పులివెందుల ఎంపీపీ ఎస్టీకి రిజర్వ్.. కానీ ఒక్క ఎంపీటీసీ స్థానమూ దక్కని వైనం
తలాతోక లేకుండా వ్యవహరించిన యంత్రాంగం.. ఎస్‌ఈసీ, ఈఓల మధ్య సమన్వయ లోపం
అత్యుత్సాహంతో ఏకగ్రీవం చేసుకుని, ఇప్పుడు నాలుక కరుచుకుంటున్న టీడీపీ
సాక్షి ప్రతినిధి, కడప: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో అధికార యంత్రాంగం వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామ్య స్ఫూర్తిని అపహాస్యం చేస్తోంది. రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) , జిల్లా ఎన్నికల అధికారి (డీఈఓ) తీరు తీవ్ర వివాదాస్పదమవుతోంది. నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి రాజ్యాంగ విలువలను తిలోదకాలు ఇస్తూ విధి నిర్వహణలో పారదర్శకతకు పాతరేశారు. ఇందుకు పులివెందుల ఎంపీపీ పీఠం కేటాయింపే ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తోంది.
అధికారుల ఏమరపాటు.. ఎంపీపీ ఎన్నిక అగమ్యగోచరం!
పులివెందుల మండల పరిషత్ అధ్యక్ష (ఎంపీపీ) స్థానాన్ని ఎస్టీ జనరల్‌కు కేటాయిస్తూ ఎస్‌ఈసీ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే, ఆ మండల పరిధిలో కనీసం ఒక్క ఎంపీటీసీ స్థానాన్ని అయినా ఎస్టీ జనరల్‌కు కేటాయించడంలో జిల్లా ఎన్నికల అధికారి (డీఈఓ) తీవ్ర నిర్లక్ష్యం, ఏమరపాటు ప్రదర్శించారు. మండలంలో మొత్తం 5 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, వాటిలో రెండింటిని ఓసీ మహిళలకు, ఒక్కొక్కటి చొప్పున ఓసీ జనరల్, బీసీ జనరల్, ఎస్సీ మహిళలకు రిజర్వ్ చేశారు. ఈ లెక్కన ఆయా కేటగిరీలకు చెందిన అభ్యర్థులు ఎన్నికయ్యారు. తీరా ఇప్పుడు ఎంపీపీ ఎన్నిక సమయానికి, మండల పరిధిలో ఒక్క ఎస్టీ జనరల్ ఎంపీటీసీ కూడా లేని విచిత్ర పరిస్థితి నెలకొంది. అసలు ఎస్టీ అభ్యర్థి లేకుండానే ఎంపీపీ పీఠాన్ని ఎలా భర్తీ చేస్తారన్న ప్రశ్న తలెత్తుతోంది.
ప్రశ్నార్థకంగా మారిన రిజర్వేషన్ల పారదర్శకత..
స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల కేటాయింపు ప్రక్రియ పారదర్శకతపై ఇప్పుడు తీవ్ర స్థాయిలో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిబంధనలను పక్కనపెట్టి, అధికార పార్టీ నేతలకు కావాల్సిన రీతిలో రిజర్వేషన్లు కేటాయిస్తూ వెళ్లారనే ఆరోపణలకు ఈ ఘటన మరింత బలం చేకూరుస్తోంది. జనాభా ప్రాతిపదికన, రోటేషన్ పద్ధతి నిబంధనలకు లోబడి రిజర్వేషన్లు ఖరారు చేసి ఉంటే, నేడు పులివెందుల ఎంపీపీ ఎంపిక విషయంలో యంత్రాంగం తలదించుకునే దుస్థితి దాపురించేది కాదని పలువురు సీనియర్ అధికారులే అభిప్రాయపడుతున్నారు.
సాధారణంగా జిల్లాల నుంచి వెళ్లే నివేదికల ఆధారంగానే ఎస్‌ఈసీ నోటిఫికేషన్ జారీ చేస్తుంది. ఆ నివేదికల ప్రకారమే ఎంపీపీ పీఠం ఎస్టీ జనరల్‌కు రిజర్వ్ అయింది. కానీ, క్షేత్రస్థాయిలో ఎంపీటీసీల రిజర్వేషన్ల కేటాయింపులో జరిగిన ‘మతలబు’ వల్లే ఎస్టీ జనరల్ స్థానం గల్లంతైందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల ఇష్టారాజ్యపు వ్యవహారశైలి కారణంగా నేడు జిల్లా యంత్రాంగం పరువు బజారున పడిందని పలువురు వాపోతున్నారు.
టీడీపీలో అంతర్మథనం
పులివెందుల మండల పరిధిలోని మొత్తం 5 ఎంపీటీసీ స్థానాల్లో ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు కనీసం ఒక్క నామినేషన్ కూడా దాఖలు చేయకుండా టీడీపీ నేతలు అడ్డుకున్నారు. ఫలితంగా ప్రత్యర్థులెవరూ లేకపోవడంతో ఐదు స్థానాల్లోనూ టీడీపీ అభ్యర్థులే ఏకగ్రీవమయ్యారు. తీరా ఇప్పుడు ఎంపీపీ ఎన్నిక సమయానికి అసలు పీఠాన్ని దక్కించుకోవాల్సిన ఎస్టీ అభ్యర్థే లేకపోవడం గమనార్హం. రిజర్వేషన్ల ప్రక్రియపై కనీస అవగాహన లేకుండా, అధికారుల అండతో అత్యుత్సాహం ప్రదర్శించి ఏకపక్షంగా వ్యవహరించడం వల్లే నేడు టీడీపీ నేతలు నాలుక కరుచుకోవాల్సిన పరిస్థితి తలెత్తిందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
‘పులివెందుల’ చిక్కుముడి వీడేదెలా?
పులివెందుల మండల పరిషత్ అధ్యక్ష (ఎంపీపీ) స్థానాన్ని ఎస్టీలకు రిజర్వ్ చేసి, మండలంలోని 5 ఎంపీటీసీ స్థానాల్లో ఏ ఒక్కటీ ఎస్టీలకు కేటాయించకపోవడంతో ఏర్పడిన సాంకేతిక చిక్కుముడి ఇప్పుడు చర్చనీయాంశమైంది. 5 ఎంపీటీసీ స్థానాలను టీడీపీ ఏకగ్రీవం చేసుకున్నప్పటికీ, ఎస్టీ అభ్యర్థి లేకపోవడంతో ఎంపీపీ పీఠం ఎవరికీ దక్కని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం, ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఈ సమస్యకు ఉన్న పరిష్కార మార్గాలపై న్యాయ, పరిపాలన నిపుణులు స్పష్టతనిస్తున్నారు.
1. ఎన్నిక వాయిదా.. ఎస్‌ఈసీకి నివేదిక:
నిబంధనల ప్రకారం, ఎంపీపీ ఎన్నికల రోజున జరిగే ప్రత్యేక సమావేశంలో ఎస్టీ కేటగిరీ నుంచి నామినేషన్ వేయడానికి అర్హులైన అభ్యర్థులు ఎవరూ లేకపోతే, ప్రిసైడింగ్ అధికారి ఎన్నికను వాయిదా వేస్తారు. అనంతరం జిల్లా ఎన్నికల అధికారి (కలెక్టర్) ఈ తప్పిదాన్ని వివరిస్తూ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖకు, ఎన్నికల సంఘానికి నివేదిక పంపుతారు.
2. ఎంపీపీ రిజర్వేషన్ గెజిట్ సవరణ
ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియ ఇప్పటికే పూర్తయినందున, మళ్లీ ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు మార్చి ఎన్నికలు నిర్వహించడం దాదాపు అసాధ్యం. కాబట్టి, ప్రభుత్వం ప్రత్యేక అధికారాలను ఉపయోగించి పులివెందుల ఎంపీపీ స్థానానికి గతంలో ఇచ్చిన ‘ఎస్టీ రిజర్వేషన్’ గెజిట్‌ను రద్దు చేయాల్సి ఉంటుంది. ౖ జిల్లా రోస్టర్ ప్రకారం ఎస్టీ ఎంపీపీ స్థానాన్ని భర్తీ చేయాల్సి ఉంటే, ఎస్టీ ఎంపీటీసీ సభ్యులు ఉన్న మరో మండల ఎంపీపీ స్థానాన్ని ఎస్టీకి మార్చి, పులివెందుల ఎంపీపీ పీఠాన్ని జనరల్ లేదా ఇతర అందుబాటులో ఉన్న కేటగిరీకి మారుస్తూ కొత్త నోటిఫికేషన్ జారీ చేయాలి.
3. తాత్కాలికంగా వైస్ ఎంపీపీకి బాధ్యతలు
రిజర్వేషన్ సవరణ, గెజిట్ మార్పు ప్రక్రియకు సమయం పట్టే అవకాశం ఉంది. అంతేకాకుండా, ఈ మార్పులపై ఎవరైనా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే మరింత జాప్యం జరగవచ్చు. మొత్తం మీద, రాష్ట్ర ఎన్నికల సంఘం మరియు పంచాయతీరాజ్ శాఖ తీసుకునే తదుపరి నిర్ణయంపైనే పులివెందుల ఎంపీపీ పీఠం భవితవ్యం ఆధారపడి ఉంది.


