విజయవాడ: తన కుల ధృవీకరణ పత్రం అంశానికి సంబంధించి విచారణకు ఆదేశించిన హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను నిలుపుదల చేయాలని కోరుతూ విజయనగరం జిల్లా తెర్లాం జడ్పీటీసీ సభ్యురాలు మజ్జి సిరి సహస్ర దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు ప్రభాన న్యాయమూర్తి బెంచ్ కొట్టివేసింది. మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఆమె మరొకసారి డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించగా, ఈరోజు( సోమవారం, నవంబర్ 16) కోర్టు ఆ అప్పీల్‌ను తిరస్కరించింది.
ఆ మధ్యంతర ఉత్తర్వులపై స్టే విధించాలని కోరుతూ సిరి సహస్ర హైకోర్టులో రిట్ అప్పీల్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం ఆమె రిట్ అప్పీల్‌ను తిరస్కరించింది. తద్వారా ఆమె కుల ధృవీకరణ పత్రంపై కలెక్టర్ విచారణ కొనసాగనుంది.
మజ్జి సిరి సహస్ర కుల ధృవీకరణ పత్రం అంశంపై నవంబర్ మొదటి వారంలో విచారణ జరిపిన హైకోర్టు సింగిల్ జడ్జి.. సిరి సహస్ర బీసీ కులస్తురాలా కాదా అనే విషయంపై ఏడు రోజుల్లో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని విజయనగరం జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. అంతేకాకుండా, వివాదం తేలేవరకు ఆమె బీసీ రిజర్వేషన్ ప్రయోజనాలు పొందకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.
ఆ మధ్యంతర ఉత్తర్వులపై స్టే విధించాలని కోరుతూ సిరి సహస్ర హైకోర్టులో రిట్ అప్పీల్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం ఆమె రిట్ అప్పీల్‌ను తిరస్కరించింది.
వివాదం ఇలా..
స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో ఆమె టీడీపీ అభ్యర్థిగా విజయనగరం జిల్లా తెర్లాం, కొత్తవలస జడ్పీటీసీ స్థానాలకు బీసీ కుల ధృవీకరణ పత్రంతో నామినేషన్ దాఖలు చేయడంతో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఆమె మజ్జి శ్రీను దత్తత కుమార్తె అని, ఆ సమయంలో ఆమెకు బీసీ రిజర్వేషన్ ఎలా వర్తిస్తుందనేది ప్రధాన అభ్యంతరం.
స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో సిరి సహస్ర టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తెర్లాం జడ్పీటీసీ స్థానం నుంచి విజయం సాధించారామె. మాజీ జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు కుమార్తెగా సిరి సహస్ర జడ్పీ చైర్మన్ పదవికి ప్రధాన పోటీదారుల్లో ఒకరిగా ఉన్నారు. అయితే ఆమె కుల ధృవీకరణ అంశం అనేది ప్రస్తుతం వివాదం కావడం చర్చనీయాంశమైంది.
మరో రిట్ పిటిషన్
ఇదిలా ఉంచితే, సిరి సహస్ర కుల ధృవీకరణ అంశంపై కలెక్టర్ విచారణ జరిపి.. వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని హైకోర్టు సింగిల్ జడ్జి ఏమైతే తీర్పు ఇచ్చారో దానిపై మరొక రిట్ పిటిషన్ దాఖలైంది. ఆమె బీసీ కులస్థురాలో కాదో.. తేల్చాలని కలెక్టర్‌ను ఆదేశిస్తే.. ఆయన జాయింట్ కలెక్టర్(జేసీ)కు ఆ పని అప్పచెప్పారని పేర్కొంటూ మరొక రిట్ పిటిషన్ దాఖలైంది. కుల ధృవీకరణ అనేది కేవలం కలెక్టర్ తేల్చాల్సిన అంశమని, ఇది జేసీకి అప్పగించడం సరైనది కాదని పేర్కొంటూ పిటిషన్ దాఖలైంది. దీనిపై తదుపరి విచారణ 18వ తేదీన జరిగే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: టీడీపీకి షాక్.. విజయ డెయిరీ ఛైర్మన్ ఎన్నిక రద్దు


