సాక్షి, విజయవాడ: పోలీసులే నిందితులుగా మారితే న్యాయం కోసం ఎవరిని ఆశ్రయించాలి? ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసిన వ్యవహారంలో తనకు ఎలాంటి సంబంధం లేకపోయినా ఇరికించారని బోడపాటి ధరణి కృష్ణ ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. పోలీసుల వేధింపులు భరించలేకపోయానని, చివరకు తనకు న్యాయం చేయాలని కోరుతూ సెల్ఫీ వీడియోల ద్వారా తన గోడును వినిపించారు.
ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసిన వ్యవహారంలో తనకు సంబంధం లేకపోయినా పోలీసులతో కలిసి జనసేన నాయకురాలు, సంస్థ డైరెక్టర్‌తో పాటు కేకే తనను ఇరికించారని ఆ సంస్థలో పనిచేసిన ధరణికృష్ణ ఆరోపించారు. ఈ మేరకు ఆదివారం పలు దఫాలుగా సెల్ఫీ వీడియోలు విడుదల చేయగా, మంగళగిరి రూరల్ పోలీసులు తనను మూడు రోజుల పాటు కస్టడీలో చిత్రహింసలకు గురిచేశారని, ప్రైవేట్ భాగాలపై కూడా కొట్టారని ఆరోపించారు.
అలాగే, తన తల్లి హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయడంతో పోలీసులు తనను విడిచిపెట్టారని ధరణికృష్ణ తెలిపారు. దాంతోపాటు పోలీసుల దాడిలో గాయపడటంతో విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స తీసుకున్నానని, ఈ మేరకు ఎంఎల్‌సీ నివేదిక కూడా పొందానని ఆమె వెల్లడించారు. తనకు చికిత్స అందించిన వైద్యులను సైతం మంగళగిరి పోలీసులు బెదిరించారని ఆరోపించారు.
ఈ నేపథ్యంలో తనపై జరిగిన దాడికి సంబంధించి ఫిర్యాదు చేసేందుకు పెనమలూరు పోలీస్ స్టేషన్‌కు వెళ్లినట్లు తెలిపారు. అయితే, పోలీసులు తన ఫిర్యాదును స్వీకరించేందుకు నిరాకరించారని, తనను, తన అడ్వకేట్‌ను కించపరిచేలా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లినా స్పందన లేకపోవడంతో.. ఓ మహిళగా న్యాయం కోసం ఇక ఎవరిని ఆశ్రయించాలని ధరణికృష్ణ ప్రశ్నించారు.
ఇదీ చదవండి: మున్సిపాలిటీ, కార్పొరేషన్లకు వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ప్రకటన


