సెల్ఫీ వీడియోలో ధరణి కృష్ణ
ఉద్యోగాలిప్పిస్తామని డబ్బులు వసూలు వ్యవహారంలో నాకు ఏ సంబంధం లేదు
పలు సెల్ఫీ వీడియోలు విడుదల చేసిన బోడపాటి ధరణి కృష్ణ
జనసేన నాయకురాలు, కేకే.. నన్ను కావాలనే ఇరికించారు
పోలీసులతో కొట్టించారు.. బూతులు తిట్టారు
మూడు రోజులుగా నాకు నరకం చూపించారు
నా నోటితో వారికి కావాల్సిన పేర్లు చెప్పించారు
నాకు ఏదైనా జరిగితే మంగళగిరి రూరల్‌పోలీస్ స్టేషన్ సీఐ, ఎస్సైలదే బాధ్యత
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసిన వ్యవహారంలో తనకు ఏ సంబంధం లేకపోయినా పోలీసులతో కలిసి జనసేన నాయకురాలు, సంస్థ డైరెక్టర్‌తో పాటు కేకే తనను ఇరికించారని ఆ సంస్థలో పని చేసిన బోడపాటి ధరణి కృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదివారం ఆమె పలు దఫాలుగా సెల్ఫీ వీడియోలు విడుదల చేశారు. ఎక్కడ పోలీసులు మళ్లీ వచ్చి తనను తీసుకెళ్తారేమోననే భయంతో ఇలా ముక్కలు ముక్కలుగా వీడియోలు పెట్టానని తెలిపారు.
తనకు ఏదైనా జరిగితే మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ సీఐ, ఎస్సైలదే బాధ్యత అని తెలిపారు. ఆ వీడియోల్లో ఆమె ఇంకా ఏమన్నారంటే.. ‘విచారణ కోసం అంటూ పోలీసులు నన్ను మూడు రోజుల క్రితం మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. మధ్యాహ్నం పంపించేస్తామని చెప్పారు. అదే రోజు రాత్రికి నన్ను ఎస్సై రవితేజ, హెడ్ కానిస్టేబుల్ శ్యామ్, లేడీ కానిస్టేబుల్ ప్రియ హైదరాబాద్ తీసుకెళ్లారు. పెద్దిరాజు హాస్టల్ చూపించమన్నారు. అక్కడ నుంచి లలిత ఇంటికి తీసుకెళ్లారు.
స్టేషన్‌కు తీసుకెళ్లిన దగ్గర నుంచి నిజం చెప్పాలంటూ నన్ను కొడుతూనే ఉన్నారు. నా ఫోన్ కూడా నాకు ఇవ్వలేదు. మా అమ్మా వాళ్లతో మాట్లాడతానన్నా ఒప్పుకోలేదు. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కేకే గారు నాతో కాల్ మాట్లాడినప్పుడు చంపేస్తామని బెదిరించారు. దీనివెనుక ఉన్నది ఆయన, పెద్దిరాజు గారే. వారిద్దరూ ఆఫీస్‌లో కలిసి మాట్లాడుకున్నారు. నాతో ఎప్పుడూ కలవలేదు. ఈ విషయం ఎంత చెప్పినా విన్పించుకోలేదు.’ అని ధరణి కృష్ణ తెలిపారు.
నన్ను కొడుతూ వీడియో తీశారు
‘కేకే గారికి లోపల ఉన్న కొంత మందితో ఉన్న వైరం వల్ల.. నా నోటితో వారి పేర్లు చెప్పించడం కోసం నన్ను కొట్టారు. ఆయనే నన్ను దగ్గరుండి కొట్టించి వీడియోలు కూడా తీశారు. మంగళగిరి సీఐ గారి ద్వారా ఆ వీడియోలను కేకే గారు తీసుకున్నారు. ఆ తర్వాత హైదరాబాద్ నుంచి తీసుకొస్తుండగా సీఐ.. కాల్ చేశారు. ‘మీ వాళ్లు హేబియస్ కార్పస్ పిటీషన్ వేశారట. మీ వాళ్లతో వెళ్లి మాట్లాడుకోండి. అది వేస్తే మీకు చాలా ఇబ్బందులుంటాయి’ అని హెచ్చరించారు. ఆ తర్వాత నన్ను ఎయిమ్స్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. మా వాళ్లకు ఫోన్ చేయమన్నారు. మా వాళ్లు రాలేదని చెప్పి ఇష్టమొచ్చినట్టు తిట్టారు.
ఈ రోజు (ఆదివారం) మణిపాల్ ఆస్పత్రి వద్దకు తీసుకొచ్చి వదిలిపెట్టారు. అక్కడి నుంచి ఇంటికి ర్యాపిడో బుక్ చేసుకోమన్నారు. ఇంటికి చేరుకునే వరకు పోలీసులు నా వెనుకాలేవచ్చారు. ఇప్పుడు కూడా మా ఇంటి ముందే ఉన్నారు. మళ్లీ వాళ్లు ఏ నిమిషంలోనైనా వచ్చేస్తారేమోనే భయంతోనే ఇలా వీడియోలు పంపిస్తున్నాను. నన్ను కొట్టారు.. తిట్టారు.. చాలా బూతులు మాట్లాడారు. ఈ మూడు రోజులు నరకం అనుభవించాను. నాకు ఏదైనా జరిగితే సీఐ, ఎస్‌ఐలదే బాధ్యత’ అని ధరణి కృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు.


