సాక్షి, ఏలూరు: ఏపీలో పంచాయతీ ఎన్నికల వేళ కూటమి ప్రభుత్వం కుట్రలు మరోసారి తెరపైకి వచ్చాయి. పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఓటర్ల లిస్టులో గందరగోళం నెలకొంది. ఏలూరు జిల్లా కైకలూరు మండలం భుజబలపట్నం పంచాయతీలో ఓటర్ల సంఖ్య తగ్గడం చర్చనీయాంశంగా మారింది.
కైకలూరు మండలం భుజబలపట్నం పంచాయతీలో ఎన్నికల వేళ నాలుగు వార్డుల్లో ఓటర్ల సంఖ్యను తగ్గించి, ఇతర వార్డుల్లోకి ఓట్లను మార్చేశారంటూ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఓటమి భయంతోనే కూటమి ప్రభుత్వం ఈ కుట్రకు పాల్పడుతోందని వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు విమర్శిస్తున్నారు. భుజబలపట్నం పంచాయతీలో మొత్తం 3,230 మంది ఓటర్లు ఉండగా.. 12 వార్డులు ఉన్నాయి. వీటిలో 9, 10, 11, 12 వార్డుల్లో దళిత ఓటర్లు అధికంగా ఉన్నారు.
ఒక్కో వార్డులో సుమారు 270 మంది ఓటర్లు ఉండగా.. వారిలో దాదాపు 200 మంది దళితులేనని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ నాలుగు వార్డుల్లోని ఓట్లను అధికారులు ఇతర వార్డుల్లో కలిపేశారని, తాజాగా విడుదలైన జాబితాలో ఒక్కో వార్డులో 100 మందిలోపే ఓటర్లు ఉన్నట్లు చూపిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఆ నాలుగు వార్డులు వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల వార్డులు కావడంతో ఓటర్ల లిస్ట్ తారుమారు చేసినట్టు తెలుస్తోంది. పోలింగ్ నాటికైనా ఓటర్ల జాబితాలో మార్పులు చేసి తమకు న్యాయం చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. జాబితాను సరిచేయకపోతే పంచాయతీ ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరిస్తున్నారు. అయితే ఓటర్ల జాబితా మార్పులపై అధికారుల వివరణ ఇంకా తెలియాల్సి ఉంది.
ఇదీ చదవండి: ఎన్నికల నామినేషన్లు.. మంత్రి రాంప్రసాద్ రెడ్డి హల్‌చల్


