రొయ్య రైతుపై ముప్పేట దాడి! | Aqua sector in disarray in Godavari and Krishna districts due to cyclones | Sakshi
Sakshi News home page

రొయ్య రైతుపై ముప్పేట దాడి!

Nov 16 2026 3:15 AM | Updated on Nov 16 2026 3:15 AM

Aqua sector in disarray in Godavari and Krishna districts due to cyclones

తుపాన్లతో నష్టం.. ధరలతో దెబ్బ.. ఫీడ్‌తో భారం!

మీనమేషాలు లెక్కిస్తున్న చంద్రబాబు సర్కార్‌

వరుస తుపానులతో ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లో కకావికలమైన ఆక్వా రంగం 

తుపాన్ల నష్టానికి తోడు ప్రాసెసింగ్‌ కంపెనీల కౌంట్‌ ధరల కోతలు 

100 కౌంట్‌ రొయ్యల ధర కిలోకు రూ.280 నుంచి రూ.230కి పతనం 

ఇతర కౌంట్లలోనూ రూ.20–60 వరకు తగ్గించిన కంపెనీలు

ఎనిమిది నెలల్లో టన్ను ఫీడ్‌పై రూ.28,870 పెంచిన కంపెనీలు

వెనామీ, టైగర్‌ రొయ్యల ఉత్పత్తి వ్యయం పెరుగుదలతో రైతులపై రెట్టింపు భారం 

అటకెక్కిన ఫార్మ్‌గేట్‌ కమిటీ.. అమలుకు నోచుకోని జీవో 180 

100 కౌంట్‌కు కనీసం రూ.280 మద్దతు ధర ఇవ్వాలని రైతు సంఘం డిమాండ్‌

సాక్షి, అమరావతి: వరుస తుపానులతో తీవ్రంగా నష్టపోయిన ఆక్వా రైతులను ప్రాసెసింగ్‌ కంపెనీలు కౌంట్‌ ధరల కోతతో మరింత కుదేలు చేస్తున్నాయి. ఒకవైపు తుపాన్ల ధాటికి చెరువులు, మౌలిక సదుపాయాలు ధ్వంసమై, చేతికొచ్చిన రొయ్యలను కాపాడుకోవడమే గగనంగా మారితే.. మరోవైపు ప్రాసెసింగ్‌ కంపెనీలు కౌంట్‌ ధరలను అడ్డగోలుగా తగ్గిస్తున్నాయి. కౌంట్‌కు రూ.20 నుంచి రూ.60 వరకు కోత విధించడంతో రైతులు విధిలేని పరిస్థితుల్లో ఉన్న సరుకును అయినకాడికి అమ్ముకోవాల్సి వస్తోంది.

ఇప్పటికే పెట్టిన పెట్టుబడులు దక్కక అల్లాడుతున్న రైతులకు ఫీడ్‌ ధరల పెంపు రూపంలో మరో భారం తోడైంది. ఉత్పత్తి వ్యయం పెరుగుతున్నా.. రొయ్యల విక్రయ ధరలు మాత్రం పతనమవుతుండటంతో ఆక్వా రైతులు కోలుకోలేని సంక్షోభంలో చిక్కుకుంటున్నారు. ఆదుకోవలసిన చంద్రబాబు ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. ఆక్వా రైతుల సమస్యలను గాలికొదిలేసి చోద్యం చూస్తోంది. 

తుపానుల దెబ్బకు కకావికలం 
ఉమ్మడి ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లో ఆక్వా రంగంపై వరుస తుపానులు తీవ్ర ప్రభావం చూపాయి. భారీ వర్షాలకు చెరువులు పొంగిపొర్లి పలుచోట్ల ఒకదానితో ఒకటి కలిసిపోయాయి. మరికొన్ని చోట్ల గండ్లు పడి చెరువుల్లోని రొయ్యలన్నీ కొట్టుకుపోయాయి. బయోసెక్యూరిటీ షెడ్లు, షేడ్‌నెట్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. విద్యుత్‌ స్తంభాలు విరిగిపోగా, ట్రాన్స్‌ఫార్మర్లు నేలకూలాయి. జనరేటర్లు సైతం పనిచేయని పరిస్థితి ఏర్పడింది. ఫీడ్‌ నిల్వలు, గోదాములు, కార్మికుల షెడ్లు దెబ్బతిన్నాయి. 

విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో చెరువుల్లో నీటికి ఆక్సిజన్‌ అందించే యంత్రాలను నడపలేక రొయ్యలను కాపాడుకోవడం రైతులకు కష్టంగా మారింది. దెబ్బతిన్న చెరువులను తిరిగి నిర్మించుకునేందుకే ఒక్కో రైతుకు రూ.5 లక్షలకు పైగా ఖర్చవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తుపాను నష్టాన్ని పూర్తిస్థాయిలో నమోదు చేయలేదని, అనేక ప్రాంతాల్లో ఇప్పటికీ విద్యుత్‌ సరఫరా పునరుద్ధరించలేదని రైతులు వాపోతున్నారు. 

కౌంట్‌ ధరల్లో అడ్డగోలు కోతలు 
తుపాన్ల కారణంగా దెబ్బతిన్న చెరువులను ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడటంతో రైతులు మిగిలిన రొయ్యలనైనా కాపాడుకునేందుకు ముందస్తు హార్వెస్టింగ్‌కు దిగుతున్నారు. సరిగ్గా ఇదే పరిస్థితిని ఆసరాగా చేసుకున్న ప్రాసెసింగ్‌ కంపెనీలు కౌంట్‌ ధరలను భారీగా తగ్గించాయి. కేవలం కొద్ది వారాల వ్యవధిలోనే 100 కౌంట్‌ రొయ్యల ధర కిలోకు రూ.280 నుంచి రూ.230కి పడిపోయింది. మిగిలిన కౌంట్లలోనూ రూ.20 నుంచి రూ.60 వరకు కోత విధించాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో పెద్దగా ప్రతికూల పరిస్థితులు లేకపోయినా, మార్కెట్‌కు సరుకు భారీగా వస్తోందన్న సాకుతో ధరలు తగ్గించడంపై రైతులు మండిపడుతున్నారు. తుపాన్లతో నష్టపోయి, మిగిలిన పంటను అమ్ముకునే సమయంలోనూ కంపెనీలు ధరలు తగ్గించడంతో కనీసం పెట్టుబడులైనా తిరిగి వస్తాయన్న ఆశ లేకుండా పోతోంది. 

ఫీడ్‌ ధరల పెంపుతో ఉత్పత్తి వ్యయం తడిసి మోపెడు 
ఒకవైపు రొయ్యల విక్రయ ధరలు పడిపోతుంటే.. మరోవైపు ఫీడ్‌ కంపెనీలు మేత ధరలను ఇష్టానుసారంగా పెంచుతున్నాయి. ప్రతి 45 రోజులకు ఒకసారి ఫీడ్‌ ధరలను సవరించుకునే వెసులుబాటును ఆసరాగా చేసుకుని గత నెలలోనే వెనామీ ఫీడ్‌ టన్నుపై రూ.9,350, టైగర్‌ ఫీడ్‌పై రూ.12,870 చొప్పున పెంచాయి. ఇలా ఎనిమిది నెలల్లోనే రైతుల ఏకాభిప్రాయం లేకుండా, అప్సడా చట్ట నిబంధనలకు విరుద్ధంగా టన్ను ఫీడ్‌పై రూ.28,870 మేర భారం మోపినట్టు రైతులు ఆరోపిస్తున్నారు. దీంతో వెనామీ రొయ్యల ఉత్పత్తి వ్యయం కిలోకు రూ.300, టైగర్‌ రొయ్యల ఉత్పత్తి వ్యయం కిలోకు రూ.450 మేర పెరిగిందని చెబుతున్నారు. పెరుగుతున్న పెట్టుబడులు, తగ్గుతున్న విక్రయ ధరల మధ్య ఆక్వా సాగు రైతులకు తీవ్ర నష్టదాయకంగా మారుతోంది.

ఫార్మ్‌గేట్‌ కమిటీ ఏమైంది?
గత ప్రభుత్వ హయాంలో అప్సడా చట్టం కింద మంత్రుల నేతృత్వంలోని రైతు సాధికార కమిటీ ప్రతి 15 రోజులకోసారి సమావేశమై కౌంట్‌ ధరల పతనాన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకునేది. ప్రస్తుతం ఆ వ్యవస్థ పనిచేస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. ముడిసరుకులను ఏడాదికోసారి కొనుగోలు చేస్తున్న ఫీడ్‌ కంపెనీలకు అంతర్జాతీయ ధరల హెచ్చుతగ్గులను సాకుగా చూపి 45 రోజులకోసారి ధరలు పెంచుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తోందని రైతులు ఆరోపిస్తున్నారు. 

కానీ రొయ్యల కౌంట్‌ ధరలను ఇష్టానుసారంగా తగ్గిస్తున్న ప్రాసెసింగ్‌ కంపెనీలపై మాత్రం నియంత్రణ లేకుండా పోయిందని విమర్శిస్తున్నారు. కౌంట్‌ ధరల క్రమబద్ధీకరణ కోసం తీసుకొచ్చిన జీవో ఎంఎస్‌ నంబర్‌ 180 అమలు కూడా అటకెక్కింది. ఫార్మ్‌గేట్‌ కమిటీని తక్షణమే సమావేశపరిచి ధరల పతనాన్ని అరికట్టాలని, కమిటీ నిర్ణయించిన ధరలకే కంపెనీలు రొయ్యలు కొనుగోలు చేసేలా ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థ ఏర్పాటు చేయాలని రైతు సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. 

గ్రేడ్‌ వారీగా మద్దతు ధరలు నిర్ణయించాలి 
జీవో 180 ప్రకారం రొయ్యల గ్రేడ్‌ను బట్టి ధరలు నిర్ణయిస్తే రైతులకు కొంతమేర ఉపశమనం లభిస్తుంది. గతంలో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ హయాంలో కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ రైతులకు మద్దతు ధర లభించేలా చర్యలు తీసుకున్నారు. ప్రస్తుత ప్రభుత్వం మాత్రం ఆక్వా రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదు. 100 కౌంట్‌ రొయ్యల ధరను కనీసం కిలోకు రూ.280 కంటే తగ్గకుండా నిర్ణయిస్తేనే రైతులు నష్టాల నుంచి కొంతవరకైనా బయటపడగలుగుతారు.   – టి.నాగభూషణం, ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఆక్వా రైతు సంఘం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement