బాబు బడాయిలకు బడా కంపెనీల బ్రేక్‌! | Big corporates are a no brainer for the CII summit | Sakshi
Sakshi News home page

బాబు బడాయిలకు బడా కంపెనీల బ్రేక్‌!

Nov 15 2026 5:26 AM | Updated on Nov 15 2026 5:26 AM

Big corporates are a no brainer for the CII summit

99 పైసలకే భూమి.. అయినా ఏపీ వైపు చూడని కార్పొరేట్లు

దేశంలో ఎక్కడా లేని విధంగా 99 పైసలకే భూముల పందేరం 

భారీగా రాయితీల కోసం ప్రత్యేకంగా ఎస్క్రో ఖాతా అంటూ గతేడాది ప్రకటన 

అయినా ఈ ఏడాది సీఐఐ సమ్మిట్‌కు దిగ్గజ కార్పొరేట్లు డుమ్మా 

తిరిగి అధికారంలోకి వస్తామన్న నమ్మకం కోల్పోయిన చంద్రబాబు సర్కారు 

దీంతో ప్రభుత్వం మారినా మీ పెట్టుబడులకు భరోసా కోసం కొత్త చట్టమంటూ ప్రకటన 

తిరిగి తామే అధికారంలోకి వస్తామని ఎందుకు చెప్పలేకపోయారని టీడీపీ నేతల్లో అంతర్మథనం  

సాక్షి, అమరావతి: పారిశ్రామికవేత్తలు చంద్రబాబు బడాయి కబుర్లను నమ్మడం మానేశారా? ఈ పెద్దమనిషి చెప్పేవన్నీ అబద్ధాలే అని అర్థమైందా? లేని గొప్పలు చెప్పుకోవడంలో మాత్రం నంబర్‌ వన్‌ అని స్పష్టమైందా? తదితర ప్రశ్నలకు సీఐఐ పార్ట్‌నర్‌షిప్‌ సమ్మిట్‌ సమావేశాలే నిదర్శనమని పలువురు పారిశ్రామికవేత్తలు అంటున్నారు. రాయితీల కోసం ఎస్క్రో అకౌంట్, సావరీన్‌ గ్యారంటీ అంటూ హామీలిస్తున్నా, కార్పొరేట్లు రాకపోవడంతో చంద్రబాబు నాయుడు మరో అడుగు ముందుకేసి.. వచ్చే ఎన్నికల్లో మా ప్రభుత్వం అధికారంలోకి రాకపోయినా, మీ పెట్టుబడులకు ఎటువంటి ఢోకా ఉండదంటూ కొత్త రక్షణ చట్టం తీసుకువస్తున్నట్లు ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

విశాఖలో జరిగిన సీఐఐ పార్టనర్‌ షిప్‌ సమావేశాలకు కొర్పొరేట్‌ దిగ్గజాల్లో ఏ ఒక్కరూ హాజరు కాకపోవడం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. దేశంలో ఎక్కడా లేని విధంగా 99 పైసలకే భూమి, పెట్టిన పెట్టుబడిలో 80 నుంచి 90 శాతం దాకా రాయితీలిస్తామంటున్నా దిగ్గజ సంస్థలు రాష్ట్రం వైపు కన్నెత్తి చూడటం లేదు. రాష్ట్రంలో అమలవుతున్న రెడ్‌బుక్‌ రాజ్యాంగం, గత స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీ గూండాయిజంపై జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున చర్చ జరగడం ఏపీ బ్రాండ్‌ వేల్యూపై ప్రతికూల ప్రభావం చూపిందని, దీంతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి దిగ్గజ సంస్థలు వెనుకంజ వేస్తున్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. 

నమ్మకం కోల్పోయిన బాబు 
అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అయినా పారిశ్రామిక బకాయిలు తీర్చకుండా ఇప్పుడు ఎస్క్రో ఖాతాలంటూ చేస్తున్న డ్రామాలను పారిశ్రామికవేత్తలు ఎత్తిచూపుతున్నారు. గతేడాది సమావేశాల్లో పారిశ్రామిక రాయితీలు ఎప్పటికప్పుడు విడుదల చేయడం కోసం ఎస్క్రో ఖాతా పెట్టి, అందులో వేస్తామంటూ ప్రకటించి ఏడాది అయినా ఇంత వరకు ఒక్క రూపాయి కూడా వెయ్యలేదు. ఇప్పుడిదే విషయాన్ని పారిశ్రామికవేత్తలు నిలదీసేసరికి ఈసారి సమావేశాల్లో ఎస్క్రో ఖాతాలను తక్షణమే (గురువారం) ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. 

పాత బకాయిలకు ఈ ఎస్క్రో ఖాతాలు వర్తించవని, భవిష్యత్తులో విడుదల చేసే వాటికి మాత్రమే ఇది వర్తిస్తుందని స్పష్టం చేయడంపై బాబు మాటలను నమ్మేదెలా అని పారిశ్రామికవేత్తలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. పైగా చంద్రబాబు సర్కారు అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత మూట కట్టుకోవడం ఈ స్థానిక ఎన్నికల ఫలితాల్లో స్పష్టంగా కనిపించడంతో కార్పొరేట్‌ ప్రొటెక్షన్‌ యాక్ట్‌ అంటూ కొత్త పల్లవి అందుకున్నారు. అధికారం మారి వేరే పార్టీ అధికారంలోకి వచ్చినా, పెట్టుబడులకు రక్షణ కల్పించేలా దేశంలో ఎక్కడా లేని విధంగా కొత్త చట్టం తీసుకువస్తున్నట్లు ప్రకటించారు. 

వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టి కేంద్రానికి పంపిస్తామని, కేంద్రం అమోదిస్తేనే ఈ బిల్లు అమల్లోకి వస్తుందని మెలిక పెట్టడంతో బాబు గిమ్మక్కులను కార్పొరేట్లు ఇట్టే పసిగట్టేశారు.  కొత్త పెట్టుబడులను ఆకర్షించడంలో విఫలమవ్వడమే కాకుండా, తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం లేదన్న విషయాన్ని సదరు యాక్ట్‌ ద్వారా అంతర్జాతీయ సమాజానికి చాటి చెప్పారని ఆ పార్టీ నేతలు పలువురు తల పట్టుకు కూర్చున్నారు. ఎన్నికలకు రెండున్నరేళ్ల ముందుగానే ఇలా చేతులెత్తేయడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement