అధికారుల నిర్లక్ష్యం.. రైతులకు శాపం | - | Sakshi
Sakshi News home page

అధికారుల నిర్లక్ష్యం.. రైతులకు శాపం

Nov 15 2026 1:08 PM | Updated on Nov 15 2026 1:08 PM

అధికారుల నిర్లక్ష్యం.. రైతులకు శాపం

కాలువ పనులు చేపట్టలేదు

● ఇరిగేషన్‌ శాఖ నిర్లక్ష్యంతో కొవ్వాడ కాలువ గట్లకు గండ్లు

● అపార నష్టంపై రైతుల ఆగ్రహం

పోలవరం రూరల్‌ : అన్నదాతలను అతలాకుతలం చేసిన తుపాను విలయతాండవం వెనుక అధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపమే ప్రధాన కారణమని బాధితులు మండిపడుతున్నారు. కొవ్వాడ కాలువ మధ్యలో పెరిగిన తాడిచెట్లు, రెల్లి దుబ్బులు, తూడు మొక్కలను తొలగించడంలో ఇరిగేషన్‌ శాఖ విఫలమవ్వడం వల్లే గట్లకు భారీ గండ్లు పడి అపార నష్టం వాటిల్లిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల బాధ్యతారహిత వైఖరి కారణంగానే చేతికొచ్చిన పంట నీటిపాలైందని కన్నీరుమున్నీరవుతున్నారు.

ఇసుకను విచ్చలవిడిగా తోడేయడం వల్ల..

సంవత్సరాలుగా కాలువను గాలికొదిలేయడం వల్లే ఈ ముప్పు ముంచిందని స్థానికులు విమర్శిస్తున్నారు. కాలువలో ఇసుకను విచ్చలవిడిగా తోడేయడం వల్ల నీటి ప్రవాహ దిశ పూర్తిగా మారిపోయింది. వెంకటాపురం బ్రిడ్జి నుంచి పట్టిసం ఔట్‌ఫాల్‌ స్లూయిజ్‌ వరకు కొవ్వాడ జలాలు గోదావరిలోకి సాఫీగా చేరేందుకు తీవ్ర అవాంతరాలు ఏర్పడ్డాయి. వీటికి తోడు స్లూయిజ్‌ గేట్లు సకాలంలో పనిచేయకపోవడం వ్యవస్థ వైఫల్యానికి నిదర్శనం. ఇదంతా జరుగుతున్నా ఇంజనీరింగ్‌ అధికారులు కన్నెత్తి చూడకపోవడం దారుణం. అంతా సర్వనాశనం అయ్యాక ఇప్పుడు యంత్రాలతో ఇసుక మేటలను తొలగిస్తూ హడావుడి చేయడం హాస్యాస్పదమని రైతులు ఎద్దేవా చేస్తున్నారు.

ఇసుక దిబ్బలుగా పొలాలు

ఇటీవల వరుస తుపాన్ల ప్రభావంతో కొండవాగులు ఉగ్రరూపం దాల్చాయి. దీనికి తోడు ఎల్‌ఎన్‌డీపేట రిజర్వాయర్‌ వరద నీరు పోటెత్తడంతో, ఎలాంటి ముందస్తు సమాచారం లేదా హెచ్చరికలు లేకుండానే అధికారులు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. ఆ ఉప్పెన ధాటికి కొవ్వాడ కాలువ ఇరువైపులా గట్లు తెగిపోయాయి. ఈ గండ్ల కారణంగా వేలాది ఎకరాల పంట పొలాలు నీట మునిగిపోవడమే కాకుండా, కొండ ప్రాంతాల నుంచి కొట్టుకొచ్చిన ఇసుక పొరలు చేలల్లో పేరుకుపోయాయి. పొలాలు ఇసుక దిబ్బలుగా మారడంతో అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో అల్లాడిపోతున్నారు.

కాలువ గండ్లు పడడంతో ఉప్పొంగిన నీరు ప్రధాన రహదారిని దాటి పోలవరం వరకు చొచ్చుకువచ్చింది. పట్టిసీమ, పోలవరం ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పట్టిసం గ్రామంలోని బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించాల్సి వచ్చింది. ముందుచూపుతో వ్యవహరించి కాలువలోని అడ్డంకులను తొలగించే శాశ్వత పనులు చేపట్టినట్లయితే ఈ విపత్తు నుంచి ఎంతో కొంత రక్షణ లభించేదేమోనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరికొద్ది రోజుల్లో కోతకు రావాల్సిన పంట నీటిపాలవడంతో సర్వస్వాన్ని కోల్పోయిన తమను ప్రభుత్వం తక్షణమే ఆదుకుని స్పష్టమైన నష్టపరిహారం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement