ఆకుల భవానీ
సాక్షి ప్రతినిధి, కాకినాడ: కాకినాడ మేయర్ స్థానం కేటాయింపులో టీడీపీకి భంగపాటు ఎదురైంది. జిల్లా పరిషత్ చైర్మన్ జనసేనకు, మేయర్ టీడీపీకి కేటాయిస్తున్నట్లు విస్తృత చర్చ జరిగింది. ఇందుకు కూటమి అధిష్టానం సైతం సుముఖంగా ఉన్నట్లు ప్రచారం నడిచింది. కాకినాడ మేయర్ పీఠానికి జనసేన అభ్యర్థిగా కడలి ఆకుల భవానీ పేరు ప్రకటిస్తూ పవన్ నిర్ణయం తీసుకోవడంతో టీడీపీ నేతలు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఒక్కసారిగా రాజకీయ సమీకరణలు మారడంతో టీడీపీ నేతల ఆశలు గల్లంతయ్యాయి. ఈ పరిణామం పచ్చ నేతల్లో ఆగ్రహావేశాలు నింపాయి. కాకినాడ జిల్లాలో అన్ని ప్రాధాన్యం కలిగిన పదవులు జనసేనకే కట్టబెడితే టీడీపీ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కాకినాడ మేయర్ స్థానానికి ఎవరు పోటీ చేయాలన్న మీమాంస కొన్ని రోజులుగా కొనసాగింది. ఎట్టకేలకు జనసేన అధిష్టానం పార్టీ శ్రేణులకు శనివారం రాత్రికి ఓ స్పష్టత ఇచ్చినట్లు తెలిసింది. కాకినాడ మేయర్ పీఠానికి జనసేన అభ్యర్థే బరిలోకి దిగుతారని, ఆశావహులు ఆదివారం నామినేషన్లు దాఖలు చేయాలని ఆ పార్టీ నేతలకు అంతర్గత ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. అధిష్టానం భరోసాతో ఆదివారం ఉదయానికే ముగ్గురు (ఆకుల భవాని, కడలి ఈశ్వరి, లక్ష్మీప్రసన్న) జనసేన మహిళా నేతలు మేయర్ స్థానానికి పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశారు. అయితే కాకినాడ నగరపాలక సంస్థ మేయర్ అభ్యర్థిగా జనసేన పార్టీ తరఫున ఆకుల భవాని పేరును ఖరారు చేశారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆదివారం సాయంత్రం ఈ నిర్ణయం తీసుకున్నారు.
టీడీపీకి ఎదురుదెబ్బ
మేయర్ అభ్యర్థి ఎంపికలో టీడీపీకి ఎదురుదెబ్బ తలిగింది. జెడ్పీ చైర్మన్ పదవి జనసేన నేత బుర్రా దివ్యరాజ్‌కు వరిస్తున్నట్లు చర్చ నడిచింది. అందుకు బదులుగా టీడీపీకి మేయర్ దాదాపు ఖరారైనట్లు ఆ పార్టీ శ్రేణులు సైతం వెల్లడించారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే సొదరుడి కోడలు వనమాడి సుస్మితతో పాటు, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ పేర్లను పరిశీలనలోకి తీసుకున్న టీడీపీ అధిష్టానం మేయర్ ఎవరైతే బాగుంటుందన్న విషయమై ఐవీఆర్‌ఎస్ సర్వే ద్వారా ప్రజల అభిప్రాయాలను సైతం సేకరించింది. దీంతో మేయర్ స్థానం ఇక టీడీపీకే దక్కుతుందని టీడీపీ నేతలు భావించారు. తాజాగా జనసేనకు కేటాయించడంతో ఒక్కసారిగా భంగపాటుకు గురయ్యారు. తమకు వరిస్తుందనుకున్న మేయర్ సీటు జనసేనకు కట్టబెట్టడంపై కారాలుమిరియాలు నూరుతున్నారు.
తేలని డివిజన్ల సర్దుబాట్లు
మేయర్ స్థానానికి హడావుడిగా అభ్యర్థిని ప్రకటించిన జనసేన అధిష్టానం డివిజన్ల పంపకాల్లో ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. పార్టీ నిర్ణయం కోసం వేచిచూస్తే పోటీ చేసే అవకాశాన్ని కోల్పోతామన్న ఉద్దేశంతో ఎవరికి వారు నామినేషన్లు వేస్తున్నారు. దీంతో రెండు రోజుల్లో కార్పొరేటర్ స్థానాలకు 211 మంది నామినేషన్లు దాఖలు చేశారు.
ఇక్కడ మొండిచెయ్యేనా?
మేయర్ జనసేనకు దక్కడంతో జిల్లా పరిషత్ పీఠంపై ఉత్కంఠ నెలకొంది. చైర్మన్ పీఠం జనసేనకు దక్కుతుందా..? అవకాశం టీడీపీకి వరిస్తుందా..? అనే మీమాంస నెలకొంది. ఈ పరిణామం ఇప్పటికే జెడ్పీ పీఠం ఆశిస్తున్న జనసేన నేత బుర్రా దివ్యరాజ్ వర్గంలో ఆందోళన నింపుతోంది. ఇప్పటికే టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి రేసులో ఉన్నారు. ఆ పార్టీ అధిష్టానం సైతం ఆమె వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. తాజాగా మారిన రాజకీయ పరిణామాల దృష్ట్యా టీడీపీకి చైర్మన్ పదవిని కేటాయిస్తే.. జనసేన నేత దివ్యరాజ్‌కు నిరాశ తప్పదన్న భావన ఆ పార్టీ నేతల నుంచి వ్యక్తమవుతోంది. దివ్యరాజ్ చైర్మన్ పదవిని ఎలాగైనా దక్కించుకోవాలన్న తలంపుతో ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు తెలిసింది. తనకు వరించకపోతే జెడ్పీటీసీ స్థానానికి రాజీనామా చేసేందుకు సైతం వెనుకాడనని ఇప్పటికే అల్టిమేటం జారీ చేసినట్లు తెలిసింది.


