జనసేన నుంచి టికెట్ తెచ్చుకున్న సౌజన్యలత
విజయనగరం జిల్లా: రాజాం మున్సిపల్ చైర్‌పర్సన్‌గా జనసేన పార్టీ తరఫున నిలుస్తున్న బేరు సౌజన్యలత పేరుకే జనసేనపార్టీ. ఈ ఎన్నికల్లో జనసేనకు టిక్కెట్ కేటాయింపు ఇక్కడ రావడంతో గత మూడురోజుల్లోనే ఆమె తన కుటుంబసభ్యులతో పాటు పవన్‌కల్యాణ్‌ను కలిసి టికెట్ తెచ్చుకుంది. ఈ టిక్కెట్ కేటాయించడం వెనుక బలమైన ఆర్థిక, రాజకీయ సమీకరణాలు ఉన్నాయని, భారీ స్థాయిలో ఆర్థిక లావాదేవీలు జరిగాయనే హాట్ టాపిక్ నడుస్తోంది. ఆమె తండ్రి బనిశెట్టి వెంకటరావు రాజాంలో టీడీపీ కార్యకర్తగా ఉన్నారు.
రాజాం వీవర్స్ సొసైటీలో ఇటీవల జరిగిన స్కాంలో ఆయన ప్రమేయం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. ఆర్థిక లావాదేవీల్లో భాగంగానే ఈ కుటుంబానికి చెందిన సౌజన్యకు టిక్కెట్ కేటాయించడం ఒక ఎత్తు కాగా, చేనేత ఓటర్లను ఆకర్షించడంలో భాగంగానే ఈ సీటు కేటాయించారనే వాదన మరో ఎత్తుగా రాజాంలో చక్కర్లు కొడుతోంది. రాజాం మున్సిపాల్టీ ఎన్నికలకు సంబంధించి జనసేన పార్టీ వ్యవహరిస్తున్న తీరు సర్వత్రా అన్ని వర్గాల్లో విమర్శలకు తావిస్తోంది.
మున్సిపాల్టీలో 40శాతం దాటి ఓట్లు ఉన్న కాపు కులాన్ని కాదని వేరే వారికి సీటు కేటాయించారు. ఇంకో వైపు జనసేన పార్టీ రాజాం ఇన్‌చార్‌్జగా గత ఏడేళ్లుగా సేవలు అందిస్తున్న కాపు కులానికి చెందిన పొగిరి సురేష్‌కుమార్‌కు మొండిచెయ్యి చూపించారు. రాజాంలో స్థానికంగా లేనివారికి చైర్మన్ సీటు కేటాయించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
మూడోసారి మోసపోయిన రాజాం జనసేన ఇన్‌చార్జ్
జనసేన పార్టీ రాజాం ఇన్‌చార్జ్ పొగిరి సురేష్‌కుమార్ మూడోసారి జనసేన పార్టీ చేతిలో మోసపోయాడు. ఏడాది క్రితం రాజాం ఏఎమ్‌సీ చైర్మన్ పదవిని సురేష్‌కుమార్ భార్య కృష్ణవేణికి కేటాయించి పేరు ప్రకటించి, ప్రమాణస్వీకారం చేసే సమయంలో రద్దుచేసి, టీడీపీకి చెందిన గురవాన నారాయణరావు భార్య పార్వతికి అప్పగించారు. ఇటీవల జరిగిన ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ ఎన్నికల్లో పలుచోట్ల జనసేన పార్టీ కార్యకర్తలు ఎన్నికల బరిలో నిలిచారు.
వారికి బీఫామ్ అందజేస్తామన్న సురేష్‌కుమార్ ఆ ఫామ్‌లు పార్టీ నుంచి అందజేయలేకపోయారు. చివరి నిమిషం వరకూ ఇదిగో ఇస్తాం..అదిగో ఇస్తాం అంటూ కాలయాపన చేసి, చివరికి సురేష్‌కుమార్‌కు ఇవ్వకుండా చేతులెత్తేశారు. దీంతో జనసేన పార్టీ తరఫున నామినేషన్లు వేసిన అభ్యర్థులు పలుచోట్ల స్వతంత్రులుగా ఉండిపోయారు.
జనసేన పార్టీ కోసం తన ప్రభుత్వ ఉపాధ్యాయ వృత్తికి సైతం వలంటరీ రిటైర్మెంట్ ఇవ్వడమే కాకుండా, పవన్ కల్యాణ్ బర్త్‌డే వేడుకలు, సామాజిక కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాలు చేసి, అప్పులతో పార్టీని నడిపే సురేష్‌కుమార్‌కు పార్టీ బీఫామ్ ఇచ్చే అవకాశం జనసేన ఇవ్వలేదు. ఇప్పుడు రాజాం మున్సిపాల్టీ చైర్మన్ సీటు జనసేన ఖాతాకు రాగా, ఈ అవకాశం సైతం సురేష్‌కు దక్కకుండా జనసేన పార్టీ ఎక్కడో వేరే చోట ఉండే టీడీపీ కుటుంబానికి చెందిన వ్యక్తికి కేటాయించడం జీర్ణించుకోలేని అంశంగా మారింది.


