చలి పంజాకు రొయ్య గజగజ | - | Sakshi
Sakshi News home page

చలి పంజాకు రొయ్య గజగజ

Nov 15 2026 1:08 PM | Updated on Nov 15 2026 1:08 PM

చలి పంజాకు రొయ్య గజగజ

కైకలూరు : తుపానులు ఆక్వా రంగాన్ని కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి. అర్నబ్‌, మురసు వంటి తుపాన్లు ఒకదాని తర్వాత ఒకటి ఆక్వా రైతులను అతలాకుతలం చేయగా, మరోపక్క చలిపంజా దెబ్బకు రొయ్యలు గజగజ వణుకుతున్నాయి. ఒకప్పుడు సిరులు కురిపించిన ఆక్వారంగం, నేడు తీవ్ర ఆర్థిక ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ఈ చలికాలంలో రకరకాల వైరస్‌, బ్యాక్టీరియా వ్యాధులు చెరువులను చుట్టుముడుతున్నాయి. మరోపక్క, చాంతాడులా పెరిగిపోతున్న రొయ్యల మేతల ధరలను చూసి రైతులు క్రాప్‌ హాలిడే ప్రకటించే దుస్థితికి చేరుకున్నారు. ఇటువంటి గడ్డు పరిస్థితుల్లో మరో తుపాను విరుచుకుపడటానికి సిద్ధమవుతోందనే వార్త ఆక్వా రైతులను మరింత కలవరపెడుతోంది.

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో సాగు పరిస్థితి

ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో దాదాపు 3 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతోంది. ఇందులో చేపల సాగు 1.80 లక్షల ఎకరాలు కాగా, రొయ్యల సాగు 1.20 లక్షల ఎకరాల్లో విస్తరించి ఉంది. ప్రధానంగా రొయ్యల సాగుకు పేరుగాంచిన కై కలూరు నియోజకవర్గం కలిదిండి మండలంలో 30 వేల ఎకరాల్లో వెనామి రొయ్యలను సాగు చేస్తున్నారు. ఇటీవల వచ్చిన తుపానుల కారణంగా ఇరు జిల్లాల్లో ఏకంగా 60 శాతం వెనామీ రొయ్యల సాగు దెబ్బతింది. ప్రస్తుతం కేవలం 40 శాతం మాత్రమే సాగవుతోంది. చలికాలంలో విబ్రియో, ఈహెచ్‌పీ, వైట్‌ మజిల్‌, రన్నింగ్‌ మోర్టాలిటీ, వైట్‌ గట్‌, వైట్‌ స్పాట్‌ వంటి ప్రమాదకర వ్యాధులు రొయ్యల చెరువులను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. ఈ నేపథ్యంలో చలికాలంలో తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలను కై కలూరు మత్స్యశాఖ ఉపసంచాలకులు ఎం. రవికుమార్‌ వివరించారు.

చలికాలంలో పాటించాల్సిన ముఖ్యమైన పద్ధతులు

● తక్కువ సాంద్రత : చలికాలంలో రొయ్యలపై ఒత్తిడి తగ్గించడానికి సాధారణ పంటల కంటే తక్కువ సాంద్రతతో సీడ్‌ (పిల్లలను) వదలాలి.

● గుర్తింపు పొందిన సీడ్‌ : కోస్టల్‌ ఆక్వాకల్చర్‌ అథారిటీ (సీఏఏ) గుర్తింపు పొందిన హేచరీల నుంచి మాత్రమే వ్యాధి రహిత, పీసీఆర్‌ పరీక్ష చేసిన సీడ్‌ను తీసుకోవాలి.

● ఉష్ణోగ్రత నియంత్రణ : పగలు, రాత్రి ఉష్ణోగ్రతల మధ్య వ్యత్యాసాన్ని తగ్గించడానికి చెరువులో నీటి మట్టాన్ని 1.5 నుంచి 2.0 మీటర్ల (సుమారు 5–6 అడుగులు) వరకు ఉంచాలి. నీటి పీహెచ్‌ స్థాయిని 7.5–8.5 మధ్యలో స్థిరంగా ఉంచాలి.

● ఏరేటర్ల వినియోగం : మబ్బుగా ఉన్న రోజుల్లో, రాత్రి వేళల్లో కరిగిన ఆక్సిజన్‌ (డీఓ) స్థాయిలు తగ్గిపోతాయి. కాబట్టి ఏరేటర్లను ఎక్కువ సమయం పాటు నడపాలి.

● మినరల్స్‌ యాజమాన్యం : రొయ్యలకు గుల్ల వదులు (లూజ్‌ షెల్‌), నత్తగుల్ల సమస్యలు రాకుండా కాల్షియం, మెగ్నీషియం వంటి మినరల్స్‌ను క్రమం తప్పకుండా అందించాలి.

మేత యాజమాన్యంపై ప్రత్యేక శ్రద్ధ

● చలికి రొయ్యల జీర్ణక్రియ మందగిస్తుంది కాబట్టి సాధారణ రోజుల కంటే 20 శాతం నుంచి 30 శాతం వరకు మేతను తగ్గించాలి. ఉష్ణోగ్రత అకస్మాత్తుగా పడిపోయినప్పుడు మేత వేయడం ఆపాలి.

● చెరువు అడుగున మేత మిగిలిపోయి విషవాయువులు (అమ్మోనియా, హైడ్రోజన్‌ సల్ఫైడ్‌) ఏర్పడకుండా చెక్‌ ట్రేలను ఎప్పటికప్పుడు గమనించాలి.

● రొయ్యలలో రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి మేతతో పాటు విటమిన్‌ ఇ, విటమిన్‌ బి–కాంప్లెక్స్‌, గట్‌ ప్రోబయోటిక్స్‌ కలపాలి. చెరువు అడుగు భాగంలో వ్యర్థాలు పేరుకుపోకుండా సాయిల్‌, వాటర్‌ ప్రోబయోటిక్స్‌ వాడాలి.

● చలికాలంలో వైట్‌ స్పాట్‌ వైరస్‌ వ్యాపించే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పక్షులు, పీతలు చెరువులోకి రాకుండా ఫెన్సింగ్‌, బర్డ్‌ నెట్స్‌ ఏర్పాటు చేసుకోవాలి. ప్రతిరోజూ రొయ్యల కదలికలను గమనించి, ఏ చిన్న సమస్య కనిపించినా వెంటనే నీటి పరీక్షలు చేయించి నిపుణుల సలహా తీసుకోవాలి.

ఎం.రవికుమార్‌,

కై కలూరు మత్స్యశాఖ ఉపసంచాలకులు

ఉమ్మడి పశ్చిమలో 1.20 లక్షల ఎకరాల్లో రొయ్య సాగు

విజృంభిస్తున్న వైరస్‌, బ్యాక్టీరియా వ్యాధులు

మరో తుపాను హెచ్చరికలతో ఆక్వారైతు విలవిల

ముందస్తు జాగ్రత్తలే మేలంటున్న మత్స్యశాఖాధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement