ఈ నెల 18న అతి తీవ్ర తుపానుగా మారే అవకాశం
19, 20 తేదీల్లో రాష్ట్రంలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు
గంటకు 145 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు
సాక్షి, అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడగా.. సోమవారానికి అది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుపానుగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారానికి తీవ్ర తుపానుగా మారి, అనంతరం మరింత బలపడి వాయవ్య దిశగా కదులుతూ ఏపీ తీరం వైపు వచ్చి 18వ తేదీకి అతి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని తెలిపింది. ఆదివారం రాత్రికి వాయుగుండం విశాఖపట్నానికి 960 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని పేర్కొంది.
తుపాను ప్రభావంతో ఈ నెల 18 నుంచి కోస్తాంధ్రలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. 19, 20 తేదీల్లో ఉత్తరాంధ్రలో పలుచోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి. కాకినాడ, కోనసీమ, కృష్ణా, బాపట్ల జిల్లాల్లోనూ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నెల 19వ తేదీ సాయంత్రం నుంచి తీర ప్రాంతంలో గరిష్టంగా గంటకు 145 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తుపాను ముప్పు నేపథ్యంలో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. సముద్రంలో ఉన్న మత్స్యకారులు వెంటనే తీరానికి చేరుకోవాలని సూచించింది.


