సాక్షి, శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలో బీజేపీ నేత చల్లా వెంకటేశ్వరరావు హల్చల్ చేశారు. ఎన్నికల విధుల్లో ఉన్న పోలీసులపైకి కారుతో దూసుకెళ్లారు. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను సైతం ఢీకొట్టారు. ఈ ఘటనలో సీఐ, ఎస్ఐ ఇద్దరూ గాయపడ్డారు.
కార్పొరేటర్‌గా నామినేషన్ దాఖలు చేసేందుకు వెళ్తున్న చల్లా వెంకటేశ్వరరావును పోలీసులు అడ్డుకోవడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. తన కారును అనుమతించడం లేదంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోలీసుల బారికేడ్లను కారుతో ఢీకొట్టి ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించారు.
ఈ ఘటనలో గాయపడిన సీఐ, ఎస్ఐలను పోలీసులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎన్నికల విధుల్లో ఉన్న పోలీసులపై బీజేపీ నేత వ్యవహరించిన తీరుపై స్థానికంగా చర్చ జరుగుతోంది.

ఇదీ చదవండి: రైల్వే ట్రాక్ పేలుడు కేసులో ఇద్దరి అరెస్ట్


