బంగారం, వెండి ధరలు ఈ ఏడాది జనవరిలో సరికొత్త గరిష్ఠాలను తాకాయి. కానీ ఆ తర్వాత నుంచి భారీగా పడిపోతూ వచ్చాయి. ముఖ్యంగా వెండి ధరల పతనం పెట్టుబడిదారులకు తీవ్ర నష్టాలను మిగిల్చింది. నవంబర్ 20 నాటి ధరలతో పోలిస్తే జనవరి గరిష్ఠ స్థాయుల నుంచి బంగారం 31.5 శాతం, వెండి ఏకంగా 64.2 శాతం క్షీణించినట్లు తాజా నివేదిక వెల్లడించింది. అంటే కేవలం పది నెలల్లోనే ఈ రెండు విలువైన లోహాల్లో పెట్టుబడులు గణనీయంగా తగ్గిపోయాయి.
రూ.10 లక్షలకు మిగిలింది ఇంతే..
జనవరిలో గరిష్ఠ ధరల వద్ద బంగారంపై రూ.10 లక్షలు పెట్టుబడి పెట్టారనుకుంటే వాళ్లు ఇప్పుడు బంగారంలో సుమారు రూ.6.85 లక్షల విలువైన ఆస్తిని మాత్రమే కలిగి ఉంటారు. అంటే రూ.3.15 లక్షలు నష్టపోయినట్లే. అదే మొత్తాన్ని వెండిలో పెట్టుబడి పెట్టిన వారి ఆస్తి విలువ రూ.3.58 లక్షలకు పడిపోయింది. తద్వారా రూ.6.42 లక్షల మేర నష్టం వాటిల్లింది. ఈ లెక్కలు నవంబర్ 20 నాటి ధరల ఆధారంగా చేసిన అంచనాలు.
ధరలు ఎందుకు పడిపోతున్నాయి?
అమెరికా డాలర్ బలపడటం, ప్రభుత్వ బాండ్లపై రాబడులు పెరగడం, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను మళ్లీ పెంచవచ్చనే అంచనాలు బంగారం, వెండిపై ఒత్తిడి పెంచుతున్నాయి. అధిక వడ్డీ రేట్ల వాతావరణంలో వడ్డీ ఆదాయం ఇవ్వని బంగారంపై పెట్టుబడిదారుల ఆసక్తి తగ్గుతుంది. అంతేకాకుండా అంతర్జాతీయ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి కూడా ధరల పతనానికి కారణమైంది. వెండికి పారిశ్రామిక డిమాండ్‌పై ఆందోళనలు తోడవడంతో దాని ధర మరింత ఎక్కువగా పడిపోయింది. అయితే కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు దీర్ఘకాలంలో బంగారానికి మద్దతుగా నిలవవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
పెళ్లిళ్లకు ఉపశమనం
బంగారం ధరలు తగ్గడం పెళ్లిళ్ల కోసం ఆభరణాలు కొనుగోలు చేసే కుటుంబాలకు కొంత ఊరటనిచ్చే పరిణామం. అయితే అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గినంత మాత్రాన భారతీయ మార్కెట్లోనూ అదే స్థాయిలో తగ్గింపు ఉంటుందని చెప్పలేం. రూపాయి మారకం విలువ, దిగుమతి వ్యయాలు, స్థానిక మార్కెట్ పరిస్థితులు దేశీయ ధరలను ప్రభావితం చేస్తాయి. అదనంగా ఆభరణాల కొనుగోలుపై మొత్తం లావాదేవీ విలువకు 3 శాతం జీఎస్టీ వర్తిస్తుంది. దీనికి డిజైన్‌ను బట్టి తయారీ ఛార్జీలు, ఇతర వర్తించే ఖర్చులు కూడా జతవుతాయి.
ఇదీ చదవండి: ‘మోదీ సలహాతో భారీ బంగారు నష్టం తప్పింది’
దేశంలోని ప్రధాన నగరాల్లో ప్రస్తుతం (నవంబర్ 22 నాటికి) బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కింద చూడొచ్చు...
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. కచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)


