పులివెందులలో ఎస్‌ఈసీ మాయాజాలం
మండల పరిషత్ అధ్యక్ష పీఠం ఎస్టీలకు కేటాయింపు
మండలంలోని 5 ఎంపీటీసీ స్థానాల్లో ఒక్కటీ ఎస్టీలకు కేటాయించని వైనం
అభ్యర్థి లేకుండానే ఎంపీపీ ఎన్నిక ఎలా?.. అధికారుల్లో తర్జనభర్జన
పులివెందుల: రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) నిర్వాకం పులివెందులలో వింత పరిస్థితికి దారితీసింది. పులివెందుల మండల పరిషత్ అధ్యక్ష (ఎంపీపీ) స్థానాన్ని ఎస్టీలకు కేటాయించిన ఎన్నికల సంఘం.. మండలంలోని ఎంపీటీసీ స్థానాల్లో మాత్రం ఒక్కటి కూడా ఎస్టీలకు కేటాయించకపోవడం చర్చనీయాంశంగా మారింది. పులివెందుల మండలంలో మొత్తం 5 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. వీటి రిజర్వేషన్ల కేటాయింపులో భాగంగా జనరల్ మహిళకు 2 స్థానాలు, జనరల్‌కు 1 స్థానం, ఎస్సీలకు 1 స్థానం, బీసీలకు 1 స్థానం కేటాయించారు. దీంతో మండలంలో ఒక్క ఎస్టీ ఎంపీటీసీ సభ్యుడు కూడా లేకుండాపోయారు. అసలు ఎస్టీ ఎంపీటీసీ అభ్యర్థే లేనప్పుడు.. ఎస్టీలకు రిజర్వ్ అయిన ఎంపీపీ పీఠాన్ని ఎలా భర్తీ చేస్తారన్న ప్రశ్న అందరిలోనూ తలెత్తుతోంది.
ఏకగ్రీవం చేసుకున్నా.. పీఠం దక్కక టీడీపీ అవాక్కు
ఇటీవల జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం దౌర్జన్యానికి పాల్పడి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయనివ్వకుండా అడ్డుకుని మొత్తం 5 స్థానాలనూ ఏకగ్రీవం చేసుకుంది. ఎలాగైనా ఎంపీపీ పీఠాన్ని దక్కించుకోవాలని టీడీపీ నేతలు భావించారు. అయితే, సాంకేతిక తప్పిదం కారణంగా ఎంపీపీ స్థానం ఎవరికీ దక్కే పరిస్థితి లేదని తెలియడంతో అధికార పార్టీ నేతలు అవాక్కయ్యారు.
తిరిగి ఎన్నికలు నిర్వహిస్తారా?
ఎన్నికల సంఘం చేసిన ఈ తప్పిదంతో స్థానిక అధికారులకు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది. ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు సవరించి మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తారా? లేక ఎంపీపీ రిజర్వేషన్ మారుస్తారా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ వ్యవహారంలో ముందడుగు ఎలా వేయాలో తెలియక అధికారులు, అధికార పార్టీ నేతలు తర్జనభర్జనలు పడుతున్నారు.


