భార్య వ్యాపార బకాయిలకు భర్తను బాధ్యుడిని చేయలేరు | Andhra Pradesh High Court Cancels Vijaya Dairy Chairman Election | Sakshi
Sakshi News home page

భార్య వ్యాపార బకాయిలకు భర్తను బాధ్యుడిని చేయలేరు

Nov 17 2026 4:27 AM | Updated on Nov 17 2026 4:27 AM

Andhra Pradesh High Court Cancels Vijaya Dairy Chairman Election

విజయ డెయిరీ ఎన్నికల వివాదంలో హైకోర్టు కీలక తీర్పు

శివరామప్రసాద్‌ నామినేషన్ల తిరస్కరణ చట్టవిరుద్ధమని స్పష్టీకరణ 

తిరిగి ఎన్నికలు నిర్వహించాలన్న ట్రిబ్యునల్‌ ఆదేశాలు సబబేనన్న కోర్టు 

పనివేళలు దాటి తీర్పు ఇవ్వడంలో తప్పులేదన్న న్యాయస్థానం

బాలవర్ధన్‌రావు, వెంకటరమణ, యూనియన్‌ పిటిషన్ల కొట్టివేత

సాక్షి, అమరావతి: భార్య నిర్వహించే ఏకవ్యక్తి యాజ­మాన్య వ్యాపారసంస్థ (సోల్‌ ప్రొప్రైట­ర్‌­షిప్‌)కు సంబంధించిన ఆర్థిక బకాయిలు, ఒప్పంద బాధ్యతలను కేవలం వైవాహిక సంబంధం ఆధా­రంగా భర్తపై మోపలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. భార్యాభర్తలు ఒకే ఇంట్లో నివసించినంత మాత్రాన, వ్యాపార లాభాలను కుటుంబం అనుభవించినంత మాత్రాన భార్యచేసిన అప్పులకు భర్త చట్టపరంగా బాధ్యుడు కాలేడని స్పష్టం చేసింది.

ఎటువంటి వ్యక్తిగత హామీపత్రాలు (పర్సనల్‌ గ్యారెంటీ) లేకుండా భార్య వ్యాపార లావాదేవీలను సాకుగా చూపి, సహకార సంఘం ఎన్నికల్లో పోటీచేయకుండా భర్త నామినేషన్‌ను తిరస్కరించడం పూర్తిగా చట్టవిరుద్ధమని హైకోర్టు ప్రకటించింది. కృష్ణాజిల్లా పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార సంఘం (విజయ డెయిరీ) డైరెక్టర్ల ఎన్నికల వివాదంలో పెనమకూరు పాల ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు వీరపనేని శివరామప్రసాద్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది.

ఇదే సమయంలో రాష్ట్ర సహకార ట్రిబ్యునల్‌ ఉత్తర్వులను సవాలు చేస్తూ ఇద్దరు డైరెక్టర్లు దాసరి వెంకటబాలవర్ధనరావు (ప్రస్తుత చైర్మన్‌), వేమూరి సాయివెంకటరమణ, అలాగే కృష్ణాజిల్లా పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం దాఖలు చేసిన రెండు వ్యాజ్యాలను కొట్టేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ నూనెపల్లి హరినాథ్‌ సోమవారం తీర్పు వెలువరించారు.

ఇదే సమయంలో విజయ డెయిరీ డైరెక్టర్‌ పదవులకు 2022 ఆగస్టు, 2023 ఆగస్టు నెలల్లో శివరామప్రసాద్‌ సమర్పించిన నామినేషన్లను తిరస్కరిస్తూ ఎన్నికల అధికారులు జారీచేసిన ఉత్తర్వులను న్యాయమూర్తి తన తీర్పులో తప్పుబట్టారు. ఇద్దరు డైరెక్టర్ల ఎన్నిక నిమిత్తం 12.8.2023న జరిగిన ఎన్నికను రద్దుచేస్తూ, తిరిగి ఎన్నిక నిర్వహించాలని ఆదేశిస్తూ ఆంధ్రప్రదేశ్‌ కో–ఆపరేటివ్‌ ట్రిబ్యునల్‌ ఇచ్చిన తీర్పును సమర్థించారు.

నామినేషన్ల తిరస్కరణపై శివరామప్రసాద్‌ న్యాయపోరాటం 
కృష్ణాజిల్లా పాల ఉత్పత్తిదారుల సహకార సంఘానికి 24.08.2022న ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో డైరెక్టర్‌ పదవికి శివరామప్రసాద్‌ వేసిన నామినేషన్‌ను.. అతడి భార్య వీరపనేని పద్మజకు చెందిన రాట్నాలమ్మ డెయిరీకి సహకార సంఘంతో వ్యాపార లావాదేవీలున్నాయని, సంఘానికి రూ.4.26 లక్షల మేర బకాయి ఉన్నారంటూ బైలా 24 కింద ఎన్నికల అధికారి తిరస్కరించారు. దీనిపై శివరామప్రసాద్‌ దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్‌ను విచారించిన ఏపీ సహకార ట్రిబ్యునల్‌.. అతడి నామినేషన్‌ తిరస్కరణను సమర్థించింది.

దీన్ని సవాలు చేస్తూ శివరామప్రసాద్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఇదిలా ఉండగా 07.08.2023న శివరామప్రసాద్‌ మరోసారి డైరెక్టర్‌ పదవికి నామినేషన్‌ వేశారు. రాట్నాలమ్మ డెయిరీ బకాయిల మొత్తం రూ.5.30 కోట్లకు చేరిందని, అంతేగాక నామినేషన్‌ను ప్రతిపాదించిన వ్యక్తులు గత రెండు జనరల్‌ బాడీ సమావేశాల్లో ఒకదానికి హాజరు కాలేదని అతడి నామినేషన్‌ను తిరస్కరించారు. దీనిపై శివరామప్రసాద్‌ దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్‌ను విచారించిన ట్రిబ్యునల్‌.. అతడి నామినేషన్‌ తిరస్కరణను తప్పుపట్టింది.

ఎన్నికల అధికారి ఉత్తర్వులను రద్దుచేసి, తిరిగి ఎన్నికల నిర్వహణకు ఆదేశాలిచ్చింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ డైరెక్టర్లుగా ఎన్నికైన బాలవర్ధనరావు, సాయివెంకటరమణలతో పాటు కృష్ణాజిల్లా పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం ఎండీ వేర్వేరుగా హైకోర్టులో రెండు పిటిషన్లు దాఖలు చేశారు. శివరామప్రసాద్‌ వ్యాజ్యంతోపాటు ఈ వ్యాజ్యాలపైన ఉమ్మడిగా విచారణ జరిపి, గతనెల 12న తీర్పు రిజర్వ్‌ చేసిన న్యాయమూర్తి జస్టిస్‌ హరినాథ్‌ సోమవారం తీర్పు వెలువరించారు.

భార్య లావాదేవీల కారణంగా నామినేషన్‌ తిరస్కరణా?
డైరెక్టర్‌గా శివరామప్రసాద్‌ వేసిన నామినేషన్‌ను అతడి భార్య వ్యాపార లావాదేవీలను కారణంగా చూపుతూ తిరస్కరించడాన్ని న్యాయమూర్తి తీర్పులో తప్పుబట్టారు. ఎన్నికల అధికారి చర్యలు చట్టవిరుద్ధమని చెప్పారు. భార్య బాధ్యతను భర్తపై మోపలేరని స్పష్టం చేశారు. శివరామప్రసాద్‌కు బైలాస్‌లోని క్లాజ్‌ 24 వర్తిస్తుందని ట్రిబ్యునల్‌ తప్పుగా భావించి, 2022లో ఆయన దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్‌ను కొట్టేసిందని, ఆయన నామినేషన్‌ను తిరస్కరిస్తూ ఎన్నికల అధికారి జారీచేసిన ఉత్తర్వులను సమర్థించిందని పేర్కొన్నారు.

ట్రిబ్యునల్‌ ప్రాథమికంగా చట్టపరమైన తప్పు చేసినప్పుడు, దాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత ఈ కోర్టుపై ఉందన్నారు. 2015–16 నుంచి 2023 వరకు యూనియన్‌ ఆర్థిక ఆడిట్‌ నివేదికల్లో రూ.4.26 కోట్ల బకాయిలు ఉన్నట్లు ఎక్కడా చూపించలేదని సంఘం ఎండీ స్వయంగా అంగీకరించారని పేర్కొన్నారు. 2021 తర్వాత రాట్నాలమ్మ డెయిరీతో ఎలాంటి వ్యాపారం లేదని, జనరల్‌ బాడీ సమావేశాలకు ప్రతిపాదకులు హాజరు కాలేదనేందుకు ఆధారాలు సమర్పించలేదని కూడా ఎండీ అంగీకరించారని తెలిపారు.

ట్రిబ్యునల్‌ సభ్యుడు రిటైర్మెంట్‌ రోజున పనివేళలు దాటిన తరువాత సాయంత్రం 5.10 గంటలకు తీర్పు ఇవ్వడం సరికాదన్న సంఘం తరఫున సీనియర్‌ న్యాయవాది చేసిన ఆరోపణలను తప్పుబట్టారు. ఒక అధికారి తన పదవీ విరమణ రోజు అర్ధరాత్రి 12 గంటల వరకు చట్టబద్ధమైన విధుల్లో కొనసాగుతారని తెలిపారు. న్యాయం అందించడం కోసం కోర్టులు, ట్రిబ్యునళ్లు రాత్రి పొద్దుపోయే వరకు పనిచేసిన సందర్భాలెన్నో ఉన్నాయని గుర్తుచేశారు. ఇలా పనిచేయడానికి దురుద్దేశాలు ఆపాదించలేమని న్యాయమూర్తి స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement