ఆగిరిపల్లి : ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ, నిబంధనలను ఉల్లంఘించి టీడీపీ నాయకులు మంత్రి కొలుసు పార్థసారథి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం విమర్శలకు దారితీస్తోంది. ఆగిరిపల్లిలో శనివారం జరిగిన అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్టా మహోత్సవానికి విచ్చేస్తున్న మంత్రి కొలుసు పార్థసారథికి స్వాగతం పలుకుతూ టీడీపీ నాయకులు ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ రోడ్లు, ఆలయాల పక్కనే ఇలా ఫ్లెక్సీలు వెలవడం, సంబంధిత అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరించడంపై స్థానికులు మండిపడుతున్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు కావడంతోనే అధికారులు మినహాయింపు ఇచ్చారేమోనని స్థానికంగా చర్చించుకుంటున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి మండలంలో ఎన్నికల కోడ్ కఠినంగా అమలయ్యేలా తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
భీమవరం : వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్–2027 రాష్ట్రస్థాయి యువ పార్లమెంట్ పోటీలకు డీఎన్‌ఆర్ కళాశాలకు చెందిన ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్ ఎ. చైతన్య సాయి శ్రీజ ఎంపికై నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా. బీవీ నరసింహరాజు తెలిపారు. తాడేపల్లిగూడెంలో ఇటీవల నిర్వహించిన జిల్లా స్థాయి పోటీల్లో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశంపై చైతన్య సాయి శ్రీజ అద్భుతమైన ప్రసంగ ప్రతిభతో ప్రథమ బహుమతిని కై వసం చేసుకుని, రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించినట్లు ప్రిన్సిపాల్ వెల్లడించారు. ఈ సందర్భంగా విజేత శ్రీజను కళాశాల అధ్యక్షుడు జీవీ నరసింహరాజు, సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ జి. సత్యనారాయణ రాజు (బాబు) తదితరులు అభినందించారు.
ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయ విమాన గోపుర స్వర్ణమయ పథకానికి ఏలూరుకు చెందిన భక్తుడు పుప్పాల త్రిలోక్ ఆర్య శనివారం 80 గ్రాముల బంగారాన్ని సమర్పించారు. ముందుగా ఆలయానికి విచ్చేసిన ఆయన ఈ బంగారపు ముక్కను ఆలయ అధికారులకు అందజేశారు. అనంతరం దాత కుటుంబానికి అర్చకులు వేద ఆశీర్వచనాన్ని, ప్రసాదాలను అందించారు.
బుట్టాయగూడెం: జల్లేరు జలాశయంలోకి నిరంతరాయంగా చేరుతున్న వరద నీటిని నియంత్రించేందుకు, రానున్న ఆక్వాన్ తుపాను ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా శనివారం రాత్రి అధికారులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. స్పిల్‌వే ద్వారా 300 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు నీటిపారుదల శాఖ అధికారులు వెల్లడించారు. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 217.80 మీటర్లు కాగా, ప్రస్తుతం నీటి మట్టం 217.10 మీటర్లకు చేరుకుందని, జలాశయంలోకి 29 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోందని తెలిపారు. ఈ నేపథ్యంలో దిగువ ప్రాంతాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు.
ఇద్దరు ఆంధ్రా యువకుల అరెస్ట్
తిరుత్తణి: చైన్నె అయనావరానికి చెందిన రాజేంద్రన్ (50) శుక్రవారం తిరుత్తణి రైల్వేస్టేషన్ వద్ద బస్సు ఎక్కుతుండగా సెల్‌ఫోన్ చోరీ చేస్తున్న ఇద్దరు యువకులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు విచారణ చేపట్టగా, నిందితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడుకి చెందిన ఆవుల వెంకటేశ్వర్లు (19), విజయనగరానికి చెందిన చంద్రు (20)గా గుర్తించారు. అనంతరం వారిని అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం జైలుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.


