ప్రత్యర్థుల కుటుంబాలే టార్గెట్.. వ్యక్తిగతమంటే పవన్‌కేనా? | Kommineni Comments On Pawan Kalyan Over Janasena Leaders | Sakshi
Sakshi News home page

ప్రత్యర్థుల కుటుంబాలే టార్గెట్.. వ్యక్తిగతమంటే పవన్‌కేనా?

Nov 16 2026 11:04 AM | Updated on Nov 16 2026 11:25 AM

Kommineni Comments On Pawan Kalyan Over Janasena Leaders

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మూడోసారి విడాకుల తీసుకున్న విషయం వ్యక్తిగతం అయినప్పటికీ ఈ మద్యకాలంలో ప్రజలలోకాని, సోషల్  మీడియాలో కాని ఇంతగా చర్చ జరిగిన ఘటన మరొకటి లేదంటే ఆశ్చర్యం కాదు. ఆయన ప్రముఖ సినీ నటుడే కాకుండా, రాజకీయాలలో ఒక కీలక భూమిక పోషిస్తున్న నేతగా ఉండడమే ఇందుకు కారణమని  చెప్పవలసిన అవసరం లేదు . పవన్ విడాకులపై ఇతర రాజకీయ పక్షాలు పెద్దగా కామెంట్ చేయలేదు. అందులోనూ వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ ఆ అంశంపై ఎవరూ మాట్లాడవద్దని తన పార్టీ వారికి స్పష్టం చేశారు. 

విడాకుల వార్త వినగానే జనసేనలో ఎక్కువమంది షాక్‌కు గురయ్యారు. దీని ప్రభావం పార్టీపై ఉంటుందా అని ఆందోళన చెందారు. కానీ జగన్ ప్రకటన చూశాక చాలామంది సంతోషపడ్డారు. ఇదే సందర్భంలో సోషల్ మీడియాలో చర్చలు సాగాయి. ఈ క్రమంలో జనసేనకు చెందినవారు విడాకుల అంశంలో పవన్ కళ్యాణ్ ను సమర్దిస్తూ వ్యాఖ్యలు చేసి మొత్తం వ్యవహారం రచ్చ అవడానికి కారణం అయ్యారని అనిపిస్తుంది. ఇతరులు ఏం మాట్లాడుకున్నా జనసేన క్యాడర్ మౌనంగా ఉంటే బాగుండేది. ఈ మేరకు పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన చేసి ఉండాల్సింది. విడాకుల అంశంలో పవన్ కళ్యాణ్ తప్పు లేదని, అన్నా లెజినోవాదే తప్పన్నట్లుగా కొందరు చెప్పడం ఆరంభించారు. పవన్ భవిష్యత్తులో ఏం చేస్తారో తెలియదు కాని, ప్రజాసేవ కోసమే విడాకులు  తీసుకున్న దేవుడు అని కొందరు ప్రచారం చేశారు. దేవుడు అయితే విడాకులు తీసుకుంటారా, పెళ్లిళ్లు చేసుకున్నవారు ప్రజాసేవ చేయలేరా? అని సోషల్ మీడియాలో మరికొంతమంది ప్రశ్నించారు. చట్టప్రకారం పవన్ విడాకులు తీసుకోవడానికి ఇబ్బంది ఉండదు. కాని పవన్ చేసింది నైతికమా? కాదా? అన్నదే పాయింట్. 

పవన్ ఆ మధ్య తిరుపతి లడ్డూ వివాదంలో లేనిపోని ఆరోపణలు చేశారు. అంతే కాకుండా కాషాయ వస్త్రాలు ధరించి అన్ అప్పాలిజిటిక్ సనాతని అని ప్రకటించుకున్నారు. సనాతని అయితే రెండుసార్లు విడాకులు ఎలా తీసుకున్నారన్న ప్రశ్న అప్పుడే వచ్చింది. కాని ఎవరూ సీరియస్ గా  పట్టించుకోలేదు. విశేషం ఏమిటంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ మద్య  ఒక సభలో మాట్లాడుతూ హిందూ మతంలో ఎవరైనా విడాకులు తసుకోవడం తప్పు అని కామెంట్ చేశారు. ఇదేమిటి! ఆయన  క్యాబినెట్ లో విడాకులు తీసుకున్నవారు ఉన్నారు కదా అని ప్రజలు చర్చించుకున్నారు. ప్రభుత్వ సలహాదారుగా ఉన్న ఆధ్యాత్మికవేత్త చాగంటి కోటేశ్వరరావు సనాతనంపై ప్రసంగం చేస్తూ ఇందులో విడాకులు అన్న ప్రసక్తి లేదని చేసిన వ్యాఖ్యల వీడియోలు ప్రచారంలోకి వచ్చాయి. 

పవన్ భార్య అన్నా లెజినోవా తన ఇంటి పేరును కొణిదెలగా మార్చుకోవడం, తిరుమలకు మెట్లపై వెళ్లడం, తలనీలాలు సమర్పించడం, పవన్ అనారోగ్యానికి గురైనప్పుడు ఆమె దగ్గరుండి సపర్యలు చేయడం, ప్రధాని మోడీ పరామర్శకు వచ్చినప్పుడు కూడా ఆమె అక్కడే ఉండడం వంటి విషయాలతో సహజంగానే వారి మధ్య అన్యోన్యత బాగానే ఉందని అనుకున్నారు. ఇంతలోనే ఏమైందో కాని విడాకుల ప్రకటన రావడం సంచలనం అయింది. ఇదే విషయాన్ని సిపిఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ ప్రస్తావించారు.  మొత్తం మీద పవన్ కళ్యాణ్ మద్దతుదారులలో గందరగోళం ఏర్పడింది. దీనిని ఎలా సమర్ధించుకోవాలో అర్దం కాక కొంత సతమతం అయ్యారు. ఆ దశలో దీనిని డైవర్ట్ చేయడానికా అన్నట్లు కొంతమంది జనసేనకు చెందినవారు మాజీ ముఖ్యమంత్రి జగన్ కుటుంబాన్ని టార్గెట్ చేసుకుని నీచమైన  వ్యాఖ్యలు చేశారు.  వారు  పవన్ కు మద్దతు ఇస్తే ఇవ్వవచ్చు. కాని ఈ వ్యవహరంతో సంబంధం లేని  జగన్ కుటుంబ  సభ్యులపై అత్యంత ఘోరమైన  రీతిలో   దూషణలకు పాల్పడడం దారుణంగా కనిపిస్తుంది.

అలాగే పిసిసి అధ్యక్షురాలు షర్మిలపైన, రాజకీయాలతో సంబంధం లేని  ప్రముఖ నటులు అల్లు అర్జున్ సతీమణి పైన దుర్బాషలు చేయడం అందరిని విస్తుపరిచింది. జూనియర్ ఎన్టీఆర్‌ కుటుంబంపై ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యే ఒకరు దుర్భాషలాడారు. ఇలాంటి మూర్ఖులను    కట్టడి చేయడానికి, ఈ అసభ్య దూషణలను ఖండించడానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు ముందుకు రాకపోవడం శోచనీయం. దుర్భాషలాడిన  సైకోలపై  వైఎస్సార్‌సీపీ నేతలు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయవలసి వచ్చింది. అయినా మహిళలపై నీచమైన వ్యాఖ్యలు చేసినవారి మీద  చర్యలు తీసుకోవడంలో వారు  తాత్సారం చేస్తున్నారు. పోలీసు వ్యవస్థ పనితీరు ఎంత నాసిరకంగా ఉందో చెప్పడానికి ఇది ఉదాహరణ అవుతుంది. పవన్ వ్యక్తిగత జీవితం జోలికి వెళ్లవద్దని, సంయమనం పాటించాలని తన క్యాడర్ కు జగన్ స్పష్టమైన  ఆదేశాలు ఇవ్వడంతో వైఎస్సార్‌సీపీ వారు సంయమనం పాటించారు.

ఆ తర్వాత ఎవరి వ్యక్తిత్వాన్ని అయినా హననం చేయగలదన్న పేరున్న ఐటీడీపీ కూడా అదే దారిలో ఒక ప్రకటన చేసింది. పవన్ టీడీపీతో కలిసి ఉన్నారు కాబట్టి సరిపోయింది కాని, వ్యతిరేక పక్షంలో ఉండి ఉంటే ఈపాటికి  టీడీపీ నేతలు కాని, వారి సోషల్ మీడియాకాని తీవ్రస్థాయిలో విరుచుకుపడేది. 2014లో జనసేన మద్దతుతో గెలిచిన తర్వాత కొంతకాలానికి  తేడా రాగానే టీడీపీవారు ఎలా జుగుప్సాకరంగా వ్యవహరించింది ఆయనే సభలలో చెబుతూ వచ్చారు.తన తల్లిని దూషించారని,తమను అలగా జనం అన్నారని,వారిని క్షమించే ప్రసక్తి లేదని పవన్ కళ్యాణ్  అనేవారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్, ప్రముఖ నటుడు బాలకృష్ణల పేర్లను ఆయన ప్రస్తావించేవారు. కాని ఆ తర్వాత కాలంలో ఆయన మళ్లీ వారితోనే జట్టు కట్టారు. టీడీపీ చంద్రబాబు ఆధ్వర్యంలోకి మారిన తర్వాత వ్యక్తులపై దాడి చేసి వ్యక్తిత్వ హననం  అన్నది  ఒక విధానంగా మారింది.

చివరికి పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు రెండో వివాహానికి సంబందించి, లక్ష్మీపార్వతిని పెళ్లాడడానికి ముందు జరిగిన ఘట్టాల గురించి, ఆ తర్వాత పరిణామాలపై  ప్రత్యర్ది కాంగ్రెస్ పార్టీ వారి కన్నా తెలుగుదేశంవారు,ఆ మాటకు వస్తే ఆయన కుటుంబ సభ్యులే ఎక్కువ వ్యతిరేక ప్రచారం చేశారు. లక్ష్మీపార్వతిని దుష్ట అని శక్తి ప్రచారం చేశారు. హరికృష్ణ ఆయా చోట్లకు వెళ్లి సభలుపెట్టి మరీ విమర్శించారు. ఎన్టీఆర్‌ వివాహం, తదుపరి ఘటనలపై  అప్పట్లో కాంగ్రెస్‌లో ఉన్న ఒక నేత తీవ్ర వ్యాఖ్యలు చేసేవారు. ప్రస్తుతం ఆయన టీడీపీలో ఉన్నారు.   ఇటీవలి కాలంలో వైఎస్ జగన్ కుటుంబంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తో పాటు పవన్ కళ్యాణ్ లు ఎన్ని విమర్శలు గుప్పించింది తెలిసిన విషయమే. జగన్ కు, ఆయన సోదరి షర్మిలకు ఏర్పడిన వివాదాన్ని వ్యక్తిగతమని వీరు వదలిపెట్టలేదు.

మాజీ మంత్రి వివేకా హత్య కేసును జగన్ కు అంటగట్టడానికి చంద్రబాబుతో పాటు, పవన్ కూడా ఎంత ప్రయత్నం చేసేది, ఎన్ని ఆరోపణలు చేసేది విదితమే.  ఇప్పుడు పవన్ వరకు వచ్చేసరికి ఇదంతా వ్యక్తిగత విషయం అని ఆ పార్టీవారు రాగం అందుకుంటున్నారు. కనీసం ఇకనైనా చంద్రబాబు,పవన్,లోకేష్  తదితర నేతలు ప్రత్యర్ధి రాజకీయ పార్టీల నేతల వ్యక్తిత్వ హననానికి పాల్పడకుండా ఉంటారా అన్నది డౌటుగానే ఉంది. మహిళలపై ఎవరైనా అసభ్యకరంగా మాట్లాడితే కఠిన చర్యలు ఉంటాయని ఈ ముగ్గురు పైకి చెబుతుంటారు .అది నిజమే అయితే జగన్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్.టి.ఆర్. కుటుంబాల మహిళలపై  పిచ్చి వ్యాఖ్యలు చేసిన వారిపై ఎందుకు సత్వరమే  చర్య తీసుకోలేదన్న ప్రశ్నకు జవాబు దొరకదు. మహిళల పట్ల వీరికి ఉన్న గౌరవం ఏపాటిదో ఈ ఘటన తెలుపుతుంది. 

పవన్ పై ఆయన రెండో భార్య రేణూ దేశాయ్ అప్పట్లో  ఏ ఆరోపణలు చేసింది తెలియచెప్పే వీడియోలు మళ్లీ వైరల్ అయ్యాయి. తాను గతంలో  విడాకులు  తీసుకున్నప్పుడు ఎన్ని కోట్ల పరిహారం చెల్లించింది కూడా తన ప్రసంగాలలో పవన్  చెప్పేవారు. ఆ వీడియోలు కూడా సర్కులేషన్ లోకి వచ్చాయి.  ప్రస్తుతం అన్నా లెజినోవాకు ఎలాంటి పరిహారం ఇచ్చింది తెలియదు. ఇది ఇద్దరి మద్య కుదిరిన ఒప్పందమా? లేక కోర్టు ద్వారా జరిగిన ప్రక్రియా అన్నది కూడా ఎవరూ చెప్పలేదు. విడాకులకు కారణం ఎవరు అన్నదానిపై ఎంత చర్చ చేసినా తేలేది కాదు. ఎంత బాధ్యతగా ఉంటామని చెప్పినా, వారి పిల్లలపై తల్లిదండ్రుల విడాకుల ప్రభావం మాత్రం అధికంగానే ఉంటుందన్నది వాస్తవం. ఈ విడాకుల వల్ల జనసేన పార్టీ కొంత ఆత్మరక్షణలో పడుతుందన్న భావన ఉంది. ఈ పార్టీపై టీడీపీ పెత్తనం పెరుగుతుంది. ఇప్పటికే చంద్రబాబు సర్కార్ ఏ అరాచకాలు చేస్తున్నా ప్రశ్నించలేకపోతున్న  పవన్ కళ్యాణ్ మరింత బలహీనపడే అవకాశం ఉంటుంది.

- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement