ఇతర రాష్ట్రాల కంటే అధిక ధరలకు మందుల కొనుగోళ్లు
పారాసెటమాల్ 650 ఎంజీపై ఒక్క క్వార్టర్‌లోనే రూ.85 లక్షల అదనపు భారం
ఆల్బెండజోల్ కొనుగోళ్లలో రెండేళ్లకు రూ.50 లక్షల అదనపు వ్యయం
డాంపెరిడోన్ సిరప్ కొనుగోళ్లలో మరో రూ.20 లక్షల భారం
లోసార్టన్ మాత్రలకూ ఇతర రాష్ట్రాల కంటే అధిక ధరల ఖరారు
సిల్వర్ సల్ఫాడయాజైన్ క్రీమ్‌పై గత టెండర్ ధర కంటే 30 రెట్లు అధికంగా ఎల్–1 కోట్
అధిక ధరలతో ప్రజాధనానికి కోట్లాది రూపాయల గండి
కమీషన్ల కోసమే సరఫరాదారులకు ప్రయోజనం చేకూర్చేలా ధరల ఖరారు
సాక్షి, అమరావతి: చంద్రబాబు పాలనలో వైద్య, ఆరోగ్య శాఖ అవినీతికి అడ్డాగా మారిపోయింది. ప్రభుత్వ ఆస్పత్రులకు అవసరమైన మందులు, వైద్య పరికరాల సేకరణలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే భారీగా అధిక ధరలు ఖరారు చేస్తుండడం వెనుక భారీ కుంభకోణమే ఉందని వినిపిస్తోంది. సరఫరాదారులకు ప్రయోజనం చేకూర్చేలా, కమీషన్లకు కక్కుర్తిపడి ప్రజాధనాన్ని అదనంగా వెచ్చిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
పేదలకు ఉచితంగా అందించాల్సిన మందుల కొనుగోళ్లలోనూ ఇదే తంతు కొనసాగుతోంది. ఆస్పత్రులకు మందుల సరఫరా కోసం వైద్య శాఖ శనివారం రేట్ కాంట్రాక్ట్ (ఆర్సీ) ఖరారు చేసిన నేపథ్యంలో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పారాసెటమాల్, ఆల్బెండజోల్ సహా పలు రకాల మందులను గుజరాత్, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాలు కొనుగోలు చేస్తున్న ధరల కంటే ఏపీలో అధిక ధరలకు సేకరించేందుకు నిర్ణయించడం గమనార్హం. ఈ ధరల వ్యత్యాసంతో ప్రజాధనంపై కోట్లాది రూపాయల అదనపు భారం పడే పరిస్థితి ఏర్పడింది.
పారాసెటమాల్ కొనుగోళ్లలో అధిక ధరల భారం!
జ్వరం, నొప్పులకు వాడే పారాసెటమాల్ మాత్రల కొనుగోళ్లలో ఏపీ వైద్య శాఖ నిర్ణయించిన ధరలు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే అధికంగా ఉన్నాయి. పారాసెటమాల్ 650 ఎంజీ 100 మాత్రలకు ఏపీ రూ.50.09 ధర నిర్ణయించగా.. గుజరాత్ రూ.36.40, ఛత్తీస్‌గఢ్ రూ.37.99కే కొనుగోలు చేస్తున్నాయి. ఈ వ్యత్యాసం ప్రకారం ఛత్తీస్‌గఢ్ ధరతో పోలిస్తే ఏపీలో ప్రతి 100 మాత్రలపై రూ.12 పైనే అదనపు భారం పడుతోంది.
వైద్య శాఖ ప్రతి క్వార్టర్‌కు 6–7 కోట్ల మాత్రలు కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో.. 7 కోట్ల మాత్రల లెక్కన ఒక్క క్వార్టర్‌లోనే సుమారు రూ.85 లక్షల అదనపు వ్యయం కానుంది. ఇక పారాసెటమాల్ 500 ఎంజీ 100 మాత్రలకు ఏపీ రూ.33 ధర నిర్ణయించగా.. గుజరాత్ రూ.29.71కే కొనుగోలు చేస్తోంది. రెండేళ్లపాటు అమల్లో ఉండే ఏపీ రేటు కాంట్రాక్టు (ఆర్సీ) ప్రకారం 9.61 కోట్లకు పైగా మాత్రలు కొనుగోలు చేస్తే.. గుజరాత్ ధరతో పోలిస్తే రూ.46 లక్షలకు పైగా అదనపు ఆర్థిక భారం పడనుంది.
నులిపురుగుల మాత్రలలోనూ దోపిడీ!
పిల్లలు, పెద్దలకు ఇచ్చే ఆల్బెండజోల్ 400 ఎంజీ 100 మాత్రలను ఛత్తీస్‌గఢ్ వైద్య శాఖ రూ.108కు కొనుగోలు చేస్తుండగా.. ఏపీలో రూ.115.50 చొప్పున కొనుగోలుకు నిర్ణయించారు. వచ్చే రెండేళ్లలో 6.50 కోట్లకు పైగా మాత్రలు కొనుగోలు చేయనున్న నేపథ్యంలో ఈ ధరల వ్యత్యాసంతో సుమారు రూ.50 లక్షల అదనపు భారం పడనుంది.
» పిల్లల వాంతుల నివారణకు వాడే డాంపెరిడోన్ సిరప్‌ను గుజరాత్ రూ.4.67కు కొనుగోలు చేస్తుండగా.. ఏపీలో రూ.6.56 ధర నిర్ణయించారు. రెండేళ్లలో 10 లక్షల సిరప్‌ల కొనుగోలుతో సుమారు రూ.20 లక్షల అదనపు వ్యయం కానుంది.
» ఇక లోసార్టన్ పొటాషియం 50 ఎంజీ 100 మాత్రలను ఛత్తీస్‌గఢ్ రూ.40కు కొనుగోలు చేస్తుండగా.. ఏపీలో రూ.43కు నిర్ణయించారు. రెండేళ్లలో 1.50 కోట్ల మాత్రల కొనుగోలుకు ఈ ధర వర్తించనుంది.
» మరోవైపు కాలిన గాయాల చికిత్సకు ఉపయోగించే సిల్వర్ సల్ఫాడయాజైన్ క్రీమ్ విషయంలోనూ ధరల వ్యవహారం వివాదాస్పదంగా మారింది. గత ఏపీ టెండర్లలోని ధరల కంటే ఏకంగా 30 రెట్లకు పైగా అధిక ధరను ఎల్–1 సంస్థ కోట్ చేయడంతో అధికారులు విస్తుపోయినట్టు సమాచారం. సదరు సంస్థ బహిరంగ మార్కెట్ ధర కంటే కూడా అధికంగా రేటు కోట్ చేయడంతో ఆర్సీ ఖరారు చేయకుండా మళ్లీ టెండర్లు పిలవాలని నిర్ణయించారు.
సాధారణంగా ప్రభుత్వాలు బల్క్ కొనుగోళ్ల ద్వారా మార్కెట్ ధరల కంటే తక్కువకు మందులు, వైద్య పరికరాలు సేకరించి ప్రజాధనాన్ని ఆదా చేస్తుంటే.. ఏపీలో మాత్రం ఇతర రాష్ట్రాల కంటే అధిక ధరలకు కొనుగోళ్లు జరగడం గమనార్హం.

అల్బెండజోల్ వంద మాత్రలు రూ.103కు కొనుగోలు చేస్తున్నట్టు ఛత్తీస్‌గడ్ మెడికల్ సర్వీస్ కార్పొరేషన్ ఖరారు చేసిన రేటు

పారాసెటమాల్ 650 ఎంజీ ఒక్కో మాత్రను 0.36 పైసలకు కొంటున్నట్టు ఛత్తీస్‌గడ్ మెడికల్ సర్వీస్ కార్పొరేషన్ ఖరారు చేసిన రేటు


