ఇల్లు.. పిల్లలకు నచ్చేలా.. | Making Homes More Fun for Children real estate | Sakshi
Sakshi News home page

ఇల్లు.. పిల్లలకు నచ్చేలా..

Feb 14 2026 11:02 AM | Updated on Feb 14 2026 11:15 AM

Making Homes More Fun for Children real estate

కొత్త ఆలోచనలు, ఆసక్తి, కుతూహలం వంటి లక్షణాలన్నీ చిన్నారుల్లో అధికంగా ఉంటాయి. వారికంటూ ఒక ప్రత్యేక ప్రపంచం ఉంటే ఇవి మరింత ఇనుమడిస్తాయి. వారిలో సృజనాత్మక శక్తి ఊపిరి పోసుకుంటుంది. ఈ విషయాన్ని గ్రహించిన తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇంట్లోనూ వారి కోసం ఓ ప్రత్యేక ప్రపంచం ఉండాలని భావిస్తున్నారు. చిల్డ్రన్‌ స్పెషల్‌ రూమ్‌లు ఈ భావనతోనే ఆవిర్భవించాయి. కాన్సెప్ట్‌ బాగుండటంతో ఇంటీరియర్‌ డెకరేటర్స్‌ సలహాలు తీసుకుంటున్నారు. సరైన ప్రణాళికను అనుసరిస్తే భేషుగ్గా మీరే మీ పిల్లల గదిని తీర్చిదిద్దుకోవచ్చు.  

ఆసక్తి, అభిరుచి, వయస్సు.. 
పిల్లల రూమ్‌ ఇలాగే ఉండాలని రూల్‌ ఏమీ లేదు. వారి ఆసక్తి, అభిరుచి, వయస్సు, జెండర్‌ దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాలు. దీనికితోడు పిల్లల ఆరోగ్యం, చదువు, ప్రవర్తనలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. చిన్న వయసులో అందరు పిల్లలకు ఉండే ఉత్సాహానికి ఊతమిచ్చేలా కొంచెం సృజనాత్మకత, ఆడంబరాన్ని జోడిస్తే ఆ గదికి తిరుగే ఉండదు. అయితే క్షణానికో కొత్త ఇంటీరియర్‌ పుట్టుకొస్తున్న తరుణంలో అన్ని హంగులు అమర్చుకోవాలంటే కొంచెం ఖర్చుతో కూడిన వ్యవహారమే..

రంగులే కీలకం.. 
పిల్లలను ఆకట్టుకొనేలా గదిని రూపొందించడంలో రంగులకు కావాల్సినంత ప్రాధాన్యం ఉంది. మానసిక శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం చిన్న పిల్లలు ఎరుపు, నీలం, పసుపు రంగులను ఇష్టపడతారు. ఇవి కాకుండా ఆకుపచ్చ, పర్పుల్‌ కూడా ఓకే. ఇక వయోలెట్, పింక్‌ కూడా పర్వాలేదు. అన్నింటికన్నా ముఖ్యం మీ చిన్నారి ఏ రంగు ఇష్టపడుతున్నాడు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. మొత్తం ఒకే రంగు కాకుండా గదిలో వేర్వేరు చోట్ల రంగులను నింపడం ద్వారా అందాన్ని తేవచ్చు. ఒక్కో రంగు ఒక్కో విధమైన ప్రేరణ కల్పిస్తుందని కలర్‌ సైకాలజీ చెబుతోంది. కాబటి తేలిక రంగులు వేస్తే మంచిది. పిల్లలకు ఇష్టమైన కార్టూన్‌ క్యారెక్టర్లను గోడలపై చిత్రించడం ద్వారా వారికి ఆనందాన్ని కలుగచేయవచ్చు. సీలింగ్‌కు చీకట్లో కూడా మెరిసే విధంగా ఉండే మెటాలిక్‌ రంగులు వేస్తే చీకట్లోనూ హాయిగా నిద్రపోతారు.

కంటికి శ్రమ కలిగించని లైటింగ్‌.. 
లైట్ల విషయానికి వస్తే బాగా వెలుతురు అందించే ఫ్లోరోసెంట్‌ బల్బులను వాడాలి. కంటిపై ఎలాంటి ప్రభావం చూపకుండా, చదువుకొనేటప్పుడు ఇబ్బంది కలగకుండా ఉండాలి. పిల్లల గది కదా అని హంగామా చేసి అన్ని వస్తువులను పేర్చేయకుండా అవసరమైన మేరకు ఉంచాలి. వారి అభిరుచులకు ప్రాధాన్యం ఇస్తూనే ఆకట్టుకొనే విధంగా రూపొందించాలి.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement