breaking news
child room
-
ఇల్లు.. పిల్లలకు నచ్చేలా..
కొత్త ఆలోచనలు, ఆసక్తి, కుతూహలం వంటి లక్షణాలన్నీ చిన్నారుల్లో అధికంగా ఉంటాయి. వారికంటూ ఒక ప్రత్యేక ప్రపంచం ఉంటే ఇవి మరింత ఇనుమడిస్తాయి. వారిలో సృజనాత్మక శక్తి ఊపిరి పోసుకుంటుంది. ఈ విషయాన్ని గ్రహించిన తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇంట్లోనూ వారి కోసం ఓ ప్రత్యేక ప్రపంచం ఉండాలని భావిస్తున్నారు. చిల్డ్రన్ స్పెషల్ రూమ్‌లు ఈ భావనతోనే ఆవిర్భవించాయి. కాన్సెప్ట్ బాగుండటంతో ఇంటీరియర్ డెకరేటర్స్ సలహాలు తీసుకుంటున్నారు. సరైన ప్రణాళికను అనుసరిస్తే భేషుగ్గా మీరే మీ పిల్లల గదిని తీర్చిదిద్దుకోవచ్చు. ఆసక్తి, అభిరుచి, వయస్సు.. పిల్లల రూమ్ ఇలాగే ఉండాలని రూల్ ఏమీ లేదు. వారి ఆసక్తి, అభిరుచి, వయస్సు, జెండర్ దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాలు. దీనికితోడు పిల్లల ఆరోగ్యం, చదువు, ప్రవర్తనలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. చిన్న వయసులో అందరు పిల్లలకు ఉండే ఉత్సాహానికి ఊతమిచ్చేలా కొంచెం సృజనాత్మకత, ఆడంబరాన్ని జోడిస్తే ఆ గదికి తిరుగే ఉండదు. అయితే క్షణానికో కొత్త ఇంటీరియర్ పుట్టుకొస్తున్న తరుణంలో అన్ని హంగులు అమర్చుకోవాలంటే కొంచెం ఖర్చుతో కూడిన వ్యవహారమే..రంగులే కీలకం.. పిల్లలను ఆకట్టుకొనేలా గదిని రూపొందించడంలో రంగులకు కావాల్సినంత ప్రాధాన్యం ఉంది. మానసిక శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం చిన్న పిల్లలు ఎరుపు, నీలం, పసుపు రంగులను ఇష్టపడతారు. ఇవి కాకుండా ఆకుపచ్చ, పర్పుల్ కూడా ఓకే. ఇక వయోలెట్, పింక్ కూడా పర్వాలేదు. అన్నింటికన్నా ముఖ్యం మీ చిన్నారి ఏ రంగు ఇష్టపడుతున్నాడు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. మొత్తం ఒకే రంగు కాకుండా గదిలో వేర్వేరు చోట్ల రంగులను నింపడం ద్వారా అందాన్ని తేవచ్చు. ఒక్కో రంగు ఒక్కో విధమైన ప్రేరణ కల్పిస్తుందని కలర్ సైకాలజీ చెబుతోంది. కాబటి తేలిక రంగులు వేస్తే మంచిది. పిల్లలకు ఇష్టమైన కార్టూన్ క్యారెక్టర్లను గోడలపై చిత్రించడం ద్వారా వారికి ఆనందాన్ని కలుగచేయవచ్చు. సీలింగ్‌కు చీకట్లో కూడా మెరిసే విధంగా ఉండే మెటాలిక్ రంగులు వేస్తే చీకట్లోనూ హాయిగా నిద్రపోతారు.కంటికి శ్రమ కలిగించని లైటింగ్.. లైట్ల విషయానికి వస్తే బాగా వెలుతురు అందించే ఫ్లోరోసెంట్ బల్బులను వాడాలి. కంటిపై ఎలాంటి ప్రభావం చూపకుండా, చదువుకొనేటప్పుడు ఇబ్బంది కలగకుండా ఉండాలి. పిల్లల గది కదా అని హంగామా చేసి అన్ని వస్తువులను పేర్చేయకుండా అవసరమైన మేరకు ఉంచాలి. వారి అభిరుచులకు ప్రాధాన్యం ఇస్తూనే ఆకట్టుకొనే విధంగా రూపొందించాలి. -
మీ పిల్లల గదిలో టీవీ ఉందా?
అయితే ఊబకాయం ముప్పు తప్పదట! లండన్: మీ పిల్లల గదిలో టీవీ ఉందా? అయితే అర్జెంటుగా దానిని తీసేయండి. ఎందుకంటే... భవిష్యత్తులో మీ పిల్లలు ఊబకాయంబారిన పడడానికి అదే కారణం కావొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గదిలో టీవీ ఉండడం వల్ల ఎక్కువసేపు టీవీకి అతుక్కుపోయే అవకాశముందని, దీనివల్ల మధుమేహం, ఊబకాయం వంటి సమస్యల ముప్పు మరింతగా పెరిగే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. లండన్‌లోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్(యూఎల్సీ) చేసిన పరిశోధనలో ఈ విషయం రుజువైంది. ఏడేళ్ల నుంచే పిల్లల గదిలో టీవీ ఏర్పాటు చేయడం ద్వారా.. వారు ఊబకాయంబారిన పడే ముప్పు 30 శాతం పెరుగుతుందని, 11 ఏళ్లప్పుడు ఏర్పాటు చేస్తే ఒబేసిటీ ముప్పు 20 శాతం పెరుగుతుందని తమ పరిశోధనలో తేలినట్లు యూఎల్సీ శాస్త్రవేత్తలు తెలిపారు. ‘గదిలో పిల్లల కోసమే ప్రత్యేకంగా ఏర్పాటుచేస్తే... టీవీ చూసే స్వేచ్ఛ పెరుగుతుంది. కదలకుండా కూర్చోవడం, గంటల తరబడి టీవీ కార్యక్రమాలను వీక్షించడంవల్ల శారీరక శ్రమ తగ్గి, బరువు పెరుగుతారు. ఇది క్రమేపీ ఊబకాయానికి, మధుమేహానికి దారితీయవచ్చు. దాదాపు 12,556 మంది పిల్లలపై పరిశోధన చేసి, ఈ విషయాన్ని నిర్ధారించుకున్నామ’ని యూఎల్సీ ప్రొఫెసర్ యాంజా హీల్మన్ తెలిపారు.


