కేరళకు చెందిన ఒక మహిళకు లాటరీ రూపంలో అదృష్టం తలుపు తట్టింది. కెనడాలో 5 మిలియన్ డాలర్ల లాటరీ జాక్‌పాట్ రావడంతో రాత్రికి రాత్రేకోటీశ్వరురాలిగా మారిపోయింది. జాక్‌పాట్ గెలుచుకున్ తెలుసుకుని ఆమె ఆశ్చర్యంలో మునిగిపోయింది.
ఒక సాధారణ లాటరీ టికెట్ ఎర్నాకుళం జిల్లాకు చెందిన, ప్రస్తుతం ఎడ్మంటన్‌లో నివసిస్తున్న స్నేహ జాయ్ జీవితాన్ని అనుకోని మలుపు తిప్పింది. అక్టోబర్ 21న జరిగిన డ్రాలో జాయ్ ఈ జాక్‌పాట్ గెలుచుకోగా, ధృవీకరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత శుక్రవారం తన బహుమతి మొత్తాన్ని అందుకున్నారు. వెస్ట్రన్ కెనడా లాటరీ కార్పొరేషన్ అధికారులు ఆమెకు సుమారు రూ. 32 కోట్ల విలువైన ఈ బహుమతి సొమ్మును అందజేశారు.
కోట్లాది రూపాయలు గెలుచుకోవడంతో తన ముందు ఎన్నో అవకాశాలున్నప్పటికీ, ఆ డబ్బు ఎలా ఉపయోగించాలనే దానిపై జాయ్‌కు ఇప్పటికే స్పష్టమైన ప్రణాళిక ఉంది. తన ఇంటి తనఖా (mortgage) అప్పు తీర్చడం ఆమె తొలి ప్రాధాన్యత. అలాగే ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న ప్రపంచ పర్యటనకు ఏర్పాట్లు చేసుకోవాలని ఆమె భావిస్తున్నారు. అలాగే బహుమతి సొమ్ములో కొంత భాగాన్ని తన కుటుంబంతో పంచుకుని, తన ప్రియమైన వారితో కలిసి ఈ విజయాన్ని వేడుకగా జరుపుకోవాలని యోచిస్తున్నారు.
జాక్‌పాట్ గెలిచినట్లు గుర్తించిన క్షణాన్ని గుర్తుచేసుకుంటూ, " అసలు నమ్మలేకపోయాను.. షాక్ అయ్యా ను అంటూ ఆమె సంతోషాన్ని ప్రకటించారు. అంతేకాదు తన భావోద్వేగాలను మూడు మాటల్లో చెప్పమని అడిగినప్పుడు ఆమె "షాక్.. హ్యపీ..రిలీఫ్’’ అంటూ వ్యాఖ్యానించడం విశేషం.
ఎవరీ స్నేహ జాయ్ ?
మాతృభూమి కథనం ప్రకారం, జాయ్ స్వస్థలం కేరళలోని ఎర్నాకుళం జిల్లా వెంగూర్. ఆమె స్థానిక కాంగ్రెస్ నాయకుడు పి.పి. జాయ్ , జాలీ జాయ్ దంపతుల ఏకైక కుమార్తె. సుమారు ఐదేళ్ల క్రితం ఆమె తన భర్త విజిలె వర్గీస్‌తో కలిసి కెనడాలోని ఎడ్మంటన్‌కు వెళ్లారు.కెనడాకు వెళ్లకముందు, జాయ్ కేరళలో స్థానిక రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు. 2020లో ఆమె యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (UDF) అభ్యర్థిగా వెంగూర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసినట్లు సమాచారం. ఇప్పుడు ఊహించని విధంగా లాటరీ గెలుచుకోవడంతో ఆమె ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు. ఈ వార్త సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పలువురు నెటిజన్లు ఆమెకు అభినందనలు తెలిపారు.


