జంగారెడ్డిగూడెం (బుట్టాయగూడెం): డెంగీ జ్వరంతో బాధపడుతూ జంగారెడ్డిగూడెం పట్టణం పేరంపేట రోడ్డులోని టౌన్‌షిప్ వద్ద నివాసం ఉంటున్న ముప్పిడి ఆదిలక్ష్మి (40) మృతి చెందింది. మున్సిపల్ మాజీ చైర్మన్ ముప్పిడి అంజి తెలిపిన వివరాల ప్రకారం పట్టణానికి చెందిన ఆదిలక్ష్మి గత ఐదు రోజులుగా తీవ్రమైన జ్వరంతో బాధపడుతూ ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం పొందింది. ప్లేట్‌లెట్లు పడిపోవడంతో కుటుంబసభ్యులు మెరుగైన వైద్యం కోసం ఆమెను విజయవాడకు తరలించారు. అక్కడ ప్లేట్‌లెట్స్ మరింత పడిపోయి మూత్రపిండాలు దెబ్బతిని ఆదిలక్ష్మి మృతిచెందినట్లు వైద్యులు తెలిపారని అంజి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, జగజ్జీవన్ నగర్‌కు చెందిన కొత్తూరు పేతురు అనే వ్యక్తి కూడా డెంగీ జ్వరంతో బాధపడుతున్నాడని, అతనికి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. వైద్యారోగ్య శాఖ అధికారులు తక్షణం స్పందించి ఆయా ప్రాంతాల్లో జ్వరాలపై సర్వే చేయించి, డెంగీ జ్వరాలు ప్రబలకుండా తగు చర్యలు తీసుకోవాలని అంజి విజ్ఞప్తి చేశారు.
ఏలూరు టౌన్: ఏలూరు చేపలతూము సెంటర్‌లోని ఓ వైన్స్ షాపు వద్ద మద్యం మత్తులో డబ్బులు డిమాండ్ చేసి, ఓ వ్యక్తిపై బ్లేడుతో దాడికి పాల్పడిన ఘటనలో నిందితుడు రౌతు శేషును టూటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నగరపాలక సంస్థలో స్వీపర్‌గా పనిచేస్తున్న కాకుమాను జాన్ ఈ నెల 12న రాత్రి మద్యం తాగి ఇంటికి వెళుతుండగా, బాలయోగి వంతెన ప్రాంతానికి చెందిన శేషు ఈ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో జాన్‌కు మెడపై, కుడిచేతి బొటనవేలికి గాయాలయ్యాయి. బాధితుడి సోదరి రజనీ అతడిని ఏలూరు జీజీహెచ్‌కు తరలించగా, వైద్యుల ఫిర్యాదు మేరకు టూటౌన్ సీఐ అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో ఏఎస్సై బండారు నాని కేసు నమోదు చేశారు. శనివారం ఉదయం నిందితుడిని అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు హాజరుపరిచినట్లు పోలీసులు తెలిపారు.
ద్వారకాతిరుమల: శ్రీవారి శాశ్వత నిత్యాన్నదాన పథకానికి శనివారం ఐదుగురు భక్తులు వేర్వేరుగా రూ.5,01,348 విరాళాలుగా అందించారు. ఇందులో భాగంగా ద్వారకాతిరుమల మండలం గుణ్ణంపల్లికి చెందిన పిల్లి రాంబాబు రూ.1,01,116, విజయవాడకు చెందిన తిరుమల్ల భాను వెంకట ఫణీంద్ర రూ.లక్ష, హైదరాబాద్‌కు చెందిన చవాకుల రామదాసు, మంగతాయారు దంపతులు రూ.1,00,116, భీమవరానికి చెందిన ఎ.సత్యనారాయణమూర్తి రూ.1,00,111, హైదరాబాద్‌కు చెందిన గురజపల్లి పద్మారావు, త్రివేణి దంపతులు రూ.1,00,005 విరాళంగా ఆలయ కార్యాలయం, నిత్యాన్నదాన కార్యాలయంలో జమ చేశారు. దాతలకు ఆలయ ఏఈఓ ఐ.రమణరాజు, సూపరింటెండెంట్ గోవాడ సుబ్రహ్మణ్యం, అన్నదాన సదనం గుమస్తా సింహాద్రి విరాళం బాండ్లను అందజేశారు.


