36 యుద్ధ విమానాలకు గాను 32 మాత్రమే ఉన్నాయి
బ్రిటిష్ విమానయాన పత్రిక ‘ఫ్లైట్ గ్లోబల్’ నివేదిక
ఖండించిన భారత రిటైర్డ్ ఎయిర్ మార్షల్ నర్మదేశ్వర్ తివారీ
న్యూఢిల్లీ: దేశ రక్షణను దృష్టిలో పెట్టుకొని భారత ప్రభుత్వం ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసిన అత్యాధునిక రఫేల్ యుద్ధ విమానాల్లో నాలుగు కనిపించకుండా పోయాయని బ్రిటిష్ విమానయాన పత్రిక ‘ఫ్లైట్ గ్లోబల్’ఒక నివేదికలో వెల్లడించడం సంచలనాత్మకంగా మారింది. భారత వైమానిక దళ(ఐఏఎఫ్) అవసరాల కోసం ఫ్రాన్స్ నుంచి ఇప్పటిదాకా 36 రఫేల్ ఫైటర్ జైట్లను కొనుగోలు చేయగా, ప్రస్తుతం 32 జెట్లు మాత్రమే ఉన్నాయని.. అంటే నాలుగు తక్కువయ్యాయని ‘ఫ్లైట్ గ్లోబల్’ తేల్చిచెప్పింది.
ఈ మేరకు తాజాగా ‘వరల్డ్ ఎయిర్‌ఫోర్సెస్ డైరెక్టరీ’పేరిట నివేదిక విడుదల చేసింది. కానీ, ఐఏఎఫ్‌లో రఫేల్ జెట్ల సంఖ్య తగ్గినట్లు నిరూపించడానికి తగిన ఆధారాలేవీ బయటపెట్టలేదు. యూకేకు చెందిన విమానయాన డేటా, విశ్లేషణల సంస్థ అయిన సిరియమ్ నుంచి సేకరించిన సమాచారంతో ఈ నివేదికను తయారు చేశారు. దీనికి గురుగ్రామ్‌లో కూడా కార్యాలయం ఉంది.
గత ఏడాది ఆపరేషన్ సిందూర్ తర్వాత కొన్న నెలలకు ‘ఫ్లైట్ గ్లోబల్’రిపోర్టు విడుదల చేసింది. 35 రఫేల్ జెట్లు భారత వైమానిక దళంలో క్రియాశీలకంగా పని చేస్తున్నట్లు వెల్లడించింది. కానీ, తాజా నివేదికలో మొత్తం 36 విమానాలకు గాను నాలుగు లేవని చెప్పడం ప్రశ్నార్థకంగా మారింది.
అదంతా శుద్ధ అబద్ధం: నర్మదేశ్వర్ తివారీ
‘ఫ్లైట్ గ్లోబల్’రిపోర్టును భారత రిటైర్డ్ ఎయిర్ మార్షల్ నర్మదేశ్వర్ తివారీ ఖండించారు. అందులో ఏమాత్రం నిజం లేదని తేల్చిచెప్పారు. ఆయన గత ఏడాది జరిగిన ఆపరేషన్ సిందూర్‌లో కీలకంగా వ్యవహరించారు. ‘ఫ్లైట్ గ్లోబల్’పత్రిక విశ్వసనీయతను ప్రశ్నించారు. రఫేల్ యుద్ధ విమానాల్లో కొన్ని మాయమైనట్లు చెప్పడం శుద్ధ అబద్ధమని స్పష్టంచేశారు. ఫ్లైట్ గ్లోబల్ పత్రిక తమ సమాచార వనరులను పునఃసమీక్షించుకోవాలని సూచించారు. ఈ మేరకు ‘ఎక్స్’లో పోస్టు చేశారు.
గత సంవత్సరం జరిగిన ఘర్షణల సమయంలో పాకిస్తాన్ సైన్యం కూల్చివేసినట్లు చెబుతున్న రఫేల్ విమానాల నిర్దిష్ట టెయిల్ నంబర్లను కొందరు ప్రస్తావించారని తెలిపారు. అవే టెయిల్ నంబర్లు కలిగిన రఫేల్ విమానాలు అప్పటి నుంచి వివిధ అంతర్జాతీయ విన్యాసాల్లో పాల్గొంటున్నాయని గుర్తుచేశారు. భారత్ సైన్యం రఫేల్ జెట్లను కోల్పోలేదని పరోక్షంగా తేల్చిచెప్పారు.
సంఘర్షణ సమయంలో యుద్ధ ఖైదీగా పట్టుబడ్డారని పాకిస్తానీ సోషల్ మీడియా ఖాతాలు ప్రచారం చేసిన ఐఏఎఫ్ తొలి మహిళా రఫేల్ పైలట్ స్క్వాడ్రన్ లీడర్ శివాంగి సింగ్ ఉదంతాన్ని నర్మదేశ్వర్ తివారీ ప్రస్తావించారు. నిజానికి ఆమె పాకిస్తాన్ సైన్యానికి పట్టుబడలేదు. హరియాణాలోని అంబాలా ఎయిర్‌బేస్‌లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో కలిసి ఫొటోలకు పోజులిచ్చారు.
రఫేల్ జెట్లను కూల్చేశామన్న పాక్..
ఖండించిన భారత్
పహల్గాం ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత సైన్యం 2025 మే 7న ఆపరేషన్ సిందూర్ ప్రారంభించింది. పాకిస్తాన్ భూభాగంలో ఉగ్రవాద శిబిరాలను, శిక్షణ కేంద్రాలను, ముష్కరుల మౌలిక సదుపాయాలను నేలమట్టం చేసింది. మూడు రోజులపాటు దాడులు కొనసాగాయి. పాక్ సైన్యం కూడా ఎదురుదాడికి దిగింది. భారత వైమానికి దళానికి చెందిన యుద్ధ విమానాలను కూల్చివేశామని, ఇందులో రఫేల్ ఫైటర్ జెట్లు సైతం ఉన్నాయని ప్రకటించింది.
దీన్ని అప్పట్లో భారత సైన్యం ఖండించింది. కానీ, ఆపరేషన్ సిందూర్‌లో ‘కొన్ని నష్టాలు, వ్యూహాత్మక తప్పిదాలు’జరిగాయని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్ అంగీకరించారు. భారత సైన్యం నాలుగు రఫేల్ జెట్ల కోల్పోయిందన్న పాకిస్తాన్ ప్రకటనను తోసిపుచ్చారు. ఆపరేషన్ సిందూర్‌లో జరిగిన నష్టాలను ప్రభుత్వం దాచిపెడుతోందని ప్రతిపక్షాలు ఆరోపించాయి.
దీనిపై తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. ఆ తర్వాత పార్లమెంట్‌లో జరిగిన ఒక చర్చ సందర్భంగా రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడారు. ‘‘ఏ పరీక్షలోనైనా ఫలితాలే ముఖ్యం కానీ పెన్సిల్ విరిగిపోయిందా లేదా పెన్ను పోయిందా అనేది ముఖ్యం కాదు’’అని వ్యాఖ్యానించారు. ఆపరేషన్ సిందూర్‌లో పాకిస్తాన్ ఎన్ని యుద్ధ విమానాలను కోల్పోయిందో మన ప్రతిపక్ష పార్టీలు ఎందుకు ప్రశ్నించడం లేదని అన్నారు.
తప్పుడు సమాచార యుద్ధం
ఫ్లైట్ గ్లోబల్ నివేదిక పూర్తిగా తప్పు అని నిరూపించే ఆధారాలున్నాయి. మొత్తం 36 రఫేల్ విమానాలకు ‘బ్రిడ్జ్ సపోర్ట్’కోరుతూ ఈ ఏడాది జూన్‌లో ఐఏఎఫ్ ఒక టెండర్ జారీ చేసింది. యుద్ధ విమానాల సముదాయానికి బ్రిడ్జ్ సపోర్ట్ అంటే సాంకేతిక మద్దతు, లాజిస్టిక్స్ కోసం కుదుర్చుకొనే ఒక స్వల్పకాలిక, మధ్యంతర ఒప్పందం.
ఇదిలా ఉండగా, ఫ్రాన్స్ నుంచి అదనంగా 114 రఫేల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలని భారత్ నిర్ణయానికి వచ్చింది. భారత నౌకాదళం కోసం 26 రఫేల్ జెట్ల కొనుగోలుకు సంబంధించిన ప్రత్యేక ఆర్డర్‌పై ఇప్పటికే సంతకం జరిగింది. ఆపరేషన్ సిందూర్ విషయంలో పాకిస్తాన్ సాగిస్తున్న తప్పుడు సమాచార యుద్ధం ఇంకా ముగిసినట్లు కనిపించడం లేదని నిపుణులు అంటున్నారు. అందులో భాగంగానే ‘ఫ్లైట్ గ్లోబల్’రిపోర్టు వచ్చిందని చెబుతున్నారు.
ఇదీ చదవండి: చట్టాన్ని చేతిలోకి తీసుకుంటారా?


