అన్నమయ్య జిల్లా: మంత్రి రాంప్రసాద్‌కు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి సవాలు విసిరారు. ఇప్పుడు స్వేచ్ఛగా రాయచోటి మున్సిపాలిటీలో ఎన్నికలు నిర్వహిస్తే 20 వేల మెజారిటీ తగ్గితే రాజకీయాల నుంచి వైదొలగుతానని ఛాలెంజ్ చేశారు. రాయచోటిలో స్వేచ్ఛగా ఎన్నికలు జరిపే ధైర్యం మంత్రికి లేదని చెప్పారు. నామినేషన్ కేంద్రంలోకి మంత్రి చొరబడడం దారుణమని మండిపడ్డారు.
రామాపురం వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో గడికోట శ్రీకాంత్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘‘మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో రాజకీయాలను, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేనంతగా రాయచోటిలో విచ్చలవిడిగా రౌడీయిజం చేయడం మంత్రికే చెల్లింది. ఒక మంత్రిగా ఉండి కనీస బాధ్యత లేకుండా ఎస్కార్ట్ తో నామినేషన్ కేంద్రాల్లోకి చొరబడి మహిళలను దుర్భాషలాడి నామినేషన్ పత్రాలు చించడం నైతికమా? మంత్రికి ధైర్యం ఉంటే ఇప్పుడైనా రాయచోటి మునిసిపల్ చైర్మన్ ఎన్నికలు నిర్వహిస్తే 20,000 మెజారిటీ తగ్గితే రాజకీయాల నుంచి వైదొలుగుతా.
లూటీ చేయడం కోసమే మంత్రి డ్యూటీ తీసుకున్నారు. అభివృద్ధి కోసం, ప్రజల ఆర్థిక స్థితిని పెంచడం కోసం నేను డ్యూటీ తీసుకున్నా. నా చేతిలో రెండు సార్లు డిపాజిట్ లేకుండా ఓడిపోయిన మంత్రి నాతో కంపారిజన్ చేస్తారా? కేవలం పోస్టల్ బ్యాలెట్ తో గెలిచిన వ్యక్తి మంత్రి. స్వేచ్ఛగా ఎన్నికలు జరిపే ధైర్యం మంత్రికి లేదు, నామినేషన్లు వేస్తానంటేనే మంత్రికి భయం. రాజకీయ పార్టీలు, మేధావులు, ఎన్నికల సంఘం ఇలాంటి వాటిపై చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో ఓటర్లు పోలింగ్ బూత్ కి వెళ్లే పరిస్థితే ఉండదు.
ఎవరైనా ప్రశ్నిస్తే దాడులు చేయడం, అక్రమ కేసులు పెట్టడం, పోలీసులతో బెదిరించడం ప్రజాస్వామ్యం అంటే ఇదేనా? ఎన్నికల్లో పోటీ చేస్తామంటే వారిని వ్యక్తిగతంగా కృంగదియడం, వ్యాపారం పరంగా పతనం చేయడం, ఫోన్ లిఫ్ట్ చేసి బెదిరించడం బైండోవర్లు పెట్టడం ఇలా రకరకాలుగా వేధించడం తగునా? ప్రజాదారణ ఉంటే మంత్రికి గెలుస్తామని నమ్మకం ఉంటే ఏ ఎన్నికైనా సరే, మంత్రి స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు జరపాలి. 90 శాతం నేను గెలవకపోతే రాజకీయాలనుంచి శాశ్వతంగా వైదొలుగుతా? ప్రజల్లో భయం నింపి ధైర్యం పోగొట్టిన వ్యక్తి మంత్రి రాంప్రసాద్ రెడ్డి. ప్రజలు స్వేచ్ఛగా మాట్లాడే పరిస్థితిని కూడా దూరం చేసిన వ్యక్తి మంత్రి. నామినేషన్ సెంటర్లలో క్యాబినెట్ హోదాలో ఉన్న ఒక మంత్రి చొరబడి మహిళలతో దుర్భాషలాడి నామినేషన్ పత్రాలు చించడం, వారి మొబైల్ ఫోన్లు లాక్కోవడం ఎప్పుడైనా జరిగిందా?’’ అని నిలదీశారు.


