గోల్డ్, సిల్వర్‌.. క్రాష్‌! | Gold Silver Prices Crash Market | Sakshi
Sakshi News home page

గోల్డ్, సిల్వర్‌.. క్రాష్‌!

Nov 21 2026 4:30 AM | Updated on Nov 21 2026 4:30 AM

Gold Silver Prices Crash Market

ఏడాది కనిష్టానికి బంగారం డౌన్‌

9 సెషన్లలో రూ. 18,000 క్షీణత

వెండి గరిష్టం నుంచి రూ. 2.46 లక్షలు పతనం

న్యూఢిల్లీ: అమెరికా డాలరు బలపడటం, బాండ్‌ ఈల్డ్‌లు పెరగడం, వడ్డీ రేట్ల పెంపు అంచనాలతో ఇన్వెస్టర్ల సెంటిమెంటు బలహీనపడటం తదితర అంశాల నేపథ్యంలో పసిడి, వెండి ధరలు కుప్పకూలాయి. శుక్రవారం ఢిల్లీ బులియన్‌ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత గల 10 గ్రాముల పుత్తడి రేటు మరో రూ. 5,200 క్షీణించి రూ. 1,29,300కి దిగి వచ్చింది. ఫలితంగా, బంగారం గత తొమ్మిది సెషన్లలో రూ. 17,600 (12 శాతం) క్షీణించి, ఏడాది కనిష్ట స్థాయికి పడిపోయింది.

చివరిసారిగా 2025 నవంబర్‌ 14న పసిడి రూ. 1,29,400 ధర పలికింది. ఈ ఏడాది జనవరిలో రూ. 1.83 లక్షల గరిష్ట స్థాయిని తాకిన బంగారం, అప్పటి నుంచి చూస్తే రూ. 53,700 (సుమారు 29%) పడిపోయింది. ఇక వెండి పరిస్థితి పసిడికన్నా దారుణంగా ఉంది. శుక్రవారం కేజీకి మరో రూ. 4,000 తగ్గి రూ. 1.58 లక్షలకు దిగజారింది. దీనితో నవంబర్‌ 5 నుంచి చూస్తే రూ. 36,500 (19%) క్షీణించినట్లయింది. ఈ ఏడాది జనవరి 29న రూ. 4.04 లక్షల గరిష్టం నుంచి ఏకంగా రూ. 2.46 లక్షల మేర (61 శాతం) పతనమైంది. 

గ్లోబల్‌ మార్కెట్లలోనూ.. 
అటు అంతర్జాతీయంగాను పసిడి, వెండి అమ్మకాలు వెల్లువెత్తాయి. స్పాట్‌ మార్కెట్లో బంగారం ధర వరుసగా ఐదో సెషన్లోనూ తగ్గింది. ఔన్సు పసిడి 110.24 డాలర్లు (3.04 శాతం) పడి 3,515 డాలర్లకి క్షీణించింది. 2025 సెప్టెంబర్‌ 4 తర్వాత ఇది కనిష్ట స్థాయి. తాజాగా వెండి ధర సైతం 4 శాతం క్షీణించి 41.12 డాలర్లకు తగ్గింది. గతేడాది సెప్టెంబర్‌ తర్వాత ఇది కనిష్ట స్థాయి.

అప్పట్లో వెండి 41.15 డాలర్లు పలికింది. ఈ ఏడాది జనవరిలో 5,595 డాలర్లు పలికిన బంగారం అప్పటి నుంచి ఏకంగా 2,080 డాలర్లు (37 శాతం) పతనమైంది. వెండి కూడా 121.63 డాలర్ల గరిష్ట స్థాయి నుంచి 80.50 డాలర్లు (66 శాతం) క్షీణించింది. ప్రస్తుతం పసిడి కీలకమైన 3,500 డాలర్ల మార్కును నిలుపుకోగలదా లేదా అనే ఆసక్తి నెలకొంది.

రూపాయి ఎఫెక్ట్‌.. 
రూపాయి బలపడటం సైతం దేశీయంగా పసిడి, వెండి రేట్లపై ప్రతికూలంగా ఉంటోందని నిపుణులు తెలిపారు .. ఈ వారం అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 1.5 శాతం పెరగడం కూడా పసిడి క్షీణతకు కారణమైందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ సీనియర్‌ అనలిస్ట్‌ (కమోడిటీస్‌) సౌమిల్‌ గాంధీ చెప్పారు.

ఇదీ చదవండి: కొనసాగిన బుల్‌ రన్‌...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement