రోడ్లులేక గిరిజనులకు కష్టాలు
శృంగవరపుకోట: పురిటి నొప్పులతో అవస్థలు పడుతున్న నిండుగర్భిణిని డోలీలో 10 కిలోమీటర్లు మేర డోలీలో మోసుకెళ్లాల్సిన దుస్థితి విజయనగరం జిల్లా ఎస్.కోట మండలం మూలబొడ్డవర పంచాయతీ పరిధిలోని చిట్టంపాడు గ్రామ ప్రజలకు ఏర్పడింది. చిట్టంపాడుకు చెందిన కేరంగి భాస్కర్ భార్య కుమారి నిండుగర్భిణి. శనివారం తెల్లవారుజామున పురిటినొప్పులు ఆరంభమయ్యాయి. నొప్పులతో అవస్థలు పడుతున్న కుమారిని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు బంధువులు సిద్ధమయ్యారు. మరో మార్గంలేక ఆడ, మగ అంతా సిద్ధమై డోలీ కట్టారు.
చిట్టంపాడు నుంచి శెనగపాడు వరకు 10 కిలోమీటర్ల దూరం రాళ్లు, రప్పలు, తుప్పలు, డొంకల మధ్య డోలీలో మోసుకొచ్చారు. శెనగపాడు నుంచి 108 వాహనంలో ఎస్.కోట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ క్షేమంగా ఉండడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.
ఈ సందర్బంగా గిరిజన సంఘం నాయకులు, గ్రామస్తులు మాట్లాడుతూ.. గిరిజన గ్రామాలకు రోడ్లు వేస్తానంటూ చెప్పిన డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌కు తమ డోలీ కష్టాలు కనిపించకపోవడం విచారకరమన్నారు. సీఎం చంద్రబాబు, స్థానిక ఎమ్మెల్యే లలితకుమారికి ఎన్నికల వేళ మాత్రమే గిరిజనులు గుర్తొస్తారని విమర్శించారు. ఇప్పటికైనా గిరిశిఖర గ్రామాలకు రోడ్లు వేయాలని గిరిజన సంఘ ప్రతినిధి జె.గౌరీష్ కోరారు.


