ఎన్నికల నిర్వహణలో ఇదేం మోడల్‌! | AP Local Elections Nomination Controversy | Sakshi
Sakshi News home page

ఎన్నికల నిర్వహణలో ఇదేం మోడల్‌!

Nov 17 2026 4:29 AM | Updated on Nov 17 2026 4:29 AM

AP Local Elections Nomination Controversy

టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల చేతుల్లోని బీ–ఫారాలను లాక్కొని గేటు బయటికి విసిరేసిన దృశ్యం. చోద్యం చూస్తున్న పోలీసులు, భద్రతా సిబ్బంది

అభిప్రాయం

ప్రజాస్వామ్యం ఆనవాళ్లే లేకుండా, ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు తాము వేసు కునే అవకాశమే లేకుండా ఏపీలో ప్రస్తుతం అధికారంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి తమ కూటమి అభ్యర్థులు మాత్రమే గెలిచే విధంగా నిర్వహిస్తున్న ఎన్నికల మోడల్‌పై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

రాష్ట్రం విడిపోయిన తర్వాత స్థానిక ఎన్నికలు రెండోసారి జరుగుతున్నాయి. పోటీలో ఉన్న వారు ఎత్తులు, పైఎత్తులు వేసు కోవడం సహజం. వారు ఎలా ఉన్నా, ఎన్నికలు నిర్వహించే అధికార యంత్రాంగం మాత్రం నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా, న్యాయబద్ధంగా ఎన్నికలు నిర్వహించాలి. ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలను, స్వేచ్ఛగా పోటీ చేసే వాతావరణాన్ని కల్పించడం అధికార యంత్రాంగం బాధ్యత.

కానీ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి పార్టీల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఎన్నికల్లో చంద్రబాబు, పవన్‌  కల్యాణ్‌ నాయకత్వంలో ఒక కొత్త మోడల్‌ తయారైంది! నికొలో మాకియావెల్లీ, చాణక్యులను దాటి, చేతికి మట్టి అంటకుండా తమ వాళ్లనే గెలిపించుకోవాలన్నదే ఆ మోడల్‌. అధికార యంత్రాంగం, పోలీసు వ్యవస్థ పూర్తిగా అధికార కూటమికి సరెండర్‌ అయి పోయాయి. నిజానికి పోలీసులు తెర వెనుక ఉండి ఎన్నికల ప్రక్రియకు రక్షణ కల్పించాలి. కానీ ఈసారి స్క్రీన్‌ప్లే, స్టేజ్‌పై డ్రామా అంతా కూడా పోలీసులే నిర్వహించారనే సమాచారం ప్రజల నుంచి వస్తోంది. అభ్యర్థులకు, ఓటర్లకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు ఎన్నికల నిర్వహణను తమ అధీనంలోకి తీసుకున్నారనే అపవాదును మూటకట్టుకున్నారు.

పోలీసుల వేధింపులు, బెదిరింపులు
మొదటి దశ నామినేషన్‌  ఫేజ్‌లోనే కొత్త మోడల్‌ అమలు మొదలైంది. పోలీసులే, ‘‘నువ్వు నామినేషన్‌  వేయొద్దు’’ అని అభ్య ర్థులను అడ్డుకోవడం ఇటీవలి ఏపీ స్థానిక ఎన్నికల్లో కనిపించింది. ప్రజా ప్రతినిధులు, మంత్రులుగా పనిచేసినవాళ్లు కూడా ‘‘మమ్మల్ని నామినేషన్‌ కు అనుమతించండి’’ అంటూ పోలీసుల కాళ్లా వేళ్లా పడా ల్సిన పరిస్థితి! ఇందుకు సంబంధించి సోషల్‌ మీడియాలో అనేక దృశ్యాలు చూశాం.

నామినేషన్‌ కు రాకుండా బెదిరించడం, ఇదేమి టని ప్రశ్నిస్తే తీసుకెళ్లి పోలీస్‌స్టేషన్‌ లో నిర్బంధించిన సంఘటన లెన్నో. అభ్యర్థులకు అవసరమైన ఎన్‌ ఓసీలు, సర్టిఫికెట్లు ఇవ్వాల్సిన అధికారులు కూడా తాత్సారం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. నామినేషన్‌  గడువు ముగిసే వరకు కూటమి అభ్యర్థులకు మినహా, మిగిలిన వారికి సర్టిఫికెట్లు ఇవ్వకుండా వేధించడం జరిగింది. 

మహిళా అభ్యర్థులు తమ బ్లౌజుల్లో నామినేషన్‌  పత్రాలు పెట్టుకుని తీసుకెళ్లినా, చేతులు పెట్టి ఆ పత్రాలు లాగేసుకోవడం, రిటర్నింగ్‌ ఆఫీసర్‌కు పత్రాలు ఇచ్చిన తర్వాత కూడా టేబుల్‌ దగ్గర నుంచి తీసుకువచ్చి చించేయడం, అందుకు అధికారులు, పోలీసులు సహక రించడం వంటి ఘటనలు జరిగాయని స్థానిక ప్రజలు చెబు తున్నారు. ఈ ధోరణులు ప్రజాస్వామ్య ఎన్నికల ప్రక్రియకు ఎంత పెద్ద అవమానమో ఆలోచించాలి.

కూటమి ‘గెలుపు’ కుతంత్రం
అవాంతరాలన్నీ దాటుకుని, నామినేషన్‌  వేయగలిగినా చిన్న చిన్న కారణాలు, అర్థంలేని అభ్యంతరాలతో తిరస్కరించటం, ఆ దశను కూడా దాటుకుని నామినేషన్‌  ఆమోదం పొందితే, అభ్యర్థిని ఉపసంహరించుకునేలా చేయటమే కూటమి కొత్త మోడల్‌ ఎన్నికల నిర్వహణ! పోలీసులు రంగంలోకి వచ్చి ఫోన్‌  చేసి, అధికారుల పేర్లు చెప్పి పిలిపించడం, పోలీస్‌స్టేషన్‌ లో అక్రమంగా నిర్బంధించడం, ‘‘నువ్వు నామినేషన్‌  విత్‌డ్రా చేసుకో’’ అని బెదిరించడం జరిగిందని ప్రత్యక్షసాక్షులు చెప్పటం కూడా విన్నాం. 

రెండో దశ పోలింగ్‌లో ఏజెంట్లను నియమించనివ్వకుండా చేయడం, నియమించినా పోలింగ్‌ బూత్‌లోకి రానివ్వకపోవడం, ఇంపర్సనేషన్‌ , రిగ్గింగ్‌ వంటి అక్రమాలకు పాల్పడినట్లు సమాచారం. ఓటరు ‘ఓటరు ఐడీ కార్డు’ పట్టుకుని పోలింగ్‌ బూత్‌కు వెళ్తే, ‘‘నీ ఓటు ఇప్పటికే వేసేశారు’’ అని వెనక్కి పంపించడం జరిగిందని; మరోవైపు కులం పేరుతో ఓట్లు వేయించాలని ఒత్తిడి చేయడం, మాట వినకపోతే రూ.1000 జరి మానా విధిస్తామని చెప్పడం వంటి కట్టుబాట్లు గ్రామాల్లో పెట్టారని వాపోయినవారు ఎంతో మంది.

సాధారణంగా బ్యాలెట్‌ బాక్సులను సీల్‌ చేసి స్ట్రాంగ్‌ రూమ్‌ లలో ఉంచి, అక్కడి నుంచి కౌంటింగ్‌ కేంద్రానికి తీసుకొస్తారు. కానీ బాక్సులను తరలించే సమయంలో అవకతవకలు చేయడం, ఇతర పార్టీల కౌంటింగ్‌ ఏజెంట్లను రానివ్వకపోవడం, లెక్కించిన ఓట్లను అధికార పార్టీ గెలిచే విధంగా అంకెలు మార్చడం, ఏజెంట్లు లేకుండా ఫలితాలు ప్రకటించడం వంటి ఆరోపణలు ఉన్నాయి. ఇతర పార్టీ అభ్యర్థి లేదా స్వతంత్ర అభ్యర్థి గెలిచినట్లు తేలిన తర్వాత ‘ఏదో తప్పు జరిగింది’ అంటూ మళ్లీ లెక్కించి ఫలితాన్ని మార్చడం జరిగిందని కూడా చెబుతున్నారు.

ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ప్రశాంతంగా, స్వేచ్ఛగా ఎన్నికలు జరుగుతాయనే పేరు ఉండేది. అందుకే 42 సీట్లున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రెండు దశల్లోనే ఎన్నికలు జరిగేవి. 40 సీట్లున్న బీహార్‌లో ఆరు దశల్లో ఎన్నికలు జరిగాయి. పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్‌లో కూడా అనేక దశల్లో ఎన్నికలు జరిగాయి. అక్కడి శాంతిభద్రతల పరిస్థితికి అనుగుణంగా ఆ స్థాయిలో బలగాలు అవసరమయ్యాయి. కానీ ఇప్పుడు ఏపీ ఎన్నికల్లో శాంతిభద్రతల గురించి దేశమంతా చర్చించుకునే పరిస్థితి వచ్చిందంటే ఇంతకంటే తలవంపు ఏముంటుంది?

బలహీన వర్గాలు మేల్కోవాలి
ఎన్నికల సమయంలో బలహీన వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, పేదలను కనీసం మనుషులుగా కూడా చూడని పరిస్థి తులు అనేక చోట్ల కనిపించాయి. ఈ పరిణామాలన్నిటినీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, ఓసీ పేదలు గమనించాలి. డబ్బులు, ప్రలోభా లకు లోను కాకుండా నిజంగా మన కోసం పనిచేసే పార్టీ ఏది, మాట ఇచ్చి నిలబెట్టుకునే పార్టీ ఏది, మనల్ని అభివృద్ధి చేసే పార్టీ ఏది? అని ఆలోచించాలి. 2029 ఎన్నికల్లో మన ఓటును విలువగా ఉప యోగించాలి.

ప్రజాస్వామ్యం అంటే కేవలం బ్యాలెట్‌ బాక్స్‌ కాదు. ఆ బ్యాలెట్‌ బాక్స్‌ వరకు ఓటరు భయపడకుండా చేరాలి. ఏజెంట్‌ తన బాధ్యత నిర్వహించగలగాలి. ఓటరు తన ఓటును తానే వేయాలి. కౌంటింగ్‌ పారదర్శకంగా జరగాలి. ఎన్నికల సంఘం స్వతంత్రంగా వ్యవహరించాలి. అప్పుడే ఎన్నికలకు అర్థం ఉంటుంది. లేకుంటే, గెలిచినవారు అధికారంలోకి రావచ్చు కానీ ప్రజాస్వామ్యం మాత్రం గెలిచినట్టు కాదు.
- విజయ్‌ కుమార్‌, వ్యాసకర్త మాజీ ఐఏఎస్‌ అధికారి,  - జి. ఎస్‌ఆర్‌కేఆర్‌, లిబరేషన్‌ కాంగ్రెస్‌ పార్టీ’ అధ్యక్షుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement