రూ.32 కోట్ల లాటరీ.. కేరళ మహిళకు కెనడాలో జాక్‌పాట్! | Keralam woman wins 32 crore lottery in Canada | Sakshi
Sakshi News home page

రూ.32 కోట్ల లాటరీ.. కేరళ మహిళకు కెనడాలో జాక్‌పాట్!

Nov 22 2026 8:37 PM | Updated on Nov 22 2026 8:40 PM

Keralam woman wins 32 crore lottery in Canada

భారతీయ మహిళకు కెనడా భారీ అదృష్టం వరించింది. ఎడ్మంటన్‌లో నివసిస్తున్న కేరళకు చెందిన స్నేహా జాయ్‌ లాటరీలో ఏకంగా 5 మిలియన్ కెనడియన్ డాలర్ల (సుమారు రూ.32 కోట్లు) జాక్‌పాట్ గెలుచుకున్నారు. అక్టోబర్ 21న జరిగిన ‘లాటో 6/49 క్లాసిక్’ డ్రాలో మొత్తం ఆరు గెలుపు నంబర్లను సరిపోల్చడంతో ఈ భారీ బహుమతి ఆమె సొంతమైంది. వెస్ట్రన్ కెనడా లాటరీ కార్పొరేషన్ (WCLC) ఈ విషయాన్ని ధ్రువీకరించింది.

లాటరీ టికెట్‌ను స్నేహా జాయ్‌ లాటో స్పాట్ యాప్ ద్వారా కొనుగోలు చేశారు. టికెట్‌ను తనిఖీ చేసినప్పుడు ఆరు నంబర్లు సరిపోవడంతో ఆమె ఆశ్చర్యానికి గురయ్యారు. 1, 10, 18, 22, 33, 37 నంబర్లు ఆమెకు జాక్‌పాట్‌ను అందించాయి. బహుమతిని క్లెయిమ్ చేసుకున్న సందర్భంగా తన అనుభూతిని మూడు మాటల్లో చెబుతూ.. ‘షాక్, సంతోషం, ఉపశమనం’ అని పేర్కొన్నారు. ఈ గెలుపుతో ఆర్థికంగా ఒత్తిళ్లు లేని జీవితాన్ని గడపగలనని ఆమె సంతోషం వ్యక్తం చేశారు.

రూ.32 కోట్ల బహుమతి డబ్బుతో ముందుగా కెనడాలోని తన ఇంటి తాకట్టును పూర్తిగా చెల్లించనున్నట్లు స్నేహా వెల్లడించారు. ఆర్థిక బాధ్యతల నుంచి విముక్తి పొందిన తర్వాత ప్రపంచ దేశాలను చుట్టి రావాలని భావిస్తున్నారు. అలాగే తన కుటుంబ సభ్యులతోనూ ఈ సంతోషాన్ని పంచుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆర్థికంగా ఒత్తిళ్లు లేని జీవితాన్ని గడపడమే ఈ గెలుపుతో తనకు కలిగే అతిపెద్ద ఆనందమని ఆమె తెలిపారు.

స్నేహా జాయ్‌ కేరళలోని ఎర్నాకులం జిల్లా వెంగూర్‌కు చెందినవారు. సుమారు ఐదేళ్ల క్రితం తన భర్త విజిల్ వర్గీస్‌తో కలిసి కెనడాలోని ఎడ్మంటన్‌కు వెళ్లినట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. కెనడాకు వెళ్లకముందు కేరళలో సామాజిక కార్యక్రమాల్లోనూ ఆమె చురుగ్గా పాల్గొన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆమెకు లభించిన ఈ భారీ లాటరీ విజయం కేరళలోని కుటుంబ సభ్యులతో పాటు అక్కడి మలయాళీ సమాజంలోనూ ఆనందాన్ని నింపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement