దేశ ఆర్థిక, రక్షణ రంగాల్లో చారిత్రాత్మక పురోగతి.
 

Advertisement
 
Advertisement
Advertisement