ఇప్పటి తరాలు ప్రజాస్వామిక పరిష్కారాలు కోరుకుంటున్నాయిగానీ విప్లవాలను కాదు - శాంతి ముండా (ఇన్‌సైడ్ ఫోటో)
అభిప్రాయం
నక్సలైట్ ఉద్యమం 60 ఏళ్ల క్రితం ఆరంభమైన నక్సల్బరీలో అది అణచి వేతకు గురై కూడా ఇంచుమించు అంతే కాలమైంది. కానీ, అక్కడి విప్లవవాదులు తమ ఉద్యమం అక్కడితో పాటు దేశమంతటా ఎప్పటికైనా తిరిగి పుంజుకోగలదనే బలమైన నమ్మకంతో ఉన్నారు. ఏ విధంగానన్న ప్రశ్నకు మాత్రం ఎవరివద్దా స్పష్టమైన సమాధానాలు లేవు.
ఈ నవంబర్‌లో ఆ ప్రాంతంలో తిరిగి అప్పటి విప్లవకారులు కొందరితో మాట్లాడిన మీదట ఈ రచయితకు కనిపించిన పరిస్థితి ఇది. నక్సలైట్ ఉద్యమం పశ్చిమ బెంగాల్, డార్జిలింగ్ జిల్లా, సిలిగుడి సబ్ డివిజన్‌లోని నక్సల్బరీ, ఖరీబారీ, ఫాంసీ దేవా పంచాయతీ మండలాల్లో 1967 మే నెలలో మొదలైంది. అప్పటి ప్రభుత్వాలు దానిని కొద్దికాలంలోనే అణచివేశాయి.
అగ్ర నాయకులైన చారు మజుందార్, కానూ సన్యాల్, జంగల్ సంతాల్, ఖోకన్ మజుందార్, ముజీబుర్ రహమాన్ తదితరులు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత వారి కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్–లెని నిస్ట్) సైద్ధాంతిక అంతర్గత విభేదాలతో చీలిపోయింది. మరొకవైపు నక్సల్బరీ ప్రేరణతో దేశంలోని అనేక రాష్ట్రాలకు విస్తరించింది. దానిని ఈ సంవత్సరం మార్చి చివరినాటికి పూర్తిగా అణచివేసినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు.
అరవై ఏళ్ల తర్వాత...
ఆ విధంగా 1967 నుంచి 2026 వరకు 60 సంవత్సరాలు గడిచిన తర్వాత, ఉద్యమ జన్మస్థానమైన నక్సల్బరీలో పరిస్థితి ఏమిటి? ఏ సమస్యల కారణంగానైతే తిరుగుబాటు మొదలైందో ఆ సమస్యలన్నీ తర్వాత ఎక్కువ కాలం తీసుకోకుండానే పరిష్కార మయ్యాయి. ఇది వేర్వేరు నక్సలైట్ పార్టీల వారంతా చెప్పిన మాట. అప్పటి ప్రధాన సమస్యలు భూకామందులైన రాజ్‌బన్షీలు, ఒక మేరకు గల బెంగాలీ, సంతాలీ జమీందార్లు భూములను కౌలుకు ఇచ్చి కౌలు రైతులను పీడించటం. పండినా పండకున్నా 50 శాతం పంట ఇవ్వాలనటం. ఇవ్వని వారిని భూముల నుంచి వెళ్లగొట్టడం. అనేకులకు అసలు కౌలు భూమి అయినా లేక తక్కువ కూలీలకు పనిచేయవలసి రావటం ఇతరత్రా పీడనలు.
ఈ మౌలిక సమస్యలన్నీ భూమిని కేంద్రంగా చేసుకుని తిరిగి నవి అయినపుడు అవెట్లా పరిష్కారమయాయి? నాతో మాట్లాడిన నక్సలైట్ పార్టీల నాయకులు ఆ కాలంలో ఉద్యమంలో క్రియా శీలంగా ఉండి ఇప్పటికీ ఆ సిద్ధాంతాన్ని నమ్ముకుని ఉన్నవారే. వారు చెప్పినదాని ప్రకారం, కొందరు భూస్వాములు, జోతేదార్ల భూము లను విప్లవకారులు తామే ఆక్రమించి కౌలుదార్లకు, వ్యవసాయ కూలీలకు పంచారు. అంతకుమించిన విశేషం మరొకటి జరిగింది.
భూస్వాములు, జోతేదార్లు కొందరు ఉద్యమం ఒత్తిడిని తట్టుకోలేక స్వయంగా, తమ భూములలో సగం తమ కౌలుదార్లకే ఇచ్చి, రిజిస్ట్రేషన్లు కూడా చేసి రాజీపడ్డారు. ఆ క్రమంలో కొన్ని భూములు కూలీలకూ లభించాయి. ఆ భూములు ఇన్ని దశాబ్దాల తర్వాత కూడా పేద రైతుల పేరిటనే ఉన్నాయి. వారిలో కొందరితో నేను మాట్లాడాను. లోగడ భూములు కౌలుకిచ్చినవారు ఇపుడు మిగిలిన భూములలో స్వయంగా సాగుచేస్తున్నారు.
ఆ విధంగా ఉద్యమ కారణంగా భూమి సమస్య పరిష్కారం కాగా, ఈ ప్రాంతంలో విస్తారంగా గల తేయాకు తోటలలో కూలీ లుగా పని చేస్తుండిన సంతాల్, ముండా, ఒరాన్ తెగల వారికి, నేపాలీలకు గతంలో అతి తక్కువ కూలీ ఇచ్చేవారు. వారి సమస్య భూమి కాకపోయినా, దీని కారణంగా నక్సలైట్లకు మద్దతునిచ్చారు. ఉద్యమ కారణంగా వీరికి కూలీ పెరగటం మొదలైంది.
ఇది తాత్కాలిక స్థితేనా?
ఇటువంటి మార్పులు వస్తున్నా ఇంకా విప్లవాన్ని కోరుకోవటం ఎందుకు? ఆ నాయకులే చెప్పిన దానిని బట్టి, రైతులకు, పేదలకు, ప్రజలకు, యువతీయువకులకు అనేక ఇతర సమస్యలు కొనసాగు తున్నాయి. దానికి విప్లవం ద్వారా సోషలిస్టు వ్యవస్థ ఏర్పడటం ఒక్కటే మార్గం. అది వారి స్వప్నం, సిద్ధాంతం. తమ ప్రాంతంలో బలహీనపడి ఉండవచ్చు. కేంద్ర హోంమంత్రి ప్రకటించినట్లు తక్కిన దేశంలోనూ దెబ్బతిని ఉండవచ్చు. కానీ ఆయన ప్రకటించిన విధంగా అంతమేమీ కాలేదు, కాబోదు అన్నవి వారి వాదనలు.
ఇంతవరకు బాగున్నది. కానీ, గత 60 సంవత్సరాలలో నక్స లైట్ ఉద్యమ వైఫల్యాలకు కారణాలేమిటి? భవిష్యత్తులో తిరిగి పుంజుకోగలమన్న ఆశాభావానికి ఆధారాలేమిటి? ఈ రెండు ప్రశ్నలలో మొదటి దానికి అందరి వివరణలూ ఒకే విధంగా, నిజా యితీగా తోచాయి. పరిస్థితులను, సిద్ధాంతాన్ని అవగాహన చేసు కోవటంలో, వ్యూహ రచనలో, అమలులో గల లోపాలు. నాయకుల వ్యక్తిగత ధోరణులు, ఎవరికి వారే గొప్ప అనుకునే అహంభావాలు. వేర్వేరు వర్గాల ప్రజలలో తీవ్ర అసంతృప్తి అప్పుడు ఇప్పుడు కూడా ఉందనీ, రాగల కాలంలో సరైన అవగాహనలు, నాయకత్వాలతో విప్లవం సాధ్యమనీ వారి బలమైన నమ్మకం. అందువల్ల కేంద్ర హోంమంత్రి ప్రకటన తాత్కాలిక స్థితి మాత్రమేనన్నది వాదన.
క్షేత్రస్థాయి వాస్తవం
రెండవ ప్రశ్నకు వస్తే, వారు పేర్కొన్న పై ఆధారాలు తార్కికంగా, స్థూలంగా సరైనవిగానే తోచవచ్చు. కానీ, భవిష్యత్తు గురించి ఎవరిదగ్గరా నిర్దిష్టమైన సమాధానాలు గానీ, ఒక మార్గం గానీ ఉన్నట్లు కనిపించలేదు. ఒకప్పటి నాయకులు, కార్యకర్తలకు వయసు మీరింది. అప్పటి తక్షణ సమస్యలు కనీసం కొంతమేర పరిష్కార మయ్యాయి. కొత్త తరాలు భూమి గురించి, గ్రామీణ సమస్యల గురించి ఆలోచించటం లేదు.
చదువులు, ఉద్యోగాలు, పట్టణ కేంద్రిత సమస్యలు, ఆధునిక జీవితాలు, సొంత వ్యాపారాలు వారి ప్రపంచంగా మారాయి. విప్లవం విఫలమైనట్లు భావించటం కూడా అందుకు తోడై ఎవరూ ఇటువైపు ఆకర్షితులు కావటం లేదు. ఇప్పటి తరాలు ప్రజాస్వామిక పరిష్కారాలు కోరుకుంటున్నాయి గానీ విప్లవాలను కాదు. ఇంకా జీవించి ఉన్న నాయకులలో కొందరు ఆ స్ఫూర్తిని కోల్పోకున్నా అనేకులు లొంగిపోయి సాధారణ జీవితాలు గడిపే దిశగా వెళుతున్నారు. ఇవన్నీ పరిగణనలోకి తీసుకున్నప్పుడు, విప్లవోద్యమం తిరిగి పుంజుకోగలదని ఎట్లా భావించగలరు?
ఇందుకు సాలోచనలు, లేదా పుంజుకోగలదంటూ పునశ్చరణలు తప్ప ఎవరి నుంచీ వివరణలు రాలేదు. ఒక ప్రముఖ విప్లవకారుని కుమారునికి తన తండ్రి ఏ పార్టీలో ఉన్నాడని సైతం తెలియదు. చారుమజుందార్ కుమారుడు అభిజిత్ మజుందార్, ఎన్నికల మార్గం పట్టిన ఒక ఎం.ఎల్. పార్టీకి నాయకు డయాడు. దీనంతటి మధ్య మనస్సును కదిలించిన విషయం, ముండా తెగకు చెందిన శాంతి ముండా అనే 84 సంవత్సరాల మహిళా నాయకురాలు, తాను 1966 నుంచి ఉద్యమంలో ఉన్నాననీ, ఆరోగ్యం బాగా లేకున్నా ఇప్పటికీ కార్యక్రమాలకు వెళుతున్నాననీ చెప్పటం. విప్లవం తప్పక వస్తుందని నమ్మకంగా ప్రకటించారామె.
- టంకశాల అశోక్, వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు
ఇదీ చదవండి: యమున ప్రక్షాళన ఎప్పుడు?


