లక్షకు దగ్గరగా.. స్పీడ్‌గా పడిపోతున్న పసిడి! | Gold worst week in eight months Gold Prices Could Fall To Rs 1 11 Lakh | Sakshi
Sakshi News home page

లక్షకు దగ్గరగా.. స్పీడ్‌గా పడిపోతున్న పసిడి!

Nov 21 2026 7:52 PM | Updated on Nov 21 2026 8:14 PM

Gold worst week in eight months Gold Prices Could Fall To Rs 1 11 Lakh

బంగారం ధరలు వేగంగా పడిపోతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరల పతనం కొనసాగుతోంది. నవంబర్ నెల పుత్తడికి అత్యంత ప్రతికూలంగా మారింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచవచ్చన్న అంచనాలు, బలపడుతున్న డాలర్, అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి పసిడి ధరలను భారీగా దెబ్బతీస్తున్నాయి. దీంతో బంగారం ధరలు 14 నెలల కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఈ పతనం ఇక్కడితో ఆగకపోవచ్చని, మరింత తగ్గుదలకు అవకాశాలున్నాయని మార్కెట్ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

దేశీయ మార్కెట్లోనూ భారీ పతనం

శుక్రవారం (నవంబర్ 20) అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ఒక దశలో ఔన్స్‌కు 3,500 డాలర్ల స్థాయికి చేరువైంది. వారాంతానికి అందుబాటులో ఉన్న నివేదికల ప్రకారం ధర సుమారు 3,514 డాలర్ల వద్దకు చేరింది. ఆ వారంలో దాదాపు 9.4 శాతం పతనమైంది. జనవరి 29న నమోదైన రికార్డు గరిష్ఠ స్థాయి 5,594.82 డాలర్లతో పోలిస్తే ప్రస్తుతం మూడో వంతుకు పైగా తగ్గింది.

భారతదేశంలోనూ ఈ ప్రభావం స్పష్టంగా కనిపించింది. ఎంసీఎక్స్‌లో డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ నవంబర్ 20న 4.32 శాతం తగ్గి 10 గ్రాములకు రూ.1,21,949 వద్ద ముగిశాయి. అంతకుముందు సెషన్‌తో పోలిస్తే రూ.5,503 తగ్గడం గమనార్హం. మరోవైపు, 24 క్యారెట్ల బంగారం రిటైల్ ధర 10 గ్రాములకు రూ.5,120 తగ్గి రూ.1,25,570కు చేరింది.

ఫెడ్ నిర్ణయంపై మార్కెట్లలో ఉత్కంఠ

బంగారం ధరల పతనానికి ప్రధాన కారణం అమెరికా ఫెడరల్ రిజర్వ్ (ఫెడ్) వడ్డీ రేట్లపై మారిన అంచనాలే. గతంలో వడ్డీ రేట్లు తగ్గుతాయని భావించిన మార్కెట్లు ఇప్పుడు పెంపు ఉండవచ్చని అంచనా వేస్తున్నాయి. డిసెంబర్ 8–9 తేదీల్లో జరిగే ఫెడ్ సమావేశంలో 25 బేసిస్ పాయింట్ల వడ్డీ రేటు పెంపునకు 96 శాతం అవకాశముందని ట్రేడర్లు భావిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఫెడ్ సమావేశ మినిట్స్‌లోనూ కొందరు అధికారులు మరింత భారీ పెంపును పరిశీలించాలని సూచించారు.

సాధారణంగా వడ్డీ రేట్లు పెరిగితే వడ్డీ ఆదాయం లభించని బంగారంపై పెట్టుబడిదారుల ఆసక్తి తగ్గుతుంది. దీనికి తోడు అమెరికా డాలర్ బలపడటం, బాండ్ రాబడులు పెరగడం పసిడికి ప్రతికూలంగా మారాయి. మరోవైపు, ఏఐ ఆధారిత కంపెనీల షేర్లలో అమ్మకాలు పెరగడంతో నష్టాలను పూడ్చుకునేందుకు కొందరు పెట్టుబడిదారులు బంగారాన్ని విక్రయిస్తున్నారు. ఈ పరిణామాలు ధరల పతనాన్ని మరింత తీవ్రతరం చేస్తున్నాయి.

రూ.1.11 లక్షలకు పడిపోతుందా?

ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారానికి 3,500 డాలర్లు కీలక మద్దతు స్థాయిగా మారింది. ఈ స్థాయి నిలబడకపోతే ధరలు మరింత దిగజారవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బానాక్ బర్న్ గ్లోబల్ ఫారెక్స్‌కు చెందిన మార్క్ చాండ్లర్ అభిప్రాయం ప్రకారం, 3,500 డాలర్ల దిగువకు పడిపోతే 3,430–3,450 డాలర్ల స్థాయికి చేరవచ్చు.

వాల్ష్ ట్రేడింగ్‌కు చెందిన షాన్ లస్క్ మాత్రం 3,500 డాలర్ల మద్దతు కోల్పోతే మరో 300 డాలర్ల వరకు పతనం ఉండవచ్చని హెచ్చరించారు. తదుపరి కీలక మద్దతు 3,256–3,280 డాలర్ల మధ్య ఉండవచ్చని పేర్కొన్నారు. అంటే అంతర్జాతీయ మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి కొనసాగితే బంగారం 3,200 డాలర్ల స్థాయిని కూడా పరీక్షించే అవకాశం ఉందని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. బంగారం ఔన్స్‌కు 3,200 డాలర్లకు వస్తుందంటే ఇది ఎంసీఎక్స్‌లో రూ.1.11 లక్షల వద్దకు రావచ్చు.

బంగారం ధరలపై ఇన్వెస్టర్లలోనూ ప్రతికూల అంచనాలు పెరుగుతున్నాయి. కిట్‌కో నిర్వహించిన తాజా వారపు సర్వేలో పాల్గొన్న 15 మంది వాల్‌స్ట్రీట్ విశ్లేషకుల్లో తొమ్మిది మంది వచ్చే వారంలోనూ ధరలు తగ్గుతాయని అభిప్రాయపడ్డారు. నలుగురు మాత్రమే పెరుగుతాయని అంచనా వేయగా, మిగిలిన ఇద్దరు తటస్థ వైఖరి ప్రదర్శించారు. రిటైల్ ఇన్వెస్టర్లలోనూ 46 శాతం మంది ధరలు మరింత పడిపోతాయని భావిస్తున్నారు.

దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి (నవంబర్‌ 21) బంగారం, వెండి ధరలు ఈ కింద చూడొచ్చు..

gold1
1/6

gold2
2/6

gold3
3/6

gold4
4/6

silver5
5/6

silver6
6/6

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. కచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement