సీబీఐ పేరుతో రియల్టర్‌ కిడ్నాప్‌ | Realtor kidnapped in the name of CBI | Sakshi
Sakshi News home page

సీబీఐ పేరుతో రియల్టర్‌ కిడ్నాప్‌

Nov 16 2026 3:37 AM | Updated on Nov 16 2026 3:37 AM

Realtor kidnapped in the name of CBI

మదనపల్లెలో సినిమాను మించిన స్కెచ్‌  

బాధితుడిని విడిపించి ఆరుగురు నిందితుల్ని అరెస్ట్‌ చేసిన పోలీసులు  

మదనపల్లె టౌన్‌: సినిమాలోలాగా సీబీఐ ఐడీ కార్డులు, అరెస్ట్‌ వారెంట్‌ పత్రాలు, డమ్మీ పిస్టల్, సంకెళ్లతో వచ్చి ఓ రియల్టర్‌ను కిడ్నాప్‌ చేసిన ముఠా గుట్టును అన్నమయ్య జిల్లా మదనపల్లె వన్‌టౌన్‌ పోలీసులు ఆదివారం రట్టుచేశారు. బాధితుడిని సురక్షితంగా విడిపించి ఆరుగురు నిందితులను అరెస్ట్‌ చేశారు. వన్‌టౌన్‌ సీఐ మోహన్, ఎస్‌ఐలు రహీముల్లా, రామకృష్ణారెడ్డి తెలిపిన వివరాల మేరకు.. మదనపల్లె అగడ్త వీధికి చెందిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి సాదిక్‌ ఈ నెల 10న మధ్యాహ్నం 3.30 గంటలకు మడికయల శివాలయం మీదుగా మల్లికార్జున సర్కిల్‌ వైపు కారులో వెళుతుండగా వెనుక కారులో వచ్చిన ఇద్దరు కబరస్తాన్‌ వద్ద అడ్డుకున్నారు. 

మేము సీబీఐ.. నీపై కేసు ఉంది.. అంటూ నకిలీ సీబీఐ ఐడీ కార్డులు, అరెస్ట్‌ వారెంట్‌ చూపించి బలవంతంగా కారులో ఎక్కించుకుని కర్ణాటక రాష్ట్రం తుమకూరు జిల్లాలోని ఓ ఫాంహౌస్‌కు తీసుకెళ్లారు. అక్కడ వారిద్దరితోపాటు మరో ఐదుగురు కలిసి సాదిక్‌ను బంధించారు. కేసు నుంచి తప్పించాలంటే రూ.5 కోట్లు ఇవ్వాలని, లేకపోతే చంపేస్తామని బెదిరించారు. రెండురోజుల పాటు మానసికంగా, శారీరకంగా భయభ్రాంతులకు గురిచేశారు. 

తీవ్ర భయాందోళనలకు గురైన సాదిక్‌.. బంధువులు, స్నేహితుడి సాయంతో రూ.26 లక్షలు వారి ఖాతాకు బదిలీ చేయించారు. సాదిక్‌ సోదరుడు ఇలియాస్‌ ఫిర్యాదుతో వన్‌టౌన్‌ పీఎస్‌లో క్రైమ్‌ నెం.200/2026గా పోలీసులు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ నెల 14న మధ్యాహ్నం 3 గంటలకు మదనపల్లె–బెంగళూరు రోడ్డులో నిఘావేసిన పోలీసులు సాదిక్‌తో సహా ఈ దుండగుల ముఠాను పట్టుకున్నారు. సాదిక్‌ను సురక్షితంగా విడిపించి నిందితులను అరెస్ట్‌ చేశారు. రూ.26 లక్షలు జమ అయిన ఖాతాను ఫ్రీజ్‌ చేశారు.

పరారీలో ప్రధాన నిందితుడు  
చిత్తూరు కట్టమంచికి చెందిన రాజా శ్రీనివాసులు అలియాస్‌ ఆర్‌.శ్రీనివాసన్, కర్ణాటక రాష్ట్రం మైసూరుకు చెందిన ఎం.పి.సోహన్‌భరత్, బెంగళూరుకు చెందిన కె.ఎన్‌.సార్థక్‌రాజ్, చేతన్‌రాజు, చిత్తూరు టౌన్‌ అంబేడ్కర్‌నగర్‌కు చెందిన పి.సురేష్ సింగ్, వేణుగుణశేఖర్‌లను పోలీసులు అరెస్టుచేశారు. వారినుంచి రెండు నకిలీ సీబీఐ ఐడీ కార్డులు, డమ్మీ పిస్టల్, జత చేతిసంకెళ్లు, 22 పేజీల ఫైల్, కేఏ–51–ఎంఎస్‌–0489 నంబరు ఇన్నోవా కారు స్వాదీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు తిరుపతికి చెందిన రమణ పరారీలో ఉన్నాడు.  

అందరూ స్నేహితులే..  
ఈ కేసులో నిందితులు ఏడుగురిలో ఐదుగురు, కిడ్నాప్‌ అయిన సాదిక్‌కి స్నేహితులే. ఆ ఐదుగురు, సాదిక్‌ వేర్వేరు కేసుల్లో నిందితులుగా ఉన్నారు. కేసుల విషయంలో కోర్టులకు వెళ్లినప్పుడు వీరంతా స్నేహితులయ్యారు. వేర్వేరుచోట్ల స్థిరపడ్డారు. ఈ నేపథ్యంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్న సాదిక్‌ను కిడ్నాప్‌ చేస్తే బాగా డబ్బు సంపాదించవచ్చని మిగిలిన నిందితులు స్కెచ్‌వేశారు. ఇందుకోసం మరో ఇద్దరిని కలుపుకొని సీబీఐ అధికారులుగా పంపి కిడ్నాప్‌ చేయించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement